బీసీలకు రక్షణ కల్పించేందుకు బీసీ అట్రాసిటీ చట్టం తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు నియమించి చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం పెనుకొండ లో బోయ, కురుబా సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సామాజిక వర్గీయులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు ఇచ్చారు. 1983 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతోనే బీసీలకు ఆర్ధిక, రాజకీయ, సామాజిక స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థలలో బీసీలకు ఎన్టీఆర్ 20 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తే చంద్రబాబు దానిని 34 శాతం కు పెంచారన్నారు. ఎంఎల్ఏ, ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ, మంత్రి పదవులు బీసీలకు అత్యధికంగా కేటాయించింది టిడిపియేనని చెప్పారు. బీసీ సాధికార సమితులతో బీసీ సంక్షేమానికి పెద్ద పెట్ట వేస్తున్నట్టు తెలిపారు.
టిడిపి హయాంలో బోయ కార్పొరేషన్ కు ఏడాదికి రూ. 300 కోట్లు వంతున కేటాయించి ఖర్చు చేసినట్టు చెప్పారు. బోయలను ఎస్టీలలో చేర్చేందుకు 2017లోనే అసెంబ్లి లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం ఇటీవలే 15 కులాలను ఎస్టీ జాబితాలో చేరిందని, కానీ ఏపి ప్రభుత్వం కనీసం రాష్ట్రంలోని కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు నోరెత్తలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బోయ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకుండా ద్రోహం చేసిందని విమర్శించారు. కార్పొరేషన్ ఛైర్మన్ లకు కనీసం కుర్చీలేకుండా చేసిందని చెప్పారు. బీసీ సంక్షేమానికి ఎవరెంత ఖర్చు చేసింది బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేస్తే ఒక్కరూ ముందుకు రావటం లేదన్నారు. కురుబలకు గొర్రెల యూనిట్ లు ఇచ్చి ఆర్ధికంగా అముందుకు తీసుకెళ్లామని చెప్పారు. రూ.4 లక్షల లోన్ లో 50 శాతం సబ్సిడీ ఇచ్చినట్టు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం బీసీలపై అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఇప్పటివరకు 26వేల అక్రమ్ కేసులు పెట్టారని ఆరోపించారు. సమావేశంలో బోయ, కురుబ సామాజిక వర్గాలతో లోకేష్ జరిపిన ముఖాముఖి సంభాషణ ఈ విధంగా వుంది.
రమణ: మా జిల్లాలో బోయ,కురుబలకు రాజకీయ భద్రత కల్పించాలి.
లోకేష్: రానున్న కాలంలో చట్టసభల్లో బోయ, కురుబలకు రాజకీయంగా పెద్దపీట వేస్తాం.
రాజు: వాల్మీకీ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి.
లోకేష్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించే అంశంపై టీడీపీ కేంద్రంతో మాట్లాడింది. అధికారంలోకి వచ్చాక ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటాం.
గిరి: కురుబలు బీసీ-బీ కేటగిరీలో ఉంది. రిజర్వేషన్ పరంగా పోటీ ఎక్కువగా ఉంది. బీసీ-బీ నుండి వేరే కేటగిరీలోకి మార్చాలి.
లోకేష్: ఈ విషయాన్ని బీసీ కమిషన్ పరిశీలిస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. కురుబలకు అవకాశాలు తగ్గుతున్నాయంటే దానికి కారణం జగన్ రెడ్డి. కురుబలు ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయి గురించి ఆలోచించాలి.
బాలకృష్ణ: మేం వాల్మీకీ సామాజికవర్గం. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు?
లోకేష్: వాల్మీకీలకు కార్పొరేషన్ పెట్టి, నిధులు కేటాయించి, ఖర్చు చేసింది చంద్రబాబు. మేం అధికారంలోకి వచ్చాక గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తాం. జగన్ రెడ్డి పాలనలో వాల్మీకీలు తీవ్రంగా మోసపోయారు.
నాగేంద్ర: మేం కురుబ సామాజికవర్గం. అమరావతి రాజధానిలో మాకులదైవం కనకదాసు దేవాలయం నిర్మించాలి. మాకు గొర్రెల యూనిట్లు ఇవ్వాలి. వీరప్పగారి దేవాలయాలు నిర్మించాలి.
లోకేష్: కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం. గతంలోనే నేను హామీ ఇచ్చి ఉన్నాను. వీరప్పగారి దేవాలయం నిర్మాణం, అందులో అర్చకుల నియామకానికి ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం.
రామప్ప: వాల్మీకీ, బోయల్లో చదువుకున్న యువతకు రాజకీయ పదవులు కేటాయించాలి.
లోకేష్: పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తాం. సీనియర్, జూనియర్ అనే బేధాలు నేను చూడను. రాజకీయంగా పైకి రావాలనుకునే వారు క్షేత్రస్థాయిలో కష్టపడాలి.
ఆంజనేయులు: వాల్మీకీ బోయల్ని కేవలం 4జిల్లాల వారినే ఎస్టీ జాబితాలో చేరుస్తారా? రాష్ట్రమంతా చేస్తారా?
లోకేష్: ఎస్టీల ప్రయోజనాలు దెబ్బతినకుండా వాల్మీకీ, బోయల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తాం. కొంత మంది కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎట్టిపరిస్థితుల్లో మారదని గుర్తుపెట్టుకోండి.
రమేష్: హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో వాల్మీకీలకు సీటు ఇవ్వాలి. వాల్మీకీలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేయాలి.
లోకేష్: వైసీపీ పెట్టే అక్రమ కేసుల విషయంలో నేను కూడా బాధితుడినే. అక్రమ కేసులపై పోరాడుతున్న వారిపైనా వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోంది. చదువుకున్నవారిపై కుట్రపూరితంగా కేసులు పెడుతోంది. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ కేసులు పెట్టిన అధికారులపై జ్యుడీషియల్ విచారణ వేసి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా ప్రోత్సహిస్తాం.