- దారులన్నీ ప్రజాగళం సభవైపే
- లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు
- గంటలో నిండిపోయిన 300 ఎకరాల ప్రాంగణం
- రోడ్లపైనా జనం బారులు
- కూటమి నేతల్లో ఆనందం
చిలకలూరిపేట: బొప్పూడినుంచి టీడీపీ-జనసేన-బీజేపీ జైత్రయాత్ర మొదలైంది. ప్రజాగళం పేరిట సాగిన సభకు జనం లక్షలాదిగా తరలివచ్చారు. కేవలం గంట వ్యవధిలో 300 ఎకరాల సభాప్రాంగణం నిండి పోయింది. రోడ్లపైనా జనం బారులు తీరారు. సభా ప్రాంగణం జన జాతరను తలపించింది. దారులన్నీ ప్రజాగళం సభ వైపేనన్నట్టు పల్నాడు జిల్లా బొప్పూడి బహిరంగ సభకు తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు భారీగా పోటెత్తారు. అధికార పార్టీ ఎన్ని ఆటంకాలు సృష్టించినా అంచనాలకు మించి లక్షలాది ప్రజల రాకతో కూటమి నేతలు అవధుల్లేని ఆనందంలో మునిగిపోయారు. సభకు వచ్చిన వారు ఒక వంతైతే లోపలికి రాలేక రోడ్లపై చిక్కుకుపోయిన వారు మూడొంతులున్నారు. ప్రజాగళం సభ ఏస్థాయిలో విజయవంతమైందో దీన్నిబట్టి అంచనా వేయొచ్చు. జగన్మోహన్‌రెడ్డి పాలనలో ధ్వంసమైన ఏపీ పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ ఏ విధమైన భరోసా ఇస్తారో వినేందుకు రాష్ట్రప్రజలు భారీగా తరలివచ్చారు.
సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానా శ్రయానికి చేరుకొన్న ప్రధాని మోదీ అక్కడినుంచి వాయుసేన హెలికాప్టర్‌లో 5 గంటలకు బొప్పూడి సభా ప్రాంగణానికి చేరారు. ప్రధాని మోదీకి హెలీప్యాడ్ వద్ద చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, పురంధ్రీశ్వరి స్వాగతం పలికి వేదికపైకి తోడ్కొని వచ్చారు. హర్షధ్వానాలతో లక్షలాది ప్రజలు ప్రధాని మోదీని స్వాగతించారు. సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 6.10కి బొప్పూడి నుంచి తిరిగి గన్నవరం చేరుకుని, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. మోదీకన్నా ముందు గానే మధ్యాహ్నం 3.50 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు సభాప్రాంగణానికి వచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. సభా ప్రాంగ ణానికి ప్రధాని నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్ర బాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధ్రీశ్వరి, టీడీపీ యువనేత నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేరుకున్నప్పుడు జయజయధ్వానాలతో లక్షలాది ప్రజల ఘనస్వాగతం పలికారు.
ప్రజాగళం సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 40 నిమిషాలపాటు ప్రసంగించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెరో 15నిమిషాల చొప్పున ప్రసంగించారు. ప్రజాగళం వేదికపైకి మూడు పార్టీలకు చెందిన 30 మందిని అనుమతించారు. పదేళ్ల తర్వాత తొలిసారిగా మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఒకేవేదికపైకి రావటంతో జాతీయమీడియా ప్రత్యేక ఆసక్తి చూపించింది. ఢల్లీినుంచి జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు పెద్దసంఖ్యలో బొప్పూడి చేరుకున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్రవాహనాలపై ప్రజలు సందడిగా సభకు చేరుకున్నారు. మహిళలు సైతం భారీగా తరలివచ్చారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది. సభకు వచ్చే ప్రజలకు మార్గ మధ్యంలోనే భోజనం, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు.
విజయవాడ, గుంటూరు, ఒంగోలువైపు నుంచి వేల సంఖ్యలో వాహనాలు సభకు చేరుకున్నాయి. ఆర్టీసీ పూర్తి స్థాయిలో బస్సులు ఇవ్వకపోవడంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. పదేళ్ల తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి రావటంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. బొప్పూడి ప్రజాగళం సభ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతమయింది. బొప్పూడి ప్రజాగళం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. బొప్పూడికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా తెదేపా, జనసేన, భాజపా జెండాలు రెపరెపలాడుతూ కనులవిందు చేశాయి. ప్రజాగళం సభకు చేరుకునేందుకు వేలాది వాహనాలు ఒకేసారి మంగళగిరి టోల్ గేట్ వద్దకు చేరుకోవడంతో నిర్వాహకులు కాసేపు టోల్ గేట్లు ఎత్తేశారు.