అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. టీడీపీ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో జరగనున్న యూఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ మిషన్ టూ ఇండియా సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. భారత్‌లో సివిల్ న్యూక్లియర్ రంగంలో ప్రయివేట్ భాగస్వామ్యానికి తలుపులు తెరిచిన షాంటీ చట్టం అమలు నేపథ్యంలో, యూఎస్-ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ మరియు న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సమావేశంలో 20మంది అమెరికన్ న్యూక్లియర్ పరిశ్రమ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొంటున్నారు. సమావేశానికి ముందే యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఈ ప్రతినిధి వర్గానికి ప్రత్యేకంగా బ్రీఫింగ్ ఇచ్చారు. 2008లో భారత్-అమెరికా సివిల్ న్యూక్లియర్ ఒప్పందం కుదిరిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ సహా రెండు స్థలాలు అమెరికన్ కంపెనీలకు 1,000 మెగావాట్ల న్యూక్లియర్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో కొవ్వాడ ప్రాజెక్ట్ సహా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల విషయంలో ఇరు దేశాల మధ్య సహకారంపై సమావేశంలో కీలకమైన చర్చలు జరగనున్నాయి. ఏపీకి విద్యుత్ అవసరాలు తీర్చే కొవ్వాడ ప్రాజెక్ట్ విషయంలో మంత్రి లోకేష్ ఈ సమావేశంలో ఏపీ ప్రయోజనాలను బలంగా వినిపించే అవకాశం ఉంది.
















