- వరద విపత్తు సహాయక చర్యల్లో దేశానికే ఆదర్శం
- బాధితుల చెంతకే.. ఆహారం, నీరు, మందులు..
- సుదూర గమ్యాన్ని అధిగమించడంలో సేవలు భేష్
- బుడమేరు గండ్ల పూడ్చివేతలోనూ… కీలక పాత్ర
- పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కీలక భాగస్వామిగా…
- డ్రోన్లు, రోబో జాకెట్లు, ఏఐ, డేటా ఆనలిటిక్స్..
- సాంకేతికత మేథకు పదునుపెట్టిన సీఎం చంద్రబాబు
- భవిష్యత్ విపత్తుల నివారణకు ఇదొక కేస్ స్టడీ
మనిషికంటే శక్తివంతమైనది, విస్తృతమైనది `సాంకేతికత. కాని, టెక్నాలజీని ఎలా వాడుకోవాలన్నది మనిషి మేధకు సంబంధించిన అంశమే. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద విపత్తు నిర్వహణలో సాంకేతికతను భాగం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన.. భవిష్యత్ విపత్తుల నివారణకు ఒక కేస్ స్టడీ. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ముఖ్యమంత్రి ఆలోచనను శరవేగంగా అందిపుచ్చుకున్న ఐటీ మంత్రి నారా లోకేష్ `సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ నిర్వహించిన ‘ఫ్లడ్ ఆపరేషన్’.. కేస్ స్టడీలో ఒక చాప్టర్‌గా చూడాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. పీకల్లోతు వరదలో చిక్కుకున్న ఏడు లక్షలమంది ప్రాణాలను ఉపశమనమివ్వడం చిన్న విషయంగా చూడలేం. ఆ టెక్నాలజీ వినియోగంలో కీలక పాత్ర పోషించిన వన అండ్ ఓన్లీ ఐకాన్ `డ్రోన్!
ప్రతి వార్డూ ముంపులోవున్న సమయంలో.. వరదకు ఎదురెళ్లి బాధితులకు ఆహారం, నీళ్లు, మందులు సరఫరా చేయడం ప్రభుత్వానికీ అసాధ్యమైన పరిస్థితే అయ్యింది.
సరిగ్గా `ఆ సమయంలో వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు వ్యవసాయంలో క్రిమికీటకాల నివారణకు మందులను పిచికారీ చేసే డ్రోన్లను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డా పీవీ సత్యనారాయణ తెరపైకి తెచ్చారు. డ్రోన్ నిపుణుడు, సీనియర్ శాస్త్రవేత్త, డా ఎ సాంబయ్య బృందంతో అప్పటికప్పుడు 115 వ్యవసాయ డ్రోన్లను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ సహకారం, సమన్వయంతో మార్పులు చేయించి విపత్తుల నిర్వహణకు రంగంలోకి దించారు. మానవ సహాయక బృందాలకు అసాధ్యమైన వరద సహాయక కార్యక్రమాల నిర్వహణను.. రంగంలోకి దిగిన డ్రోన్లు సులువుగా చక్కబెట్టేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తీసుకున్న చొరవ `దేశంలో విపత్తులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఓ పాఠ్యాంశమే అనడంలో సందేహం లేదు. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొట్టమొదటిగా అభివర్ణించడంలో ఏమాత్రం తప్పులేదు. 10 కిలోల బరువును మోయగల డ్రోన్లను ఉపయోగించి ఇప్పటివరకు దాదాపు లక్ష 30 వేల మందికి సరైన సమయంలో ఆహార పొట్లాలు, నీళ్లు, మందులు అందించారు.
అదేవిధంగా దాదాపు మూడు కెమెరా డ్రోన్లతో కొండపల్లి దగ్గర బుడమేరు గట్టు గండ్లను మంత్రి నారా లోకేష్ అనునిత్యం పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలోవున్న ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సమన్వయంతో ఇరిగేషన్ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ త్వరితగతిన బుడమేరు గండ్లను పూడ్చి, వరద నీటిని నియంత్రించడంలో డ్రోన్లు పాత్రను ఏమాత్రం తక్కువ చేసి చెప్పలేం. ఇవేకాకుండా మరో 17 కెమెరా డ్రోన్లను వివిధ వరద ముంపు ప్రాంతాల్లో తిప్పుతూ ఎప్పటికప్పుడు ఎంతమేరకు నీరు తగ్గుతుంది? ఎక్కడెక్కడ నీటిమట్టం పెరుగుతుంది? ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి.. సమయానుకూలంగా తగిన రక్షణ చర్యలు తీసుకోవడంలో డ్రోన్ల పాత్ర కీలకమే అయ్యింది. పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ డ్రోన్లు సేవలు విస్తృతం, అపారం. అంటువ్యాధుల ప్రబలకుండా.. కెమికల్స్ స్ప్రే చేసేందుకు డ్రోన్లు ఇతోధిక సేవలే అందించాయి. వరద విపత్తు సమయంలో వివిధ సహాయ కార్యక్రమాలకు డ్రోన్ టెక్నాలజీని వాడటం.. దేశానికే గర్వకారణం. విపత్తు నివారణా ఆధునిక విధానానికి ఇదొక
కేస్ స్టడీ!
ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యం
వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ సమన్వయంతో వైద్య వ్యవస్థను క్రియాశీలం చేసి ముంపునకు గురైన ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవడం జరిగింది. పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ సమన్వయంతో డ్రోన్లను ఉపయోగించి వివిధ క్రిమిసంహారక మందులను వీధుల్లో చల్లిస్తూ 31 వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయించడం, మరోవైపు క్రస్ట్ గేట్ల నిపుణులు కన్నయ్యనాయుడు సాంకేతిక సలహాలు, సంప్రదింపులతో ప్రకాశం బ్యారేజ్‌కి కౌంటర్ వెయిట్‌కు త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టటం, బుడమేరు వరదకు సంబంధించిన విపత్తు నుండి ప్రజలను రక్షించుకుంటూ ఎప్పటికప్పుడు డేటా సెంటర్లకు డేటా తెప్పించుకొని అనలటిక్స్‌తో నిర్ణయాలు తీసుకుంటూ సమర్థమైన, సమగ్రమైన విపత్తు నిర్వహణ చేపట్టటం భావితరాలకు మార్గదర్శకమే. హోంమంత్రి వంగలపూడి అనిత సమన్వయంతో విపత్తు ప్రాంతంలో నిరంతర ఆహారం తదితరాల సరఫరా కోసం పోలీస్ యంత్రాంగాన్ని సమర్థంగా ఉపయోగించగలిగారు.
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమన్వయంతో రెవిన్యూ శాఖ అధికారులు వివిధ రకాల నష్టాల అంచనాలను వేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమన్వయంతో విపత్తు నిర్వహణకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి.. ఇలా గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో రేయింభవళ్లు పనిచేస్తూ సమష్టి కృషితో ప్రజలకు అండగా నిలిచారు. ఇలాంటి సమర్థమైన విపత్తు నిర్వహణ మన రాష్ట్రానికే కాకుండా.. ఇతర రాష్ట్రాలకూ ఆచరణీయం.. ఆదర్శనీయం… అభినందనీయం. డ్రోన్లు, రోబో జాకెట్లు, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా రకరకాల డిజిటల్ అప్లికేషన్స్‌ను ఒకవైపు వరద నియంత్రణ చర్యల్లోనూ, మరోవైపు ప్రజలను ఆపదనుంచి గట్టెక్కించే సహాయక చర్యల్లోనూ ఉపయోగించడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి అనుభవానికి, కార్యదక్షతకు నిలువెత్తు నిదర్శనం!!