అమరావతి: జగన్రెడ్డి నాలుగున్నరేళ్ల నుంచి ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ల్లో చేసిన దోపిడి ఒక్కోటీ బయటపడుతుండటంతో తన దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడిపై రోజుకోక అక్రమ కేసు బనాయిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ హయాంలో పారదర్శకంగా ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుక మాఫియా ద్వారా నాలుగున్నరేళ్లలో రూ. 40 వేల కోట్లు దోచేసిన ఇసుకాసురుడు జగన్ రెడ్డి సిగ్గులేకుండా టీడీపీ హయాంలో ఇసుకలో అక్రమాలంటూ చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఉచిత ఇసుక రద్దు చేసి దోపిడికీ తెరతీశారు. అధికారికంగా 110 రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు అని చెబుతూ అనధికారికంగా 500కు పైగా రీచ్ లలో ఇసుక దోపిడీ జరుగుతున్న విషయం వాస్తవం కాదా? రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉత్వర్వులిచ్చించంటే మీ ఇసుక దోపిడికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి జగన్ రెడ్డి? ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టారు. మరి పేదల కడుపు కొట్టి.. టన్నుకు రూ. 1000 చొప్పున రూ.40 వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ లపై ఏం కేసులు పెట్టాలి? వారిని ఏం చేయాలి? ఉచిత ఇసుక విధానం రద్దు చేసి, 40 లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేసి 160 మంది భవన నిర్మాణ కార్మికుల్ని బలిగొన్న దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఇప్పటికే 3 సార్లు ఇసుక పాలసీ మార్చారు.
ఇప్పుడు జగన్ తన తమ్ముడు అనిల్ రెడ్డికి ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఇసుక టెండర్లు అనిల్ రెట్టికి కట్టబెట్టడం కోసం ఏకంగా టెండర్ డాక్యుమెంట్ ధరను రూ.29.5 లక్షలుగా నిర్ధారించడమే కాకుండా టెండర్ నియమ నిబంధనలన్నీ మార్చేశారు. మిగిలి ఉన్న ఆరునెలల్లో రాష్ట్రంలో ఉన్న ఇసుకంతా దోచేయాలన్నదే జగన్ రెడ్డి ప్లాన్, అందుకే ఈ కుట్ర. ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్లో జే గ్యాంగ్ దేనిని వదలటం లేదు. ఇసుకతో పాటు బైరైటీస్, బాక్సైట్, లేటరైట్, రాక్సీ గ్రానైట్, సిలికా అన్ని దోచేస్తున్నారు.
మీరు దోపిడీ చేస్తూ చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెడతారా? చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే నాలుగున్నరేళ్ల నుంచి మీరేం పీకారు? వచ్చే ఎన్నికల్లో నిజయితీగా గెలిచే సత్తా లేకనే వైసీపీ అక్రమ కేసులు బనాయించి చంద్రబాబుని జైల్లో నిర్బందించాలని కుటిల ప్రణాళికలు రూపొందించింది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజా బలం ఉన్నంతవరకు చంద్రబాబును ఏ చేయలేరు? రాజమండ్రి నుండి విజయవాడ వరకు వచ్చిన జన సునామీ చూశారు కదా.. ఆ సునామీలో వైసీపీ కొట్టుకుపోవటం ఖాయమని గురువారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు హెచ్చరించారు.