- అప్పులు, అభివృద్ధిపై అలవోకగా అబద్ధాలు
- ఏపీలో హద్దులు దాటిన ఆర్థిక అరాచకత్వం
అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన అసమర్థ, అస్తవ్యస్త పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానంలో నోటికొచ్చిన అబద్ధాలు అలవోకగా చెప్పారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ఆరోపణలు తిప్పికొడుతూ యనమల వివరణ ఇచ్చారు.
1. సీఎం ఆరోపణ: రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అప్పులు తెచ్చాడు
వాస్తవం: తెదేపా హయాంలో 2 లక్షల కోట్లు అప్పు అని వైసీపీ హయాంలో రూ.3 లక్షల కోట్లు అని జగన్ చెప్పారు. బడ్జెట్ వెలుపల అసెంబ్లీకి తెలియకుండా చేసిన రూ.2 లక్షల కోట్ల అప్పులు దాచి పెట్టారు. అంటే ఈ పద్దు కింద వైసీపీ చేసింది రూ.5 లక్షల కోట్లు. ఇంకా కాగ్ కు కూడా తెలియని, చెప్పని అప్పులు, ఉద్యోగులకు బకాయిలు, కాంట్రాక్టర్లకు బిల్లులు.. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఎంతవుతుందో జగనే చెప్పాలి. ఈ అప్పు రూ.2 లక్షల కోట్ల కంటే 3 రెట్లు ఉంటుందో, 4 రెట్లు ఉంటుందో మీరే నిర్ధారించాలి. జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని అంపశయ్య పైకి చేర్చింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సైతం ఏపీ అప్పులపై అవాక్కయింది. రాష్ట్ర మొత్తం నికర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో అప్పులు 35 శాతం మించకూడదు అని ఆర్థిక నిబంధన వుంది. తెదేపా హయాంలో ఎప్పుడూ 35 శాతం మించలేదు. జగన్ రెడ్డి తెచ్చిన అప్పుల ఫలితంగా అది 45 శాతం దాటి పోయింది. కాగ్ కూడ వైసీపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది.
2. సీఎం ఆరోపణ: రెవెన్యూ లోటు బాగా తగ్గించాం
వాస్తవం: రాష్ట్రంలో అప్పులు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనపడదు. రాష్ట్ర రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. అదుపు తప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కాగ్ లెక్కలు అద్దం పడుతున్నాయి. రెవిన్యూ లోటు (రూ. కోట్లలో):
2018-19లో రూ.13,899 కోట్లు ఉన్న ద్రవ్యలోటు రెండు సంవత్సరాలలో రూ.35,541 కోట్లకు చేరింది. జగన్ హయాంలో మొదటి రెండు సంవత్సరాలు కలిపి రూ.62 వేల కోట్ల మేర ద్రవ్య లోటు. తెదేపా 5సంవత్సరాల లోటుకు ఇది సమానం. ఏ రాష్ట్రంలోనూ ఇంత లోటు లేదు.
2019-20/2020-21లో బడ్జెట్‌లో చూపని అప్పులు రూ. 26,907 కోట్లు, రూ.38,313 కోట్లు కలిపి చూస్తే ద్రవ్య లోటు 6.76 శాతం, 9.60 శాతంగా నిర్ధారణ అవుతుంది. తెదేపా హయాంలోని 4 శాతం ద్రవ్య లోటు నుండి 9.6 శాతానికి పెరగడం జగన్ ఘనత. 2022-23 సంవత్సర సమాచారం ఎన్నో లొసుగులతో ఉంది. ఫిబ్రవరి 2022, మార్చి 2022 ల మధ్య అనేక లోపాలున్నాయి. అందువల్ల ఆడిట్ అయ్యే వరకు వేచి చూడాలి.
3. సీఎం ఆరోపణ: ఆర్థిక నిర్వహణ ఎంతో మేలుగా ఉంది
వాస్తవం: ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అధ్వాన్నం అని, అప్పులపై వడ్డీలు చెల్లించేందుకు, రోజువారీ ఖర్చులకు అప్పు తెస్తున్నారని, రుణం తీసుకొని పాత అప్పులు తీరుస్తున్నారని, ఆస్తులు సృష్టించకుండా రెవెన్యూ ఖర్చులకు వినియోగిస్తున్నారని కాగ్ తీవ్రంగా దుయ్యబట్టింది. అంతే కాదు రహస్య అప్పులతో ప్రమాదమని కూడా హెచ్చరించింది. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఖర్చు చేసి సకాలంలో బిల్లులు రాక, అప్పులు తీర్చలేక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులకు సంబంధించి వివరణ కోరినా, ప్రభుత్వం స్పందించడం లేదని కాగ్ నివేదిక తెలిపింది. అంతే కాదు ఆదాయం కంటే చేస్తున్న అప్పులే అధికంగా ఉన్నాయని కాగ్ తెలిపింది
4. సీఎం ఆరోపణ : హామీలన్నీ అమలు చేసాం
వాస్తవం : హామీల అమలు గురించి జగన్ మాట్లాడడం విడ్డూరం. మీరు ఇచ్చిన హామీల అమల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో ఈ రోజుకూ పెన్షన్లు, జీతాలు ఇవ్వలేదు. రిటైర్ అయిన వారికి, పనులు చేసిన వారికి బిల్లులు లేవు.. మీ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం మాకు లేదు. రాష్ట్ర ఆదాయాన్ని గతంలోనూ పెంచి చూపించాం. మళ్లీ చేసే సత్తా మాకుంది. చివరిగా ఒక్క పెట్టుబడి రాలేదు.. ఒక్క కంపెనీ రాదు.. ఒక్క ఉద్యోగం రాదు.. ఆదాయం ఎలా పెరుగుతుంది జగన్‌రెడ్డీ? మీ అసమర్థ పాలన వల్లే రాష్ట్రం 3 దశాబ్దాలు వెనక్కి వెళ్లింది. ప్రజలు ఇంకా మీ అబద్ధాలను నమ్ముతారనుకోవడం మీ అవివేకం.
5 సీఎం ఆరోపణ: ఏ గ్రామానికి వెళ్లినా చంద్రబాబు చేసిందేమీ లేదు
వాస్తవం: మీ హయాంలో కొత్తగా ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మించారా? కొత్తగా ఒక్క ఎకరం సాగు విస్తీర్ణం పెంచారా? కొత్తగా ఒక్క రోడ్డు వెయ్యక పోగా రోడ్ల పై గుంటలు పూడ్చిన దిక్కు కూడా లేదు. ఒక్క హాస్పటల్ నిర్మించారా? ఒక్క పాఠశాల, కళాశాల నిర్మించారా?
6 సీఎం ఆరోపణ: వృద్ధి రేటు పెరిగింది..
వాస్తవం: 2019-20లో 6.8శాతం వృద్ధి రికార్డు అయిందని ముఖ్యమంత్రి కూడా గొప్పలు చెప్పారు. కానీ 2018-19 కంటే ఆదాయంలో ఒక శాతం కూడా పెరుగుదల లేదు. అంటే దాని అర్థం వృద్ధి రేటు చూపించుకోవడం కోసం 2018-19 జిఎస్‌డిపి అంకెలను తగ్గించి చూపారనే మా ఆరోపణకు ఆర్థికమంత్రి బుగ్గన సిద్ధాంతం అక్షరాల అన్వయిస్తుంది.
2020-21లో పాజిటివ్ గ్రోత్ రేట్ వచ్చిన ఏకైక రాష్ట్రం మనదేనని, 2021-22లో దేశంలోనే వృద్ధి రేటులో నెంబర్ వన్ స్టేట్ అని జగన్ గొప్పగా చెప్పారు. 2020-21లో దేశ వృద్ధి రేటు 6 శాతం ఉంటే, మణిపూర్, మేఘాలయ తప్పించి ఎక్కడా పాజిటివ్ వృద్ధి రేటు లేకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే పాజిటివ్ గ్రోత్ రేటును నమోదు చేసిందన్నారు. ఇదే ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2017, మార్చి 15న బడ్జెట్ పై పత్రికా సమావేశం నిర్వహించి.. చంద్రబాబు నాయుడు హయాంలో దేశ వృద్ధి రేటు కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం నమ్మశక్యం కానిదని, దేశం కంటే మనం గొప్పగా వృద్ది చెందుతున్నామని చెబితే అది పూర్తి అబద్ధమని తేల్చారు. మరి అదే ప్రకటన ఇప్పుడు కూడా వర్తిస్తుందా?
7. రాష్ట్రంలో పవర్ రంగంలోని కంపెనీలతో సహా ఏ పీయస్‌యూకు 4 సంవత్సరాలుగా ఆడిట్ జరపలేదు. కాగ్ చెప్పినా అప్పులను కప్పిపుచ్చడానికి ఆడిట్ జరపలేదు. కావున ఆ లెక్కలకు నిబద్ధత లేదు.
8. తెదేపా హయాంకు సంబంధించిన జీఎస్‌డీపీ లెక్కలు, కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన వైసీపీ హయాంలో జీఎస్‌డీపీ లెక్కలు ఇంకా నిర్ధారణ కావలసి ఉన్నది. ఈ రెండింటినీ పోల్చడం అసంబద్ధమవుతుంది.
9. అన్ని రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్‌కు కూడా కేంద్రం నిధులు ఇచ్చింది. విభజన కష్టాలు తెలుగుదేశంపార్టీ హయాంలో కూడా ఉన్నాయి. వీటిని సాకుగా చూపి ఆదాయం తగ్గిపోయిందని చెప్పడం అసమర్థతను కప్పిపుచ్చుకోవడమే. 2018`19లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.19 వేల కోట్లు అయితే 2022`23 లో రూ.43 వేల కోట్లు వచ్చింది. మరి దీనికేం చెబుతారు?
10. చంద్రబాబు హయాంలోనే రెవెన్యూ లోటు ఉంటుందని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మా హయాంలో చివరి సంవత్సరం రూ.18 వేల కోట్లు రెవెన్యూ లోటు ఉంటే మీరు ప్రతి సంవత్సరం రూ.36 వేల కోట్లు రెవెన్యూ లోటు చేశారు.