- రైతుకూలీలకు పింఛన్లు కూడా..
- సీఆర్డీఏలో ఉద్యోగాల భర్తీ, కొత్తగా 32 మంది కన్సల్టెంట్లు
- మంగళగిరి కార్పొరేషన్‌లో కలిపిన నాలుగు గ్రామాలు తిరిగి సీఆర్డీఏలోకి
- భూములు తీసుకున్న సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు మరో రెండేళ్లు గడువు
- ఐఆర్‌ఆర్‌తో పాటు, కృష్ణానదిపై ఆరు ఐకానిక్ వంతెనలు
- సీడ్ క్యాపిటల్‌పై సింగపూర్ ప్రభుత్వంతో తిరిగి చర్చలు
- జాతీయ రహదారికి అనుసంధానంగా ఈ-5,11,13,15 రోడ్లు
- సీఆర్డీఏ సమావేశం నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి నారాయణ
అమరావతిఅమరావతి (చైతన్యరథం): రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇస్తున్న వార్షిక కౌలును, రైతు కూలీలకు ఇచ్చే పింఛన్లను మరో ఐదేళ్లపాటు పొడిగించేలా సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్డ్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. గతంలో సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులను నియమించగా, ప్రస్తుతం వారిలో 249 మంది మాత్రమే ఉన్నారన్నారు. ఇప్పుడు మిగిలిన వారిని కూడా తీసుకునేందుకు నిర్ణయించామన్నారు. సీఆర్డీఏలో గతంలో 47 మంది కన్సల్టెంట్లు ఉండే వారని, వారిలో 15 కన్సల్టెన్సీల పనులు పూర్తి కావడంతో, మిగిలిన 32 మంది కన్సల్టెంట్లను ఇప్పుడు తీసుకోవడానికి అథార్టీ నిర్ణయించిందన్నారు.
గతంలో తమ ప్రభుత్వం 8,352.69 చదరపు కిలో మీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయించిందని, ఆ పరిధిని గత ప్రభుత్వం 6993.24 చదరపు కిలో మీటర్లకు కుదించిందన్నారు. అయితే పాత ఉత్తర్వుల మేరకు సీఆర్డీఏ పరిధి ఉండాలని సమావేశంలో నిర్ణయించారన్నారు. సీఆర్డీఏ పరిధి నుండి ఎక్కువ భాగం తీసేసి పల్నాడు, బాపట్ల అథారిటీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ అథారిటీలు అలాగే ఉంటాయని, వాటిలోని సీఆర్డీఏ భాగాన్ని మాత్రం వెనక్కి తీసుకుంటామన్నారు. గతంలో కోర్ క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్ల మేర ఉండేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించామన్నారు. అయితే ఇందులో 54 చదరపు కిలోమీటర్ల పరిధిలోని నాలుగు గ్రామాలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపారన్నారు. ఈ 54 చదరపు కిలోమీటర్లను తిరిగి కోర్ క్యాపిటల్ సిటీలో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని, అయితే ఈ విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు
గతంలో తమ ప్రభుత్వం సెంట్రల్ డివైడర్‌తో నాలుగు లైన్ల్ల కరకట్ట రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదిస్తే, గత ప్రభుత్వం ఆ రోడ్డును రెండు లైన్లకు కుదించిందన్నారు. గతంలో నిర్ణయించినట్లుగానే కరకట్ట రోడ్డును నాలుగు లైన్లుగా నిర్మించేందుకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్యాపిటల్ సిటీ ఎంత వరకు ఉంటే, అంత వరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుందన్నారు. 217 చదరపు కిలోమీటర్ల కోర్ క్యాపిటల్ సిటీలో తూర్పు నుండి పడమరకి ఒక రహదారి గ్రిడ్ ను ఏర్పాటు చేసి దాన్ని జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా నిర్ణయించామన్నారు. అయితే ఆ రహదారి గ్రిడ్ కు అనుసంధానంగా ప్రతి కిలో మీటర్ కు ఉండే రోడ్లలో ఈ-5,11,13,15 రోడ్లను కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయాలనే నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నామన్నారు. అదే విధంగా ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లు, ఈస్ట్రన్ బైపాస్ రోడ్డు వస్తున్నాయని, ఇప్పటికే చేపట్టిన వెస్ట్రన్ బైపాస్ రోడ్డు త్వరలో పూర్తవుతుందని తెలిపారు. వీటన్నింటినీ అనుసందానం చేస్తూ కృష్ణా నదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిలు వస్తున్నాయని తెలిపారు.
మరో రెండేళ్ల గడువు
రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు మరో రెండేళ్ల పాటు గడువు పొడిగించామన్నారు. అమరావతి ప్రాంతంలో దాదాపు 130 సంస్థలకు భూములను కేటాయించామని, ప్రస్తుతం వారి పరిస్థితి ఏమిటని తెలుసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఇప్పటికే వారితో చర్చలు జరిపారన్నారు. త్వరలో తాము కూడా భూములు తీసుకున్న సంస్థలతో సంప్రదింపులు జరపనున్నట్లు మంత్రి తెలిపారు. బిట్స్ పిలానీ వంటి సంస్థలను కూడా రాజధాని ప్రాంతానికి తీసుకు వచ్చేలా ప్రయత్నించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలను కూడా రాజధాని ప్రాంతంలో నిర్మించేలా చూడాలని రాష్ట్ర ఎంపీలకు సంస్థల వారీగా బాధ్యలను అప్పగించామన్నారు. ఆర్-5 జోన్ విషయం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో లీగల్‌గా స్టడీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి పరిధిలో నవ నగరాలు కూడా ఉంటాయని తెలిపారు. హ్యపీ నెస్ట్ ప్రాజెక్టును కూడా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అమరావతిలో నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అంచనా వేసే పని హైద్రాబాదు, చెన్నై ఐ.ఐ.టి. నిపుణులకు అప్పగించామన్నారు. హైద్రాబాదు ఐ.ఐ.టి. నిపుణులు శుక్రవారం అమరావతిలో పర్యటించి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాల సామర్థ్యాన్ని పరిశీలించారన్నారు. బహుశా శనివారం చెన్నై ఐ.ఐ.టి. నిపుణుల అమరావతిలో పర్యటించి అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాల సామర్థ్యాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. నిపుణుల బృందాల నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.