వైసీపీది ధనబలం .. టిడిపిది ప్రజాబలం
అందరూ కలసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
విశాఖలో ఆస్తులకు రక్షణ వుందా?
లేని రింగ్ రోడ్డుపై క్విడ్ ప్రోకో ఆరోపణలా?
టిడిపి వచ్చాక పంచగ్రామాల సమస్యకు పరిష్కారం
పెందుర్తి బహిరంగ సభలో వైసీపీ పై ధ్వజమెత్తిన చంద్రబాబు
…..
జగన్ కు భయం పట్టుకుంది. నవంబర్ డిశంబర్ లో ఎన్నికలకు వెళ్లాలి అని చూస్తున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు అనేది నీ లెక్క. నిజమే డబ్బులు లేవు. మాది ప్రజా బలం మీది ధన బలం. డబ్బులు అడ్డంగా సంపాందించాడని జగన్ అహంకారం. ధైర్యం ఉంటే రేపే ఎన్నికలు పెట్టు. మేం సిద్దంగా ఉన్నాం అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి పెందుర్తి లో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అంతకు ముందు పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షో కు అపూర్వ స్పందన లభించింది. రహదారులన్నీ జనసందోహంతో కిక్కిరిసి పోయాయి.
బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు వైసీపికి అంతిమ యాత్ర అని ధ్వజమెత్తారు. రాజకీయంగా నన్ను ఆదరించే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు అభినందనలు అని చెప్పారు. కష్ట కాలంలో టీడీపీతో ఈ ప్రాంత ప్రజలు నిలిచారు. ఈ రోజు మీదగ్గరకు వచ్చాను. భవిష్యత్ లో అంతా కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నాడు హుద్ హుద్ వచ్చింది. హుద్ హుద్ కంటే ముందు నాడు నేనే వచ్చాను. విశాఖలో 10 రోజులు ఉండి హుద్ హుద్ సమయంలో ప్రజలకు సాయం అదించాం. హుద్ హుద్ ముందు విశాఖ. హుద్ హుద్ తరువాత విశాఖ అని చర్చించేలా నగరాన్ని మార్చాం. జగన్ వచ్చి నాలుగేళ్లు దాటింది. ఎవరైనా ఆనందంగా ఉన్నారా. ఆస్తులకు రక్షణ ఉందా? అని ప్రశ్నించారు. జగన్ పాలన వల్ల అందరిలో అభద్రత. విశాఖ ప్రజలు నీతి,నిజాయితీకి మారుపేరు. ప్రశాంతమైన నగరం. అలాంటి విశాఖలో ఈ రోజు అరాచకాలు చేస్తున్నారు. నేను వచ్చింది. మన భవిష్యత్ కోసం మనం ఏం చేయాలో చెప్పడానికి వచ్చాను అని చెప్పారు. నాలుగేళ్ల జగన్ పాలనలో అన్నీ బాదుడే బాదుడు. నిత్యావసర వస్తువులు పెరగడానికి కేంద్రం కారణం అని తప్పుడు మాట చెపుతున్నారు.
దేశంలో ఎక్కువ పెట్రోల్ ధరలు ఉంది మన రాష్ట్రంలో కాదా? నేను నాడు దీపం పథకం ఇచ్చాను. ఇప్పుడు ఆదీపం ఆర్పేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నాడు ఎప్పుడైనా కరెంట్ చార్జీలు పెంచామా? మరి ఇప్పుడే ఎందుకు కరెంట్ చార్జీలు పెరుగుతున్నాయి. ఆర్జీసీ రేట్లు, ఇంటిపన్నులు పెరిగాయి. మనం వీధి దీపాలు వేస్తే వాటికి రిపేర్లు వచ్చినా చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని విమర్శించారు. విశాఖలో నాలుగేళ్లుగా ఒక్క ప్రాజెక్టు అయ్యిందా? ఒక్క కంపెనీ వచ్చిందా? ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఇలా అయితే జనం ఎలా బతుకుతారు…అందుకే ఇదేం ఖర్మ అని కార్యక్రమం ప్రారంభించాను. రాష్ట్రానికి అన్నీ ఉన్నాయి. కానీ అల్లుడి నోట్లో శని అని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ఉండే సిఎం సైకో నా కాదా? తమ్ముళ్లూ, విచిత్రంగా, వింత ఆలోచనలు ఉండే వ్యక్తిని సైకో అంటారు.
మనందరం బాధపడితే సంతోష పడే వ్యక్తిని సైకో అంటారు. సాక్షాత్తూ సొంత పార్టీ ఎంపినీ పోలీసులతో కొట్టించి, సిఎం వీడియో చూస్తాడు. దీన్ని ఏమనాలి అని ప్రశ్నించారు. మొన్న రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను ఫిర్యాదు లేకపోయినా అరెస్టు చేశారు. వీళ్లే ఫిర్యాదు ఇస్తారు. వీళ్లే విచారణ చేస్తారు అన్నారు. వివేకా హత్య ఎవరు చేశారు? బాబాయిని చంపేసి. నాపై ఆరోపణ చేస్తాడు ఈ సైకో. బాబాయిని చంపి ఓట్లు తెచ్చుకునే వారిని సైకో అనక ఏమనాలి అని ప్రశ్నించారు. ఇక్కడ కోడికత్తి డ్రామా ఆడాడు. విశాఖ ఎయిర్ పోర్టులోనే డ్రామా ఆడాడు అని విమర్శించారు. నేను అమరావతిలో ఒక అద్దె ఇంట్లో ఉన్నాను. నాకు జగన్ లా ఊరూరికీ ప్యాలెస్ లు లేవు. జగన్ ను హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై సహా అనేక చోట్ల ప్యాలెస్ లు ఉన్నాయి. నేను ఉండే అద్దె ఇంటిని కూల్చాలని ఎంత ప్రయత్నం చేశారో చూశారు కదా? లేని రింగ్ రోడ్డుపై క్విడ్ ప్రోకో అని ఆరోపణలు చేసి ఆ ఇల్లు జప్తు చేస్తాను అంటున్నాడు. ఇది పైశాచిక ఆనందం కాదా? ఇతన్ని సైకో అనాలా వద్దా? అని ప్రశ్నించారు.
ప్రజా వేధిక కూల్చడం ద్వారా విధ్వంసం ప్రాంరంభించాడు అని చంద్రబాబు చెప్పారు. నర్సీపట్నంలో దళిత డాక్టర్ కరోనా సమయంలో మాస్క్ అడిగాడు అని వేధించి చంపారు. మాస్క్ అడిగారని సైకోకు కోపం వచ్చింది… అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి, పోలీసులతో హింసించారు. డాక్టర్ ను వేధించి పొట్టన పెట్టుకున్నారు. అతను సైకో కాదా? నేను జనం మద్యలో తిరుగుతున్నా. కానీ జగన్ జనం మద్యలోకి రాలేదు. పరదాలు కడతారు. చెట్లు నరికివేస్తారు. మామూలు నాయకులు ఇలా చేస్తారా? సైకోలే ఇలాంటి పనులు చేస్తారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా భీమిలిలో వివాదాస్పద స్థలాలు ఇచ్చి పేదలను రోడ్డు పడేశారు. వాళ్లు అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న తరువాత కోర్టు కేసు అని వాళ్లను అడ్డుకున్నారు. వాళ్లు అప్పుల పాలయ్యారు. నాలుగేళ్లు అయ్యింది ఏది మన రాజధాని అంటే చెప్పలేని పరిస్థితి. మీకు బాధగా లేదా? అని ప్రశ్నించారు.
జగన్ విశాఖ ఆస్తులపై కన్నేశాడు. జగన్ విశాఖ వస్తే కంటి నుండా నిద్రపోయే పరిస్థితి ఇక్కడ వారికి ఉండదు. నాడు విజయమ్మ ఇక్కడ పోటీ చేస్తే, పులివెందుల రాజకీయం వద్దు అని వైసిపినీ ఓడించారు. మంచి వ్యక్తులు ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర. మంచి చేస్తే ప్రాణాలు ఇస్తారు. కానీ చెడు చేస్తే దూరంగా ఉంటారు అని చెప్పారు. నేను అడుగుతున్నా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి అయ్యేది. టీడీపీ అధికారంలో ఉండి ఉండే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేదని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ పంచగ్రామాల సమస్య ఉంది. సమస్య పరిష్కారానికి జీవో నెంబర్ 229 ఇచ్చాను. కానీ వైసీపీ వాళ్లు కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ సమస్య పరిష్కరిద్దాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మనం ఎప్పుడో శంకుస్ధాపన చేసిన భోగాపురం విమానాశ్ర యాన్ని మళ్లీ శంకుస్థాపన చేశాడు. ఈ సిఎంను కు సిగ్గు ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నాడు భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు మళ్లీ దానికి శంకుస్థాపన చేశాడు. విశాఖ నుంచి లూలూ అనే సంస్థ తన పెట్టుబడులు వెనక్కి తీసుకుని పోయిందన్నారు. ఈ రోజు సుప్రీం కోర్టుకు అమరావతి భూముల విషయం వెళ్లింది. నాడు అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టాలి అని 5 శాతం రిజర్వ్ చేశాను. ఈ సైకో ముఖ్యమంత్రి ఒకే ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో ఒక సెంటు భూమి ఇస్తాడట. ఆ సెంటు ఎందుకు పనికి వస్తుంది. చనిపోయిన వారిని పూడ్చడానికి పనికి వస్తుంది అని విమర్శించారు. ఒక్క విశాఖలోనే నాడు 60 వేలమందికి పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేశాం. అదీ తెలుగు దేశం పేదల పట్ల ఉండే ప్రేమ, మమకారం అని చెప్పారు.
దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే ధనికుడు ఎవరు? ఈ జగన్ రెడ్డి కాదా? ధనిక ముఖ్యమంత్రికి నిరుపేదల కుమద్య జరిగే పోరాటం. మనల్ని అందరినీ నిరుపేదలుగా చేసిన జగన్ తో మన పోరాటం అని వెల్లడించారు. ఇసుక ఇవ్వకుండా 40 లక్షల మంది జీవితాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి. ఇప్పుడు రాష్ట్రంలో కొత్త కొత్త మద్యం బ్రాండ్లు వచ్చాయి. జె బ్రాండ్లు వచ్చాయి. ఎక్కడా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు తీసుకోరు. 60 రూపాయల మద్యం బాటిల్ ఇప్పుడు రూ. 200 అయ్యింది. జగన్ మద్యంతో పేద ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికి 5 ఇళ్లు కట్టి సిగ్గు లేకుండా పేదవాళ్ల ప్రతినిధి అంటున్నాడు అని విమర్శించారు. అమరావతిలో పేదల పేరుతో ఇస్తున్న భూములపై మా ఫైనల్ తీర్పు ఉంటుందని సుప్రీం కోర్టు చెప్పింది. ఇచ్చే భూమిపై హక్కు ఉంటుందో లేదో చెప్పకుండా పేదలకు భూములుఇస్తారా అని ప్రశ్నించారు.
అన్న క్యాంటీన్ పోయింది. చంద్రన్న బీమా లేదు. రంజాన్ తోఫా లేదు. ఎస్ సి, బిసిలకు ఒక్క పైసా డబ్బు రాలేదు. మళ్లీ పేదల మనిషి అంటాడు. వచ్చేది మామూలు ఎన్నిక కాదు. వచ్చేది కురుక్షేత్రం. కురుక్షేత్రంలో గెలిచి గౌరవ సభలో అడుగుపెడతాను.కౌరవ వధ చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు అని చంద్రబాబు వెల్లడించారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు. వైసీపీ డబ్బులు, బెదిరింపులు సహా ఏ ప్రయత్నాలు వైసీపీకి ఫలితాన్ని ఇవ్వలేదు. కుప్పం గెలవడం కాదు. ఈ సారి జగన్ పులివెందుల సంగతి చూసుకోవాలి. వైసీపీ కి 175 సీట్లు రావడం కాదు. గుండుసున్నా ఖాయం అని చంద్రబాబు చెప్పారు. మొన్నటి వరకు కార్పొరేటర్ గా గెలిచి ఇక్కడ ఉన్న నేత పవన్ కళ్యాన్ ను తిడతాడు. నన్ను తిడతాడు.
పెట్టుబడులు ఏవి అంటే కోడిగుడ్డు అంటాడు ఆ మంత్రి అని విమర్శించారు. పోలీసులు న్యూట్రల్ గా ఉంటే వైసీపీ పని అయిపోయినట్లే. పోలీసులు నాడు సమర్థంగా పని చేశారు. కానీ సైకో ఒత్తిడి వల్ల అప్పుడడప్పుడు తేడా చేస్తున్నారు. ఏమీ కాదు పోలీసులు. మీ జీతాలు పెంచేది నేనే. మీ తరుపున పోరాడేదీ నేనే. పోలీసులను తప్పులు చేయవద్దు అని కోరుతున్నా. జగన్ ను నమ్మితే మిమ్మల్ని జైలుకు తీసుకువెళతాడు అని హెచ్చరించారు. ఒక కన్ను రెండో కన్ను ను పొడుస్తుందా అన్నాడు. ఇప్పుడు ఏమయ్యింది. ఒక బాబాయిని చంపాడు. ఇంకో బాబాయిని జైలుకు పంపాడు. నాడు హత్య రోజు ఉదయం 4.30 గంటలకు మీటింగ్ పెట్టాడు. గుండెపోటు అని నాడే మీటింగ్ లో చెప్పాడు అని ఆరోపించారు. ఈ సైకోను అడుగుతున్నా. పేదల రక్తం తాగితే ఏమవుతాడో జగన్ అదే అవుతాడు అని చంద్రబాబు విమర్శించారు.