అమరావతి: ఏపీలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ పథకాల మాటున భారీ అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పెద్ద ఎత్తున ప్రజాధనం దోచుకుంటున్నారని అనేక అంశాల్లో స్కాములు చోటు చేసుకుంటున్నాయని రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదించారు. ప్రజా ప్రయోజనం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలతో పిటిషన్ వేశారన్నారు. కానీ విచారణ అర్హత ఉందని రఘురామ తరపు లాయర్ మురళీధర్ రావు వాదించారు. పిటిషన్ దాఖలు చేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని రఘురామ కృష్ణరాజు తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.పిటిషన్‌పై విచారణ చేపడతామని హైకోర్టు చెప్పింది. పిల్‌లో ప్రతి వాదులుగా వున్న అందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
జగన్‌రెడ్డికి ఇటీవలి కాలంలో కోర్టుల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జగన్ కేసుల విచారణ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లకు సంబంధించి ఆయనకు ఇటీవల నోటీసులు జారీ ఆయిన విషయం తెలిసిందే. జగన్ అక్రమాస్తు కేసుల్లో జాప్యంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల మొదటి వారంలో జగన్‌కు, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా ఏపీ సీఎం జగన్ అక్రమాస్తులపై త్వరగా విచారణ జరపాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా, ఈ నెల రెండో వారంలో జగన్‌కు నోటీసులు ఇచ్చింది.
ఆ వెంటనే చట్టసభల సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయటంపై ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఇందుకోసం ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే దిగువ కోర్టులు, ప్రత్యేక కోర్టుల నుంచి నివేదికలు సుమోటోగా తెప్పించుకోవాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులు అత్యవసరమైతే తప్ప ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలు వాయిదా వేయకూడని ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పుడు తాజాగా ఏపీలో జరుగుతున్న ఆర్థిక అక్రమాలపై ఎంపీ రఘరామ దాఖలు చేసిన వ్యాజ్యంపై ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, అధికారులు సహా 41 మందికి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్ కు అన్ని వైపుల నుంచీ ముంచుకొస్తున్నట్లుగానే కనిపిస్తోంది.