- దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలు
- మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
- రాబోయే ఐదేళ్లలో రాయచోటి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం
- మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి(చైతన్యరథం): పేదల సంక్షేమమే కర్తవ్యంగా అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా రాయచోటి మండల పరిధిలోని సిబ్యాల గ్రామంలో ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…గతంలో ఎవరూ చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల నుంచి ఇది మంచి ప్రభుత్వం అని ఒక గుర్తింపు తీసుకువచ్చామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వచ్చే దీపావళికి అర్హత ఉన్న ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి త్వరలో విధి విధానాలు రూపొందించి అమలు చేస్తామన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయం
గతంలో పెన్షన్లు కొందరికి మాత్రమే ఇచ్చే వాళ్ళని, నేడు కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దనే ప్రతినెల ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నామన్నారు. పేదలు ఆకలితో పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారన్నారు. కోట్లాది మంది రైతుల భూములు కాజేసేలా గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దుచేసి రైతుల్లో భయాందోళనలు తొలగించామన్నారు. డ్వాక్రా మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన నూతన జిల్లాల్లో ప్రతి శాఖకు కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాల్లో ప్రభుత్వ భవనాలు లేక ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి మండిపల్లి చెప్పారు.
అర్హులందరికీ ఇళ్లు
రాయలసీమ ప్రాంతంలో వర్షపాతం తక్కువ పడడంతో నీటిమట్టం తగ్గిపోయి ఎన్ని బోర్లు వేసినా నీరు పడడం లేదన్నారు. దీంతో గ్రామాల్లో నీటి సమస్య తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇకనుంచి నీటి సమస్య రాకుండా రాబోయే ఐదు సంవత్సరాలలో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రాయచోటి నియోజకవర్గం లోని ఆరు మండలాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు. గతంలో ఇల్లు మంజూరు కు సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయని, వాటన్నింటినీ సరిదిద్దుతామన్నారు. ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలు నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వంలో భూ ఆక్రమణలు జరిగాయని అవన్నీ తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామన్నారు. ఈ ప్రాంతవాసులు చాలామంది జీవనోపాధి కోసం కువైట్, సౌదీ లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
అలాంటి వారి సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రాంతంలో వివిధ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన ప్రాంతాలలో సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.