సామాన్యుడిగా పుట్టి అసామాన్య రీతిలో శిఖరస్థాయికి ఎదిగిన రామోజీరావు ఇకలేరు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేసిన రామోజీ రైతుబిడ్డగా మొదలై అతిపెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. మీడియా సంస్థల సారథిóగా ప్రజాహితాన్ని కాంక్షించారు. అక్షరాన్నే ఆయుధంగా చేసుకుని ధర్మం కోసం ధైర్యంగా పోరాడిన యోధుడు. ధరిత్రి ఎరుగని చరిత్రను సొంతం చేసుకున్న నిత్యాక్షర చైతన్యశీలి. అఖండ తెలుగు నేలను అర్దశతాబ్దంపాటు నిష్పాక్షిక అక్షరాభిషేకంతో పునీతం చేసిన మీడియా దిగ్గజం. దుర్మార్గ పాలకుల దుష్టపోకడలను అక్షరాయుధంతో దునుమాడి.. సామాన్యుడికి బలమైన అండగా నిలిచిన అక్షరయోధుడు రామోజీ అనారోగ్యంతో కన్నుమూశారు.
- రాష్ట్రపతి, ప్రధాని, చంద్రబాబు, ప్రముఖుల సంతాపం
- తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు
- అధికార లాంఛనాలతో నేటి ఉదయం ఫిల్మ్‌సిటీలో అంత్యక్రియలు
- ఏపీలో రెండురోజులు సంతాప దినాలు
- రంగమేదైనా విజయం ఆయన సొంతం
- నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. రామోజీ అంత్యక్రియలు ఫిల్మ్ సిటీలో ఆదివారం ఉదయం 9`10 గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరుగుతాయి. రామోజీ మృతి కారణంగా ఏపీలో ఈ నెల 9, 10 తేదీల్లో సంతాపదినాలుగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మీడియా దిగ్గజం రామోజీ మృతితో తెలుగురాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబసభ్యులు తొలుత రామోజీకి.. తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి.. తన పేరును తనే పెట్టుకున్నారు. 1951లో ఆయన హైస్కూల్ విద్యాభ్యాసం ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన వివాహమాడారు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి దేశరాజధాని ఢల్లీికి మకాం మార్చారు. 1962లో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టిన తర్వాత ఢల్లీిలో ఉద్యోగాన్ని మానేసి వ్యాపారరంగంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సిద్ధం చేసుకున్నారు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. అనుకున్న లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు.. ఎన్నో చిత్రరాజాలను కూడా సృష్టించారు. దేశానికే తలమానికంగా రామోజీ ఫిల్మ్ సిటీని సృష్టించారు. ఆఖరి క్షణం వరకూ ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని ఆచరించిన మహనీయుడు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్..
రైతు నేపథ్యం ఉన్న రామోజీరావు 1962లో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థను నెలకొల్పారు. హిమాయత్ నగర్‌లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో సంస్థను ప్రారంభించారు. మార్గదర్శి ప్రచారం కోసం కిరణ్ యాడ్స్ పేరిట యాడ్ ఏజెన్సీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ, హైదరాబాద్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొలి యాడ్ ఏజెన్సీగా నిలిచింది. కొద్ది కాలానికే మార్గదర్శి రెండో శాఖను విశాఖపట్టణంలో నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో 113 శాఖలు, 3 లక్షలకుపైగా ఖాతాదారులు, 4100 మందికిపైగా ఉద్యోగులు, 18 వేలకుపైగా ఏజెంట్లతో చక్కటి వృద్ధిలో ముందుకు సాగుతోంది. 60 ఏళ్లలో లక్షలాదిమంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలు అందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు.
1969లో ‘అన్నదాత మాసపత్రిక’ ప్రారంభం
రైతు కుటుంబానికి చెందిన రామోజీరావు… రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెలకువలు నేర్పేందుకు 1969లో ‘అన్నదాత’ మాసపత్రికను స్థాపించారు. ఈ పత్రిక అనతికాలంలోనే తెలుగు రైతుల మనసులను దోచుకుంది. ఆధునిక సేద్యంలో రైతుల ప్రియనేస్తంగా మారిపోయింది. ఈ పత్రిక చందాదారులకు ప్రతి ఏడాది ఒక ఉచిత డైరీని కానుకగా అందిస్తుంటారు. ఆ తర్వాత వచ్చినవే ఈనాడులోని ‘రైతేరాజు’, ఈటీవీలోని అన్నదాత కార్యక్రమం, ఈటీవీ-2లోని జైకిసాన్. ఇప్పటికీ ‘అన్నదాత’ కార్యక్రమం ఈటీవీలో నిరంతరాయంగా కొనసాగుతోంది. నిత్యం కష్టాల సేద్యం చేసే రైతులకు సకాలంలో సలహాలు, సూచనలిచ్చే యంత్రాంగం లేదు.. పంటల సాగుపై వారికి సరైన పరిజ్ఞానం లేదు.. అందుచేత మన రైతాంగంలో ఆధునిక పరిజ్ఞానం పెంపొందించి, తోడ్పడాలనే ధ్యేయంతో ‘అన్నదాత’ అనే ఒక మాసపత్రికను ప్రారంభించినట్లు ఒక సందర్భంలో రామోజీరావు చెప్పారు.
ఇక ఆ తర్వాతి కాలంలో విశాఖపట్నంలో డాల్ఫిన్ పేరిట హోటల్‌ను కూడా నిర్మించారు. వ్యాపార పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్, విశాఖ, ఢల్లీిల మధ్య తిరుగుతూ క్షణం తీరిక లేకుండా కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న సమయంలో యాదృచ్ఛికంగా ఆయనకు ఈ ఆలోచన వచ్చింది.
ఈనాడు’ పత్రికకు బీజం పడిరది ఇలా..
1970 దశకంలో విజయవాడ, హైదరాబాద్‌లలోనే వార్తా పత్రికల ముద్రణ జరిగేది. విజయవాడలో తయారయ్యే పత్రిక విశాఖ చేరాలంటే మధ్యాహ్నం అయ్యేది. ఇదే విషయాన్ని నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్‌ఎన్ ప్రసాద్ వద్ద రామోజీరావు ప్రస్తావించారు. విశాఖలో పత్రికను ముద్రించాలని కోరారు. అయితే పత్రిక ప్రచురణ వ్యయ ప్రయాసలతో కూడినదంటూ ప్రసాద్ చెప్పిన సమాధానంతో రామోజీరావు ఏకీభవించలేకపోయారు. విశాఖలో తానే ఓ పత్రికను ప్రచురిస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ‘ఈనాడు’కు ఊపిరి పోశారు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా తన సొంత శైలితో ముందుకెళ్లారు. అప్పటి వరకు ఉదయాన్నే పత్రిక ముఖం చూడటం కొత్తయిన విశాఖ వాసులు ఈనాడు పత్రిక కోసం ఎగబడ్డారు. తన మార్కెటింగ్ నైపుణ్యాలతో పత్రిక సర్క్యులేషన్‌ను అనతి కాలంలోనే రామోజీరావు పెంచేశారు. ఏడాది గడిచిందో లేదో… 1975, డిసెంబర్ 17న ఈనాడు రెండో ఎడిషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. మరో రెండేళ్లకు విజయవాడ ఎడిషన్‌ను కూడా అట్టహాసంగా ప్రారంభించారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎడిషన్లతో ఈనాడు పత్రిక తెలుగు రాష్ట్రాల్లో అధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికగా నడుస్తోంది. జీవితాంతం ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించిన ఆయన… ‘ఈనాడు’ దినపత్రిక ద్వారా వేలమంది పాత్రికేయులను తయారు చేశారు. ఓ దిన పత్రికలో ‘సినిమా’కంటూ ఓ ప్రత్యేకమైన పేజీ తీసుకొని రావాలన్న ఆలోచనకు అంకురార్పణ చేసింది రామోజీ రావునే. ‘ఈనాడు’లో సినిమా పేజీ మొదలుపెట్టిన తరవాత అన్ని దినపత్రికలూ ఆయన్ని అనుసరించాయి.
ప్రపంచానికి తెలుగు రుచుల పరిచయం…
తెలుగువారి వంటకాల రుచులను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రామోజీరావు. 1980 ఫిబ్రవరిలో ప్రియా పుడ్స్‌ను ప్రారంభించారు. ప్రియా పచ్చళ్లు, స్నాక్స్ వినియోగదారుల మనసును దోచుకున్నాయి. అత్యున్నతమైన నాణ్యతతో వందల రకాల ఉత్పత్తులను ప్రియా పుడ్స్ ద్వారా తీసుకొచ్చారు. ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రియా పుడ్స్‌కు అనేక రాష్ట్ర జాతీయ పురస్కారాలు లభించాయి. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ ప్రియా ఉత్పత్తులకు మంచి గిరాకీ వుంది.
ఉషా కిరణ్ మూవీస్‌తో సినిమా రంగంలోకి
రామోజీరావు సినీ పరిశ్రమలోనూ విజయవంతమయ్యారు. సినిమా నిర్మాణ రంగంలోకి దిగిన రామోజీ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోనూ అవార్డులను కైవసం చేసుకున్నారు. సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్, చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్‌లను ఆయన నెలకొల్పారు. సినిమా పంపిణీ రంగంలో వాస్తవ లెక్కలను చూపుతూ మయూరి సంస్థ నిర్మాతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు తమ సినిమాల విడుదల విషయంలో ఈ పంపిణీ సంస్థ ఎంతో ఉపయోగపడిరది. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా తెలుగు సినిమా నిర్మాణాన్ని రామోజీరావు కొత్త పుంతలు తొక్కించారు. ‘స్టార్‌డం’ ఆధారంగా చిత్ర నిర్మాణం సాగుతున్న దశలో రామోజీ ‘కథే మా హీరో’ అన్న నినాదంతో చిత్ర నిర్మాణాన్ని చేసేవారు. కొన్ని సినిమాలకు వాస్తవ సంఘటనలను కూడా ఆయన ఎంచుకున్నారు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలు ఎలా పొందవచ్చో ఆయన చేసి చూపించారు. ఆయన నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమించు పెళ్లాడు, ప్రతిఘటన, మయూరి, మౌనపోరాటం, పీపుల్స్ ఎన్‌కౌంటర్, అశ్వని… వంటి సినిమాలు కొత్త తరహాగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామోజీకి భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. మంచి కథతో సరైన సినిమా తీస్తే ఎంతగా లాభాలు వస్తాయన్న విషయం ఆయనకు ‘ప్రతిఘటన’ సినిమా ద్వారా తెలిసిందని ఒక సందర్భంలో చెప్పారు. వివిధ భాషల్లో ఆయన 87 చిత్రాలను నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎంతో మంది నటులు పరిచయమై ఇవాళ అగ్రశ్రేణి నటులుగా ఉన్నారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చిన గొప్ప వ్యక్తి రామోజీ.
టీవీ రంగంలో ట్రెండ్ సెట్టర్
టీవీ రంగం ద్వారా వేలాది నూతన నటీనటులను బుల్లితెరకు పరిచయం చేశారు. టీవీ ప్రపంచంలో రామోజీరావుది చెరగని ముద్ర. ఈటీవీ… మీటీవీ.. అంటూ అద్భుతాలు సృష్టించిన వ్యక్తి ఆయన. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీని ప్రారంభించారు. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్‌వర్క్‌గా ఈటీవీ విస్తరించింది. ప్రతిక్షణం ప్రపంచ వీక్షణం పేరిట 13 భాషల్లో వార్తలు అందించారు. తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లు ప్రారంభించారు. విశ్వసనీయ వార్తా ఛానళ్లుగా ఈటీవీ న్యూస్ ఛానళ్లను తీర్చిదిద్దారు.
వినోద రంగాల్లోనూ తెలుగువారిని ఈటీవీ ఛానళ్లు అలరించాయి. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాలభారత్ ఛానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆలోచనల సమాహారంగా పేరొందిన ఆయన… బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఈటీవీ వినోదాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. రామోజీ ఆలోచనల నుంచి పుట్టిందే ‘పాడుతా తీయగా’’ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులపై సుమధుర సంగీత జల్లు కురిపించారు. వందల మంది గాయనీ గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎందరో సామాన్యులు రామోజీ ప్రోత్సాహంతో వినోద ప్రపంచంలో రాణించారు.
కళాంజలి పేరిట కళాఖండాలు..
ఈటీవీ ప్రారంభమైన ఏడాదే రామోజీ గ్రూప్ ‘కళాంజలి’ పేరిట కళాఖండాల విక్రయాలను ఎగుమతి చేసే విభాగాన్ని ప్రారంభించింది. దీనికి అనుగుణంగా వస్త్ర విక్రయ దుకాణాలను ప్రారంభించింది.
దేశానికే తలమానికం ‘రామోజీ ఫిల్మ్ సిటీ’
చిత్రరంగంలో అడుగుపెట్టిన ఆయన సినిమాల నిర్మాణంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా గమనించారు. దీంతో సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ నిర్మాణం దిశగా అడుగులు వేశారు. దాదాపు 1,666 ఎకరాల విస్తీర్ణంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ప్రపంచంలోనే అత్యంత భారీ స్టూడియోను నిర్మించారు. 1996 అక్టోబర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించారు. ఈ నిర్మాణం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకుంది. అంతేకాదు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఈ ‘సిటీ’ కొనసాగుతోంది.
కాలుపెడితే విజయమే..
మీడియా మొఘల్‌గా పిలుచుకొనే రామోజీరావులో భిన్న కోణాలు కనిపిస్తాయి. పత్రికా సంపాదకుడిగా, పబ్లిషర్‌గా, నిర్మాతగా, ఈటీవీ అధినేతగా, రామోజీ ఫిల్మ్‌సిటీ సారథిగా ఎన్నో రంగాల్లో తన ఆధిపత్యాన్ని చూపించారు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయఢంకా మోగించడం ఆయన గొప్పతనం. వ్యాపారపరంగా రాజీ పడని విధానం ఆయనది. ప్రతీరంగంలోనూ వ్యాపార కోణమే కాదు, రామోజీరావు అభిరుచి కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సాహితీ రంగంలో. సితార, విపుల, చతుర పేరుతో ‘ఈనాడు’కు అనుబంధంగా కొన్ని ఉప పత్రికలు వచ్చేవి. ముఖ్యంగా విపుల, చతురలో సాహిత్యానికి పెద్ద పీట వేసేవారు. చతుర నవలలు కొన్ని సినిమాలుగానూ వచ్చాయి. తక్కువ రేటుతో విలువైన పత్రికలు ఎలా నడుపుతున్నారో అని పాఠకులు సైతం ఆశ్చర్యపోయేవారు. మాతృభాష పునరుద్ధణోద్యమంలో భాగంగా ‘తెలుగు ` వెలుగు’ పత్రికను ప్రారంభించారు. ఇది రామోజీ మానస పుత్రికగా చెప్పుకోవొచ్చు. ఈ వయసులో కూడా తెలుగు ` వెలుగుని దగ్గరుండి చూసుకొన్నారు. ‘బాల భారతం’ పేరుతో పిల్లల కోసం ఓ మాస పత్రిక తీసుకొచ్చారు. ప్రింటింగ్ నాణ్యత ఎంతో గొప్పగా ఉండేది. రేటేమో తక్కువ. నాకు నష్టాలొచ్చినా ఫర్వాలేదు. సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరువ చేయాలని రామోజీ చెప్పేవారు. కాలక్రమంలో మేగజైన్‌లకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. మొదట సితార, విపుల, చతుర మూతబడ్డాయి. కరోనా కలంలో ‘తెలుగు వెలుగు’, ‘బాల భారతం’ కూడా ఆగిపోయాయి. అయితే ఈ పత్రికల రూపేణా రామెజీ తెలుగు సాహితీ లోకానికి అందించిన సేవలు మాత్రం మర్చిపోలేనివి.
‘రాజీ’ ఎరుగని రామోజీ!
రామోజీరావు డిక్షనరీలో రాజీ అన్న పదానికి చోటు లేదు. ‘రాజీ అనేది ఆత్మహత్యా సదృశం వంటిది’ అని ఆయన చెప్పేవారు. అందుకే, ఆయన ఇన్నేళ్ల జీవితంలో ఏ విషయంలోనూ ఎవరితోనూ రాజీ పడలేదు. మార్గదర్శి ఫైనాన్స్ విషయంలోనూ కేసులకు ఆయన అదరలేదు. అయితే అడుగిడిన ప్రతి రంగంలోనూ విజయం సాధించిన రామోజీరావు ఒక్క ‘న్యూస్ టైమ్’ ఇంగ్ల్లీష్ పేపర్ విషయంలో మాత్రం విజయం పొందలేకపోయారు. మొత్తంగా రామోజీరావు తెలుగు చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేయడమే కాక తన సంస్థల నిర్వహణ కోసం ఏకంగా కొన్ని వ్యవస్థలను నిర్మించుకొని ఆదర్శ వ్యక్తిగా నిలిచారు. వేల మందికి ప్రత్యక్ష ఉపాధి.. లెక్కనేనంత మందికి పరోక్ష ఉపాధి చేకూర్చారు. అందుకే రామోజీ యువతరానికి ముమ్మాటికీ మార్గదర్శే. విభిన్న రంగాల్లో సత్తా చాటిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.
గత 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలను, అకృత్యాలను, దోపిడీ, అవినీతి, అనాలోచిత నిర్ణయాలను, అసమర్థ పాలనను ధైర్యంగా ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రాక్షస పాలనను అంతం చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేస్తున్న పోరాటాలకు బాసటగా నిలిచి అవి అపూర్వమైన విజయం సాధించేందుకు ఎంతగానో తోడ్పడ్డారు. టీడీపీ కూటమి విజయాన్ని చూసిన తర్వాత తాను ఈ లోకానికి వచ్చిన పని పూర్తయిందన్నట్లు తృప్తిగా ఇక సెలవు అంటూ వెళ్ళిపోయారు ధన్యజీవి రామోజీరావు.
ఇలా సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి.. అసామాన్యుడిగా ఎదిగి.. ఎందరికో ఆదర్శంగా, స్పూర్తిగా, మార్గదర్శిగా నిలిచి తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఆ మహనీయునికి నివాళులు.
జీవించి ఉండగానే స్మారకం
జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. ‘మరణం ఒక వరం’, ‘నాకు చావు భయం లేదు’ అని చెప్పి చూపించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో స్మారకం ఉంది. రామోజీ వారసత్వం కొనసాగుతుంది. ఆయన చేసిన సేవలను భారతదేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది.