చైతన్యరథం…. తెలుగుజాతి చరిత్ర గతిని మార్చిన మహనీయుని పాదస్పర్శ తో పునీతమైన పవిత్ర రథం. ఊరూ, వాడా, పల్లె, పేట, పట్టణం, పురం అన్నీ కలియదిరిగి తెలుగుజాతికి మేలుకొలుపు పాడిందే ఈ చైతన్యరథం. కుల, మత, లింగ, వయో బేధాలు లేకుండా ప్రతి ఒక్కరిలోనూ చైతన్య స్ఫూర్తిని రగుల్కొల్పింది చైతన్యరథం. తరాలు మారుతున్నా తరగని స్ఫూర్తి కెరటం ఈ చైతన్యరథం. తెలుగుజాతి ఆత్మగౌరవం పుట్టిన హైదరాబాద్ నగర నడిబొడ్డున జరుగుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సగర్వంగా తిలకిస్తున్నది ఈ చైతన్యరథం.
రామన్న పురుడు పోసిన టిడిపిని చంద్రన్న పెంచి పోషిస్తున్న తీరు, దానిని మరింత ఉన్నతికి చేర్చి భవిష్యత్ కు భరోసా కల్పించేందుకు లోకేష్ పడుతున్న శ్రమను చూసి లోలోన ముసిముసి నవ్వులు నవ్వుకుంటుందీ చైతన్యరథం. నాలుగు దశాబ్దాల క్రితం తెలుగునాట ఉత్తేజాన్ని రేకెత్తించి, ప్రస్తుతం పదవీ విరమణ చేసి విశ్రాంత జీవనం గడుపుతున్న చైతన్యరథం మరోమారు తన శక్తినంతా కూడదీసుకుని కదనరంగంలో దూకాలని లోలోన ఆరాట పడుతున్నది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులను మించి ప్రస్తుతం తెలుగునాట సాగుతున్న అరాచక పాలనను తన జగన్నాథ రథచక్రాలు క్రింద నలిపేయాలని లోలోన రగిలిపోతోంది.
తెలుగునేల నలుమూలల నుంచి పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరైన వారందరిలో చైతన్యస్ఫూర్తి రగిలిస్తోంది. 1982 నుంచి తనకు పరిచయం వున్న చిరకాల స్నేహితులను చైతన్యరథం పేరుపేరునా పలకరించి పులకరించి పోతోంది. తెలుగునేల, తెలుగుజాతికి తరతరాల పాటు తరగని గౌరవాన్ని, ఖ్యాతిని సమకూరుస్తున్న ‘ చంద్రన్న ‘ సారథ్యంలో 1983 నాటి ప్రజావిజయం రానున్న ఎన్నికలలో కనులారా వీక్షించేందుకు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న చైతన్యరథం ఆకాంక్ష నెరవేరాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.