- ఇసుకపై జిఎస్టీ రద్దుకూ కేబినెట్ ఓకే
- ప్రకటించిన గనుల మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి (చైతన్య రథం): ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని గనుల మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడిరచారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన నాలుగో ఇ-క్యాబినెట్ భేటీలో దాదాపు 15 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను మంత్రుల బృందం సంయుక్తంగా వెల్లడిరచారు. అందులో భాగంగా రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర ఉచిత ఇసుక విధానంపై మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలను సవివరంగా ప్రకటించారు. సీనరేజ్ చార్జీల రద్దు వల్ల ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశామన్నారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పడంతో.. సీనరేజ్, జిఎస్టీ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే పట్టాభూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుకలేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారన్నారు.
‘ఐదేళ్లపాటు గత పాలకులు ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేశారు. నదీ గర్భాన్ని చీల్చి ఇసుకను దిగమింగారు. అంతటితో ఆగకుండా ఇసుక ధరలు పెంచి ప్రజలు, నిర్మాణదారులపై భారం మోపారు. అయితే ప్రజలకు ఇసుక కొనుగోలు భారం కాకూడదని, నిర్మాణ రంగానికి ఊతమివ్వాలన్న ఆలోచనతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీమేరకు కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం. స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను కేవలం సీనరేజ్, లోడిరడ్ ఛార్జీలు మాత్రమే తీసుకుని ప్రజలకు భారం లేకుండా సరఫరా చేశాం. జూన్ నుండి వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు ఎగువ ప్రాంతాలనుండి కూడా కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తడంతో ఇసుక తీయడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇలా రకరకాల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పుడున్న రీచ్‌లతో పాటు రాష్ట్రంలో మరో 108 కొత్త రీచ్‌లకు అనుమతి ఇచ్చాం. తద్వారా ఇసుక సరఫరా పెంచడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇసుక లభ్యతను మెరుగుపరచడానికి, అక్రమ రవాణాను నిరోధించి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి ఉచిత ఇసుక విధానంలో మరికొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ సంస్కరణలు 30 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం కలిగించడంతోపాటు నిర్మాణ రంగానికి ఎంతో ఉపకరిస్తుంది. సీనరేజ్, డీఎంఎఫ్, మెరిట్ ఫీజులకు మినహాయింపునిస్తూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. ఈ మూడిరటికి కలిపి టన్నుకు రూ.వంద వరకు చెల్లిస్తున్నారు. ఇకపై ఆ డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నదీ తీర గ్రామాల్లోని ప్రజలు నేరుగా సచివాలయాల్లో లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకుని ఉచితంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లే సదుపాయం కల్పిస్తున్నాం. వారి అవసరాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు కనుక తీసుకెళ్తే మాత్రం అడ్డుకట్ట వేస్తాం. అక్రమ తవ్వకాలకు పాల్పడినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పినిసరిగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలనే విధానం గతంలో ఉండేది. దాన్ని కూడా కొందరు బ్లాక్ మార్కెటింగ్‌కు ఉపయోగిస్తున్నారన్న సమాచారం ఉంది. దీనికి కూడా చెక్‌పెట్టేలా పాదర్శక విధానంతో ఆన్లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. వినియోగదారులు నేరుగా ఇసుక సరఫరా కేంద్రాలకు వచ్చి మీ సొంత వాహనం లేదా, మీరు బుక్ చేసుకున్న వాహనాల్లో మీకు కేటాయించిన సమయంలో ఇసుకను తీసుకొని వెళ్లొచ్చు. ఇసుక సరఫరా కార్యకలాపాలను నిర్వహించడానికి ఎంపిక చేసిన ఏజెన్సీలతో తవ్వకం, లోడిరగ్ కోసం ప్రజల సహాయాన్ని ఎంచుకుని, ఇన్వాయిస్ జారీ చేయడంపై కార్యాచరణ ఖర్చులకు ఖర్చు పరిమితం చేయబడుతుంది. ఇసుకను తీసుకెళ్లే అన్ని వాహనాలు జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయబడతాయి.
ఏవైనా ప్రమాదాలు జరిగినా గుర్తించడంతో పాటు అక్రమాలకు పాల్పడితే ఆ వెహికల్‌ను బ్లాక్స్ట్‌లో పెట్టడం, సీజ్ చేయడం, క్రిమినల్ కేసుల పెట్టడం లాంటివి చేస్తాం. బ్లాక్ మార్కెటింగుకు పాల్పడే వారిపైనా పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాలు వంటి ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేయడానికి వనరులు లేవు. ఈ ప్రాంతాల్లో కూడా నిరంతరాయంగా స్టాక్ యార్డుల ద్వారా ఇసుక సరఫరా జరిగేలా చేస్తాం. ఈ స్టాక్ యార్డుల ద్వారా వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇసుకను అందిస్తాయి. ఈ కార్యకలాపాలను జిల్లాస్థాయి ఇసుక కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ ద్వారా పారదర్శక ప్రక్రియతో పాటు మినరల్ డీలర్ లైసెన్స్ల ద్వారా స్టాక్ యార్డ్లు నిర్వహించబడతాయి. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఆయా మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు పటిష్టం చేస్తాం. అక్రమ వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి, నిరోధించడానికి, ఇసుక సరిహద్దులను దాటకుండా చూసేలా ఉంచేందుకు ఆయా ప్రధాన మార్గాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. కాల్‌సెంటర్ లేదా ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా చట్టవిరుద్ధమైన ఇసుక తవ్వకాలు లేదా రవాణాపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తాం. తద్వారా ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలను ప్రారంభిస్తాం’ అని మంత్రి కొల్లు వివరించారు.