హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత అన్నారు. న్యాయం కోసం ఐదేళ్ల్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ కేసులో సీబీఐపై ఒత్తిడి ఉందన్నారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? వారిని కాపాడుతోంది ఎవరు? సీఎం జగన్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారన్న దానిపై సునీత పలు వివరాలతో ఆమె పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి పట్టుపడుతున్నారని, దీంతో ఆయన అడ్డు తొలగిస్తే.. షర్మిలకు సపోర్టు ఉండదని, ఇక తమకు ఎదురు ఉండదని భావించి.. వివేకాను హత్య చేశారని.. ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి తనకు లభించిన ఆధారాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియ చేస్తున్నారని సునీత పేర్కొన్నారు. ఈ కేసులోని ప్రధాన నిందితులందరితో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. ఆయనతో వారు పలుమార్లు ఫోన్‌ల్లో మాట్లాడారన్నారు. అవినాష్‌రెడ్డితో వారు కలిసినప్పటి ఫొటోలు కూడా ఉన్నాయన్నారు. ఇన్ని ఆధారాలున్నా అవినాష్ మాత్రం, వారెవరో తనకు తెలియదని, వారితో ఎప్పుడూ మాట్లాడలేదని బుకాయిస్తున్నారన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటు అని ఎవరైనా అనుకుంటారా? అని ప్రశ్నించారు. మరి వివేకా గుండెపోటుతో చనిపోయారని మొదట్లో ఎందుకు చెప్పాల్సి వచ్చిందని నిలదీశారు. హత్య జరిగిన రోజు రాత్రి.. ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్, ఐపీడీఆర్ డేటాను సునీత వెల్లడిరచారు.
అవినాష్ అసూయ పడ్డారు..
మొదటి ఛార్జిషీట్ లో సీబీఐ నలుగురు నిందితుల పేర్లు చెప్పింది. దీనిలో ఏ1గా ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ (ఏ2), ఉమాశంకర్ రెడ్డి (ఏ3), దస్తగిరి (ఏ4) ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డితో ఎంపీ అవినాష్‌రెడ్డికి పరిచయం ఉంది. ఆయనతో సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ దిగిన ఫొటోలు ఉన్నాయి. వివేకా వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి,్డ కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. అవినాష్ మాత్రం వీళ్లెవరో తెలియదని అంటున్నారు. ఫొటోలు, ఫోన్ డేటా చూస్తే అతడితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి బలమైన నాయకుడు. ఆయన స్థాయికి.. చేరుకోవడం అసాధ్యమని అవినాష్ అసూయ పడ్డారు. అవినాష్ తండ్రి. మరో నిందితుడు భాస్కర్‌రెడ్డ్డి ఫోన్ డేటా పరిశీలిస్తే మార్చి 14 నుంచి 16 ఉదయం వరకు స్విచ్ఛాప్ ఉంది. వివేకా హత్య జరిగిన సమయంలో అవినాష్- ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ వెళ్లాయని సునీత చెప్పారు.
షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఇలా అనలేదే?
ఇటీవల వివేకా సోదరి విమలారెడ్డి చేసిన విమర్శలపై సునీత స్పందించారు. చనిపోయింది విమలమ్మ అన్న- ఆయనపై ఆమె చూపిన ప్రేమ ఇదేనా? ఆడపిల్లలు ఇలా బయటకొచ్చి మాట్లాడుతున్నారంటున్నారు. మా నాన్నకి కుమార్తెనైనా.. కుమారుడినైనా నేనే. షర్మిల పైనా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. గతంలో ఆమె 3200 కి.మీ పాదయాత్ర చేసినప్పుడు ఇలా అనలేదే? ఇప్పుడు మాత్రం విమర్శలా? న్యాయం కోసం సీఎం జగన్ సహా ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధం. గతంలో కొన్నిసార్లు ఆయనతో మాట్లాడాను. ఆ తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనికోసం లేఖలు కూడా రాశా అని సునీత తెలిపారు.
హత్యకు కొద్దిరోజుల ముందు ఓ సభలో వేదికపై అవినాష్ ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా వివేకా వెళ్లిపోతున్న దృశ్యాలను సునీత ప్రదర్శించారు. వివేకా ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు, హత్య జరిగిన తర్వాత సాక్షి మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వైకాపా నేతల వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. ఐదేళ్ల క్రితం తనది ఒంటరి పోరాటమని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ప్రజలకు నిజం తెలిసేందుకే వీటిని ప్రదర్శించినట్లు సునీత వివరించారు.