రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల కు వెళ్ళే వారిలో విద్యా ప్రమాణాలు లేవని ‘ అసర్ నివేదిక – 2022 ‘ తేటతెల్లం చేస్తోంది. దీనిని ప్రభుత్వం తో పాటు పౌరసమాజం సైతం అంత సీరియస్ గా తీసుకుంటున్న దాఖలాలు లేవు. అయినదానికీ, కానిదానికీ సామాజిక మాధ్యమాలలో స్పందించే వివిధ సంఘాలు, కుహనా మేధావులు ఇంతటి తీవ్ర సమస్యపై స్పందించక పోవటం ఆందోళన కలిగించే అంశమే. పుట్టుకతో సంబంధం లేకుండా, ప్రతి విద్యార్థికి నాణ్యమైన పాఠశాల విద్య అందించటం ప్రభుత్వ బాధ్యత. అది నెరవేర్చడంలో విఫలం కావటమే గాక, ప్రమాణాలు పడిపోతున్నాయి అని తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరించటం నిర్లక్ష్యానికి ప్రతీక గా భావించవచ్చు. పాఠశాల విద్య అభ్యసించే వారిలో అత్యధిక శాతం మందికి చదవటం, రాయటం అన్నది రాకపోవటం, వారంతా ‘ స్కూల్డ్ ఇల్లిటరేట్స్ ‘ గా మిగిలిపోవడం సాధారణ విషయంగా పరిగణిస్తే అంతకంటే ద్రోహం మరొకటి వుండదు.
పాఠశాల కు వెళ్ళే వారి సంఖ్య ఏయేటి కాయేడు పెరుగుతూ వుంది. ఇది శుభపరిణామం గానే భావించాలి. అయితే ఎక్కువమంది విద్యార్థులు కొన్ని సంవత్సరాల పాటు పాఠశాలలో చదువుతున్నా, చదవటం, రాయటం, చిన్న చిన్న లెక్కలు సైతం చేయలేక పోవటం ఆందోళన కలిగించే అంశమే. 1820 ప్రాంతంలో విద్యార్థులకు పాఠశాల కు వెళ్ళిన రెండు సంవత్సరాలలో నే చదవటం, రాయటం, లెక్కలతో పాటు జీవితానికి కావలసిన జ్ఞానం శతకాల రూపంలో నేర్పేవారు. అప్పటి మద్రాసు గవర్నర్ థామస్ మన్రో నివేదిక ఈ విషయాన్ని పొందుపరిచినట్టు చరిత్రకారులు చెబుతారు. అలా నేర్చుకోవటం లో వెనుకబడిన వారిని మాత్రమే మరో రెండు సంవత్సరాల పాటు పాఠశాలలో చదువుకునేందుకు అనుమతించేవారు. ఇప్పుడు పదవతరగతి కి వచ్చిన విద్యార్థులలో సైతం ప్రమాణాలు ఏమేరకు వున్నాయో తెలిసిందే. ‘ ప్రదమ్ ‘ అనే స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులలో నైపుణ్యాలపై శాస్త్రీయంగా సర్వే చేసింది.
ప్రతి ఏటా ఆ సంస్థ విడుదల చేసే నివేదికలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా వుంటున్నాయి. ప్రస్తుతం విద్యార్థి విజ్ఞానానికి మార్కులే కొలమానం అన్న భావజాలం వేళ్లూనుకుని వున్నది. కొన్ని సంస్థలు ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మార్కుల మత్తులో ముంచెత్తుతున్నాయి. రానురాను అది ఒక వ్యసనం లా తయారయింది. ప్రస్తుత పరిస్థితి ‘ సరైన సమాధానాలు కావాలంటే సరైన ప్రశ్నలు అడగాలి ‘ అన్న ఆంగ్ల సామెతను గుర్తుకు తెస్తోంది. ఈ విధమైన పరిస్తితి పై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం వుంది. ఉత్తమ సమాజ నిర్మాణంలో కీలక భూమిక పోషించే ఉపాధ్యాయ సంఘాలు సైతం దీనిపై దృష్టి సారించి, పరిస్థితిని చక్కదిద్దేందుకు వారి వంతు బాధ్యత నిర్వర్తించాలి.