- ఊపందుకుంటున్న రాజధాని నిర్మాణ ప్రణాళిక
- రూ.15వేల కోట్ల సీఆర్డీఏ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే
- వరల్డ్ బ్యాంకు, ఏడీబీ ద్వారా నిధుల సర్దుబాటు
- నిధుల వినియోగానికి అనుమతిస్తూ రాష్ట్రం ఉత్తర్వు
- ప్రణాళిక అమలు తీరుపై సీఆర్డీఏకు దిశానిర్దేశం
- బ్యాంకులతో సీఆర్డీఏ ఒప్పందాలే తరువాయి..
- నేడో రేపో ఢల్లీి వెళ్లనున్న సీఆర్డీఏ కమిషనర్..
- నిధులు విడుదలైతే.. ‘అమరావతి’ పరుగులే!
అమరావతి (చైతన్య రథం): ఏపీ సార్ధక నామ ప్రాజెక్టులైన అమరావతి, పోలవరం సుస్థిరాభివృద్ధి పనులను ఏడాది చివరినుంచి మొదలుపెట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికి ప్రాణప్రదమైన రెండు ప్రాజక్టుల విషయంలో ఇప్పటికే సమీక్షలమీద సమీక్షలు నిర్వహించి.. ప్రణాళికా అమలుపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయడం తెలిసిందే. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్య ఛేదనకు అనుగుణంగా వేగంగా అడుగులేస్తోంది ఎన్డీయే సర్కారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ప్రణాళిక అమలు తీరుతెన్నులపై దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు `తాజాగా ప్రజా రాజధాని అమరావతి ప్రాజెక్టునూ మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. రాజధాని అమరావతి నగరం సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇవ్వనున్న నిధుల వినియోగానికి ప్రభుత్వం తాజా ఉత్తర్వులిస్తూ.. ప్రాజెక్టులో ఏయే అంశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశంపైనా సీఆర్డీఏకు దిశానిర్దేశం చేసింది. దీంతో అమరావతి నిర్మాణ ఘట్టం మరో అడుగు ముందకేసినట్టయ్యింది.
కేంద్ర బడ్జెట్ సమయంలో `ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులూ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందనీ ప్రామిస్ చేశారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసంతో దారుణంగా దెబ్బతిన్న రాజధానికి.. వనరులు సమీకరించడమే అతి పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో కేంద్రం చేసిన ప్రకటన ఏపీకి పెద్ద ఊరటయ్యింది. కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలోనే.. `అమరావతి పనుల ప్రారంభానికి ఉన్న అవరోధాలను చక్కదిద్ది నాలుగు నెలల్లోనే పనులు ప్రారంభించుకోవాలని అప్పట్లో సీఎం చంద్రబాబు సైతం ప్రకటించారు.
అన్నట్టుగానే ఈ డిసెంబరుకు అమరావతి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు `ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల నిధుల సర్దుబాటుకు ఏర్పాట్లు చేసింది. ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సైతం ఆమోదం తెలిపి అమరావతి నగర నిర్మాణం అభివృద్ధికి చెరో 800 మిలియన్ డాలర్లమేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. మిగతా నిధులను కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రూ.15 వేల కోట్ల నిధుల వినియోగానికి సంబంధించి ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం తాజా పరిణామం. అమరావతి అభివృద్ధి కోసం ప్రణాళికలు అమలు చేయాలని, ముఖ్యంగా, రోడ్లు, జలవనరులకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ నిధులతో చేపట్టాలంటూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో సీఆర్డీయేకి దిశానిర్దేశం చేసింది. అంటే, ప్రధాన రహదారులు, డక్ట్లు, డ్రెయిన్లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత తాగునీరులాంటి సదుపాయాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత నిర్మాణాలు, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం నిధులు వెచ్చించాలని ప్రభుత్వం సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకునుంచి నిధులు అందుకునేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు అధికారాలు కల్పిస్తున్నట్టూ రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమేరకు ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.అనంతరాము పేరిట తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోపక్క అమరావతి అభివృద్ధికి సీఆర్డీయే పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖా ఆమోదం తెలిపింది. ఇక ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సీఆర్డీఏతో ఒప్పందాలు చేసుకుని, నిధులు విడుదల చేయాల్సి ఉంది. అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికల ఆధారంగా దశల వారీగా బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటుకు నిర్ణయించారు.
రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికల కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులతోపాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఆధీనంలోనే ఈ అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలు అమలు చేయనున్నట్టు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే.. మరో అడుగు ముందుకు వేయడం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఢల్లీి వెళ్లనున్న సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్.. సోమ, మంగళవారాల్లో ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులనుంచి రుణ సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందంటున్నారు. ఆ ఘట్టం సైతం పూర్తై.. నిధుల విడుదల మొదలైతే.. అమరావతి నిర్మాణ పనులు పరుగందుకోవడం ఖాయం.
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి నిర్మాణంపై దృష్టి సారించింది.
ఐదేళ్లలో అడవిలా మారిపోయి.. రోడ్లు, కాలువలు, రైతులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియని దుస్థితిలో ఉన్న రాజధానిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించింది. రాజధాని మొత్తంలో కంపచెట్లను తొలగించేందుకే రూ.36 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచింది. మధ్యలో నిలిచిపోయిన రహదారులు, ఇతర ప్రధాన మౌలిక వసతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణకు మార్గాలు అన్వేషిస్తూనే.. కేంద్రం నుంచి ఆర్థిక సర్దుబాటుకు మార్గం సుగమం చేసింది.
రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల పనులు, రైతులకు స్థలాలిచ్చిన ఎల్పీఎస్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు రూ.50 వేల కోట్లకు పైగా వ్యయమవుతుందని మునుపటి తెదేపా ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. రూ.41 వేల కోట్లకు టెండర్లు పిలిచింది. రూ.5 వేల కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. గతంలో చేసిన పనులకు గుత్తేదారులకు రూ.1,300 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. రాజధాని పనులు మళ్లీ ప్రారంభించేందుకు గుత్తేదార్లు సిద్ధంగా ఉన్నారు. వారికి పెండిరగ్ బకాయిలు చెల్లిస్తే ఉత్సాహంగా పనులు మొదలుపెడతారు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా రంగం సిద్ధం చేస్తూ వచ్చింది. జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తూనే.. మళ్లీ డీపీఆర్‌లు, అంచనాలు సిద్ధం చేశామన్నది మున్సిపల్ మంత్రి పి.నారాయణ కొద్దిరోజులుగా చెప్తోన్న మాట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు అందుబాటులోకి రాగానే.. రాజధానిలో నిలిచిపోయిన పనులన్నీ సమాంతరంగా మొదలుపెడతామని మంత్రి చెప్తున్నారు.
ప్రధాన మౌలిక వసతుల పనులు కొలిక్కి..
ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాజధానిలో ప్రధాన రహదారులు, వంతెనలు, వరదనీరు, మురుగు నీటిపారుదల వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌ల అభివృద్ధి, కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం, విద్యుత్ సదుపాయాలు, నీటిసరఫరా వంటి మౌలిక వసతులకు రూ.17,000 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. వాటిలో సుమారు రూ.3,500 కోట్ల పనులు పూర్తయ్యాయి. రాజధాని పరిపాలన నగరంలో హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రుల నివాస భవనాలు, ఎమ్మెల్యేలు, అధికారులు నివాస భవనాల టవర్ల నిర్మాణానికి రూ.8,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వాటిలో రూ.1,505 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఆ అంచనాలన్నీ ఇప్పుడు పెరగొచ్చు.
కేంద్ర ప్రభుత్వం సమకూర్చే రూ.15 వేల కోట్ల నిధులతో రాజధానిలోని ప్రధాన మౌలిక వసతుల పనుల్ని, పరిపాలన నగరంలో భవనాల్ని దాదాపుగా ఒక కొలిక్కి తెచ్చే అవకాశం లేకపోలేదు. ప్రధాన మౌలిక వసతుల నిర్మాణం మొదలైతే.. రాజధానిలో భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొస్తాయన్నది ప్రభుత్వ అంచనా.