- అబ్బురపరుస్తున్న చిన్నారి దేవాన్ష్ అడుగులు
- డినో డీట్స్ టైటిల్‌తో యూట్యూబ్ చానల్
- తనయుడి టీజర్‌లో భాగమైన తండ్రి లోకేష్
- దేవాన్ష్‌కు నారా, నందమూరి కుటుంబాల విషెస్
ఉండవల్లి (చైతన్య రథం): ఒక చిన్నారి చదరంగం పజిల్స్‌తో వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పుడు డైనోసార్ల రహస్యాలు చెప్పే యూట్యూబర్‌గా మారాడు. ఇది మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ అసాధారణ ప్రయాణం. పదేళ్లు నిండకముందే దేవాన్ష్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరచింది. చదరంగ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన గ్రంథంగా పేరున్న ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స’ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను అతి తక్కువ సమయంలో పరిష్కరించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర’గా చోటు సాధించాడు. చదరంగంలో ఒక్కో ఎత్తు వేసినట్లే, జీవితంలోనూ ముందడుగేయడం నేర్చుకున్న చిన్నారి.. ఇప్పుడు మరో లోకంలోకి అడుగుపెడుతూ అబ్బురపరుస్తున్నాడు, ఆ ఈడు పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అనూహ్యంగా డైనోసార్ల లోకంలోకి..
‘డినో డీట్స’ -ఈ పేరే కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి దేవాన్ష్ సేకరించిన ఆశ్చర్యకరమైన నిజాలు, వింతలు, విశేషాలు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, పాడ్‌కాస్ట్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నవ్విస్తూనే ఆలోచింపజేసే శైలి దేవాన్ష్ సోంతం. కోట్ల సంవత్సరాలనాటి ప్రపంచాన్ని ఈ తరం పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పడమే ‘డినో డీట్స’ ప్రత్యేకత.
నారా, నందమూరి కుటుంబాల ఆశీర్వాదాలు
టీజర్ విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్వయంగా పాల్గొని దేవాన్ష్ చెప్పే యూట్యూబ్, పాడ్‌కాస్ట్ ప్రత్యేకతలు తెలుసుకున్నారు. “దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని నారా లోకేష్ ఉద్విగ్నంగా సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. నారా, నందమూరి రెండు కుటుంబాల సభ్యులూ దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపాయి.
ఒక్క చిన్నారి నిరూపిస్తున్న సత్యం
వరల్డ్ రికార్డు సాధించిన బాలుడే.. ఇప్పుడు మైక్ పట్టుకుని లక్షలాది పిల్లలకు జ్ఞానాన్ని పంచాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఒక పనిమీద మనసుపెట్టి, దానిలో రాణించి, ఆ నేర్పును మరొకరికి పంచాలనే తపన -దేవాన్ష్ చిన్న వయసులోనే నేర్చుకున్న పెద్ద పాఠం. చదరంగం నేర్పించిన ఏకాగ్రత, డైనోసార్ల పట్ల ఉన్న అచంచలమైన అభిరుచి -ఈ రెండూ కలిసి ‘డినో డీట్స’కు పునాదులు వేశాయి. ఏ వయసులోనైనా.. ఏ రంగంలోనైనా.. -అభిరుచికి అవకాశమిస్తే అది ఎంత ఎత్తుకు ఎదగగలదో నారా దేవాన్ష్ ఒక నిలువుటద్దం!!
















