- బెయిల్ ఇచ్చేందుకు 24 కారణాలు చూపిన న్యాయమూర్తి
- అకారణంగా వ్యక్తి స్వేచ్ఛను హరించటం శిక్షించటమే అవుతుందని వ్యాఖ్య
- సీఐడీ ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోయిందన్న న్యాయస్థానం
- చంద్రబాబు ఇక రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు
అమరావతి: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరట దక్కింది. హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. సోమవారం తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్ రావు తీర్పు వెల్లడిరచారు. ఇదే కేసులో చంద్రబాబు ఇటీవలే మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చారు. మధ్యంతర బెయిల్ నిబంధనల ప్రకారం చంద్రబాబు ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి లొంగిపోవాల్సి ఉంది. అయితే చంద్రబాబు ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని.. 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. 28 లోగా చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాల్లేవు. నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం. చంద్రబాబు, తెదేపా ఖాతాకు నిధులు మళ్లింపుపై ఆధారాలు లేవు. తగిన ఆధారాలు లేకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయరాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిరది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు అంగీకరిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పేందుకు ఆధారాలు లేవని హైకోర్టు వివరించింది.
వాదనలు కొనసాగాయిలా..
రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు ఈ నెల 16న వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు.
సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి్డ వాదనలు వినిపిస్తూ.. లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంటుకు సీల్డ్ కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. బెయిల్ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు.. హైదరాబాద్ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్ మంజూరయిందన్న కారణంతో పిటిషనరుకు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదు. అందువల్ల బెయిల్ పిటిషన్ ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ రిమాండ్ మీద 52 రోజుల పాటు చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. అయితే ఆరోగ్య కారణాల కారణంగా ఏపీ హైకోర్టు చంద్రబాబుకి అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
ఇక, ఇప్పుడు సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. అది కూడా ఈ వారంలోనే వచ్చే అవకాశం ఉంది. అవినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనను అరెస్టు చేయటం చట్టవిరుద్ధమని, అందువల్ల ఈ కేసు ను కొట్టేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.
బెయిల్ మంజూరు విషయంలో న్యాయమూర్తికి పూర్తి విచక్షణాధికారమున్నా అట్టి అధికారాన్ని సద్వినియోగం చేసే దిశగా సరైన నిర్ణయం తీసుకోవడానికి కేసులోని ఇరుపక్షాల వాదనలను సమీక్షించి విచారణలో ఉన్న కేసుకు సంబంధించి ప్రాధమిక ఆధారాలను సమీక్షించడం ఉచితమని న్యాయమూర్తి తల్లా ప్రగడ మల్లిఖార్జునరావు వ్యాఖ్యానిం చారు. బెయిల్ మంజూరు దశలో కేసుకు సంబంధిం చిన వివిధ అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేకున్నా వాటిని ప్రాధమికంగా పరిశీలించా ల్సిన అవసరం ఉన్నదని చెబుతూ స్కిల్ కేసుకు సంబం ధించిన వివిధ అంశాలను విశ్లేషించి చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడానికి 26 కారణాలను ఈ క్రింది వరుస క్రమంలో వివరించారు:
1. స్కిల్ కేసులో రూ.370 కోట్లను వివిధ షెల్(డొల్ల) కంపెనీలకు మరలించారని, వాటిని చంద్రబాబు తో సహా వివిధ నిందితులు డ్రా చేసుకున్నారన్న సీఐడీ ఈ ఆరోపణకు మద్దతుగా ఎటువంటి ఆధారాలు చూపలేదు.
2. పెద్దస్థాయిలో తెలుగుదేశం పార్టీ అకౌంట్‌లోకి నిధులు జమ అయ్యాయని, వాటి వివరాల కోసం అక్టోబర్, నవంబర్‌లలో తేదేపాకు నోటీసులు ఇచ్చామని ప్రాసిక్యూషన్ వారు పేర్కొన్నారు. అయితే కేవలం ఈ ఆరోపణలతో స్కిల్ కేసులో దోచుకోబడ్డ డబ్బులు తేదేపా అకౌంట్లలోకి చేరాయని నిర్ధ్ద్వందంగా నిర్ణయించలేం.
3. తెదేపా అకౌంట్‌లోకి స్కిల్‌కేసులో దోచుకోబడ్డ నిధులు చేరాయని సీఐడీ ఆరోపించినా, అందుకు మద్దతుగా ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అటువంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ నిందితుడ్ని రిమాండ్ కోరేటప్పుడు ప్రాసిక్యూషన్ వారు బలమైన ఆధారాలు సమర్పించాలి. ఈ దశలో అటువంటి ఆధారాలు చూపలేకపోవడాన్ని ఇన్విస్టిగేషన్‌లోని లోపంగా పరిగణిస్తున్నాం.
4. స్కిల్ కేసులో ప్రధమ ముద్దాయి అయిన గంటా సుబ్బారావుకి మధ్యంతర బెయిల్‌ను నిర్ధారిస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రాధమిక ఆరోపణలు లేవని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఈ కేసులో రెండవ, మూడవ ముద్దాయిలకు ప్రీ అరెస్ట్ బెయిల్ మంజూరు చేస్తూ వారిపై చేయబడిన ఆరోపణలు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు సంబం ధించిన వివిధ పైళ్లను తత్సంబంధిత ఉన్నత అధి కారులకు సమర్పించకపోవడం మాత్రమేనని గతం లో హైకోర్ట్ వ్యాఖ్యానించింది.
5. స్కిల్ కేసులో 6వ ముద్దాయి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫండ్లను దారి మళ్లించినట్లు గాని, తన వ్యక్తిగత అకౌంట్లకు జమ చేసినట్లు గాని ఎటువం టి స్పష్టమైన ఆరోపణ చేయబడలేదు. 8వ ముద్దా యికి వ్యతిరేకంగా కూడా ఎఫ్‌ఐఆర్‌లో కానీ, రిమాండ్ రిపోర్ట్‌లోగాని, ఎటువంటి స్పష్టమైన ఆరోపణలు చేయబడలేదు. కనుకనే వారిద్దరికీ గతంలో బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
6. ముకుల్ చంద్ర అగర్వాల్‌ను పదవ ముద్దాయిగా సీఐడీ చేర్చినా ఆయనకు వ్యతిరేకంగా సీఐడీ తెలిపిన కొంత సమాచారంతో గతంలో హైకోర్ట్ విభేదించి 17.1.2022న బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఫండ్స్ దోచుకున్నట్లుగా జిఎస్‌టి అధికారులు ఎటువంటి ఆరోపణలు చేయలేదు.
7. బోగస్ బిల్లులతో స్కిల్ డెవలప్‌మెంట్ నిధులను దారి మళ్లించాడని శిరీష్ చంద్రకాంత షాను సీఐడీ స్కిల్ కేసులో 13వ ముద్దాయిగా చేర్చింది. తగిన ఆధారాలు లేకపోవడంతో షాకు కూడా హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది.
8. స్కిల్ కేసులో నిధులదారి మళ్లింపులో ప్రధాన పాత్ర పోషించినందుకు 20, 21, 22 మరియు 36వ ముద్దాయిలుగా పేర్కొన్నవారికి కూడా గతంలో ముందస్తు బెయిల్ లభించింది. అదే ఆరోపణలకు గురైన 35వ ముద్దాయికి సుప్రీంకోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
9. వివిధ రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సీమెన్స్ మరియు డిజైన్‌టెక్ కంపెనీలు ఆ మేరకు అందించవలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేయలేదని ప్రాసిక్యూషన్ వారు ఎక్కడా స్పష్టం చేయలేదు. స్కిల్‌కేసులో నాల్గవ ముద్దాయి బెయిల్ పిటిషన్ సందర్భంగా గతంలో రాష్ట్ర హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి మల్లిఖార్జునరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు: ‘‘రికార్డుల ప్రకారం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద 2,13,000 విద్యార్ధులు శిక్షణ పొందినట్లు వారికి ఆ మేరకు సర్టిఫికెట్లు కూడా మంజూరైనట్లు వెల్లడైంది. ఇతర పలు కంపెనీలు ఇచ్చిన సర్టిఫికెట్ల ప్రకారం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నిధులు శిక్షణ కోసం ఉపయోగించబడినట్లు స్పష్టమౌతోంది’’.
10. 2014-16 కాలంలో సీమెన్స్ ఇండియాకు చెందిన సుమన్‌బోసు మరియు డిజ్కెన్ టెక్‌కు చెందిన వికాస్ కాన్వేల్కర్‌ల మధ్య నిధుల మార్పిడికి సంబంధించి పలుసార్లు సోషల్ మీడియాలో సంభాషణలు జరిగినట్లు సీఐడీ ఆరోపించింది. అయితే ఆ సంభాషణలు ప్రస్తుతం స్కిల్ కేసులో జరిగినట్లుగా చెప్పబడుతున్న నిధుల దోపిడీకి సంబంధించిందని స్పష్టంగా వెల్లడికాలేదు. ఆ సంభాషణలతో చంద్రబాబుకున్న సంబంధంపై కూడా స్పష్టత లేదు. ప్రాసిక్యూషన్ వారు కూడా ఈ నిధుల యొక్క మూలాలు, వాటి మార్పిడి లక్ష్యాలను ఆ సందేశాల ద్వారా నిర్ధారించలేమని అంగీకరించారు.
11. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్న స్థలం, తేదీలకు సంబంధించి సీమెన్స్ మరియు డిజ్కెన్ టెక్ వారు పరస్పర విరుద్దమైన సమాచారం తెలిపినట్లు శరత్ అండ్ అసోసియేట్స్ వారు తమ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో వెల్లడిరచినట్లు సీఐడీ పేర్కొంది. అయితే ఆ విషయం తేల్చాల్సింది సీఐడీ మాత్రమే. స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబం ధించి కుదుర్చుకున్న త్రెపాక్షిక ఒప్పందంపై చంద్ర బాబు సంతకం చేయలేదు కనుక దానితో ఆయన కు ఎట్టి సంబంధం లేదు. స్కిల్ ఒప్పందంలో బ్యాంక్ గ్యారంటీ క్లాజ్‌ను చంద్రబాబు ఆదేశాలతో తొలగించారని పేర్కొన్న సీఐడీ…అలా అని ఏ సాక్షి చెప్పారో వెల్లడిరచలేదు.
12. స్కిల్ ఒప్పందం కుదుర్చుకున్న తేదీని ప్రస్తావించక పోవడానికి, సీమెన్స్ ప్రతినిధిగా సౌమ్యాద్రి శేఖర్ బోస్‌గా ఒక చోట, సుమన్ బోస్‌గా మరోక చోట పేర్కొనడానికి చంద్రబాబు బాధ్యులు కారు. అప్పటి ముఖ్యమంత్రిగా అటువంటి వాటిని గుర్తించవలసిన బాధ్యత ఆయనది కాదు.
13. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన శరత్ అండ్ అసో సియేట్స్ కంపెనీ.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎటువంటి న్యాయపరమైన విషయాల్లో తాము సాక్షిగా ఉండబోమని, ఎవరి తరపునా ఎటువంటి అభిప్రాయాన్ని తెలియచేయబోమని స్పష్టం చేసిం ది. అలాగే ఈ రిపోర్ట్ తమ క్లయింట్ అయిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వినియోగం కొరకు మాత్రమే ఇచ్చామని, ఇతరులెవ్వరూ దానిని వాడు కోరాదని కూడా స్పష్టంచేసింది. ఇతరులు ఎవరైనా (సీఐడీ) ఈ రిపోర్ట్‌ను వాడుకోదలిస్తే దానికి తాము ఎట్టి బాధ్యత వహించమని తెలిపింది. అంతేకాకుం డా ఈ నివేదిక సమగ్రతను, వాస్తవికతను నిర్ధారిం చడం తమ బాధ్యత కాదని కూడా వివరించింది. అట్టి నివేదికలో ఎత్తిచూపబడిన పరస్పర వైరుధ్యా లతో కూడిన విషయాలకు, చంద్రబాబుకు ఎట్టి సంబంధమూ లేదు.
14. గుజరాత్‌లో అమలౌతున్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను సందర్శించిన బృందంలో అప్పటి ఆర్ధిక శాఖ కార్యదర్శి కె.సునీత కూడా ఉన్నారు. అక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ అమలుపై సానుకూల నివేది కను ఇస్తూ ఆంధ్రపద్రేశ్‌లో కూడా దాని సత్వర అమలుకు నిధులు విడుదల చేయవలసిందిగా ఆ బృందం నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో స్కిల్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగినట్లు పేర్కొన్న సీఐడీ సునీత తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని ఎక్కడా పేర్కొనలేదు.స్కిల్ ప్రాజెక్ట్ అమలులో ఏసెంటర్‌లో కూడా అవసరమైన మేరకు తగిన సాంకేతిక మౌలి క సదుపాయాలు లేవని సీఐడీ చెప్పలేదని చంద్ర బాబు తరపున న్యాయవాదులు ఎత్తిచూపారు.
15. అప్పటి ఆర్ధిక శాఖ కార్యదర్శి వారించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే డిజైన్ టెక్‌కు నిధులు విడుదల జరిగిందని సీఐడీ పేర్కొం ది. అట్టి నిధుల దారి మళ్లింపుకు సంబంధించి.. ప్రత్యేకంగా చంద్రబాబు వ్యక్తిగత లేదా ఆయన పార్టీ అకౌంట్లలోకి ఆ నిధుల మళ్లింపుకు సంబం ధించి ఎటువంటి ఆధారం చూపకుండా కేవలం నిధుల విడుదలకు సంబంధించిన ఉద్దేశ్యం ఆధా రంగా ఆ నిధుల మళ్లింపులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు రాలేము.
16. స్కిల్ ప్రాజెక్ట్ అమలులో సబ్ కాంట్రాక్టర్ల పన్ను ఎగవేతకు చంద్రబాబును బాధ్యుడ్ని చేయడం సరికాదని ఆయన తరుపు న్యాయవాదులు చేసిన వాదనతో కోర్టు ఏకీభవీస్తోంది. స్కిల్ ఒప్పందం అమల్లో జరిగిన పొరపొచ్చాలను సంబంధిత అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు ఎట్టి ప్రాధమిక సాక్ష్యాధారాలు లేవు.
17. ఇన్‌కంట్యాక్స్ అధికారులు స్వతంత్రంగా స్కిల్ ప్రాజెక్ట్ అమలులో చంద్రబాబు పాత్రను పరిశీలిం చి, పలు అక్రమ చెల్లింపులను గుర్తించారని సీఐడీ ఆరోపించినా, దానికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కోర్టుకు అందించలేదు.
18. చంద్రబాబు పరోక్షంగా సాక్ష్యులను, సహ నిందితు లను, తమ పార్టీ వారిని ప్రభావితం చేసినట్లు సీఐడీ పేర్కొన్నా అట్టి ఆరోపణలకు సంబంధించి కూడా ఆధారాలు అందించలేదు.
19. హైదరాబాద్‌లోనే బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై నమోద్కెన ఎఫ్‌ఐఆర్‌లో ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఆయన ఉల్లం ఘించినట్లు ఎక్కడా లేదు.
20. సుప్రీంకోర్ట్‌లో చంద్రబాబు దాఖలు చేసిన సెక్షన్ 17ఏ పిటీషన్ రాష్ట్ర హైకోర్ట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిగణించడానికి ఎట్టి అడ్డంకి కాదు.
21. ప్రాసిక్యూషన్‌వారు హైకోర్టుకు సమర్పించిన సుజాయత్ ఖాన్ స్టేట్‌మెంట్(సీఐడీ వారికి ఇచ్చి నది), సీమెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాథ్యూ థామస్ స్టేట్‌మెంట్(ఈడికి సమర్పించిన స్టేట్‌మెంట్లు)స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎటువంటి ప్రాధమిక ఆధారాలు లేవు.
22. చంద్రబాబు తాజాగా తన వైద్య పరీక్షల వివరా లను హైకోర్ట్‌కు సమర్పించడాన్ని ఆక్షేపిస్తూ అది బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లు అవుతుందని సీఐడీ అభ్యంతరం తెలిపింది. దీంతో హైకోర్ట్ ఏకీభవించడం లేదు.
23. స్కిల్ కేసు నమోద్కెన సంవత్సరం పది నెలలు తర్వాత చంద్రబాబును సీఐడీ ముద్దాయిగా చేర్చింది. ఈ సుదీర్ఘ కాలంలో చంద్రబాబు విచారణలో ఎట్టి జోక్యం చేసుకోలేదు. ఆయన జోక్యం చేసుకున్నట్లు సీఐడీ కూడా తెలుపలేదు.
24. ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడం ఆ వ్యక్తిని శిక్షించి నట్లుగా భావించాలి. స్కిల్ కేసులో చంద్రబాబును 37వ ముద్దాయిగా చేర్చారు. అది కూడా అరెస్ట్ చేయడానికి ముందు. తక్కిన 36 మంది రెగ్యులర్ లేదా ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. సీఐడీ వారు ఇప్పటిదాకా 140 సాక్ష్యులను విచారించి నాలుగు వేల పేజీల డాక్యుమెంట్లను రెడీ చేశారు. అవన్నీ వారి అధీనంలోనే ఉన్నాయి.
25. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సిబ్బందితో కూడిన జెడ్‌ఫ్లస్ సెక్యూరిటీలో ఉన్నారు.కనుక ఆయనవిదేశాలకు పారిపోయే అవ కాశం గానీ, సాక్ష్యులను, ఇతరులను భయపెట్టి విచారణను ప్రభావితం చేసే అవకాశంగానీ లేదు.
26. గత నెల చంద్రబాబుకు ఆరోగ్య కారాణాల ఆధా రంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పుడు విధించిన షరతులను ప్రస్తావిస్తూ.. ఈనెల 29 నుండి పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది.