వైసీపీ అధినేత సొంత జిల్లా కడప గడ్డపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సింహనాదం చేశారు. పార్టీ శ్రేణులు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టాయి. దారిపొడవునా మహిళలు, యువకులు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ జోన్ 5 సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కడపలో మంగళవారం జరిగిన ఈ సమీక్షా సమావేశంలో 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ శ్రేణులు విస్తృత స్థాయిలో పాల్గొన్నాయి. వివేకా హత్యకేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలు పై చంద్రబాబు ప్రశ్నించారు.
వివేకా హత్యలో వాస్తవాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అప్పటివరకు ఆ ప్రాంతంలో పెత్తనం చలాయించిన నాయకుల నిజస్వరూపం తేటతెల్లమైంది. కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో పార్టీ వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకాగలదని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే అటువంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోక పోవటం, మారుతున్న తాజా రాజకీయ పరిస్థితికి దర్పణం పడుతుందని చెప్పవచ్చు. దీనికి తోడు అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పేవారి సంఖ్య పెరుగుతోంది.
అధినేత సొంత జిల్లాలోనే అధికార పార్టీ ప్రతిష్ట మసకబారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలలో టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాలరెడ్డి అద్భుత విజయం సాధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కడప లో టిడిపి జయకేతనం ఎగురవేయడం రాజకీయం గానూ ప్రాధాన్యత సంతరించుకున్నది. వైసీపీ అధినేత సొంత నియోజకవర్గానికి చెందిన టిడిపి అభ్యర్థి ఎన్నికలలో విజయం సాధించటం అధికారపార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు.
ఇప్పటికే సిఎం సొంత నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి అధికార పార్టీ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ స్థితికి అగ్నికి వాయువు తోడైనట్టు భూమిరెడ్డి జత కలిశారు. వీరిరువురి దూకుడు, అధినేత చంద్రబాబు వ్యూహం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోరాటం ఫలితంగా కడప జిల్లా టిడిపి లో మంచి జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిఎం సొంత నియోజకవర్గం అయిన పులివెందులపై టిడిపి ఫోకస్ పెట్టింది. నాయకులంతా సమిష్టిగా పోరాట పటిమతో ముందుకు సాగితే పులివెందులలో టిడిపి పతాకం ఎగురవేయడం తథ్యమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.