- టీటీడీ ఈవోకు డిప్యూటీ సీఎం పవన్ స్పష్టీకరణ
- పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ
అమరావతి(చైతన్యరథం): ధార్మిక అంశాల్లో రాజీ వద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి జె.శ్యామల రావు కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు ఆదివారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రితో సమావేశమై తిరుమల శ్రీవారి ప్రసాదాలు అందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీతో కూడినదనీ, అందులో జంతు అవశేషాలు ఉన్నాయనే అంశంపై ఈవో పలు వివరాలను ఉప ముఖ్యమంత్రికి తెలిపారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను తెలిపారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం, శ్రీవారి ప్రసాదాల తయారీలో నిబంధనలను, శాస్త్రోక్రమైన నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఈవో తెలియచేశారు. టీటీడీ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు. భక్తుల మనో భావాలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు.