- పసిఫిక్ మహా సముద్రం నుంచి తల్లిరొయ్యలు రాష్ట్రానికి రప్పించేలా సరఫరా సంస్థతో చర్చలు
- దక్షిణకోస్తాలో 20వేలమంది రొయ్యరైతులకు మేలు చేకూర్చిన యువనేత
అమరావతి(చైతన్యరథం): దీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి, యువనేత నారా లోకేష్. సమస్య ఏదైనా కావచ్చు… వ్యక్తిగతమైనదైనా, సంస్థాగతమైనదైనా… తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత విభాగాలతో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలోని సుమారు 20వేలమంది రొయ్యరైతులు ఎదుర్కొంటున్న ఓ జటిలమైన సమస్య తన దృష్టికి రాగానే వెంటనే పరిష్కరించి నాయకుడంటే ఇలా ఉండాలంటూ శభాష్ అన్పించుకున్నారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు రెండురకాల రొయ్యలను ప్రధానంగా పండిస్తున్నారు. ఒకటి వనామీ రకం కాగా, రెండవది మోనోడాన్ బ్లాక్ టైగర్ రకం. ఆక్వా రైతులు తమకు అవసరమైన సీడ్‌ను కేంద్రప్రభుత్వ సంస్థ సీఏఏ (Coastal Aquaculture Authority) గుర్తింపు పొందిన హేచరీస్ నుండి కొనుగోలు చేస్తారు. మన రాష్ట్రంలో రైతులకు సీడ్ సరఫరా చేసేందుకు వైష్ణవి హేచరీస్ సంస్థ గుజరాత్‌లో బిఎంసి ని ఏర్పాటు చేసింది.
అక్కడకు పసిఫిక్ సముద్రం నుండి పిపిఎల్ స్థాయి తల్లి రొయ్యలు దిగుమతి చేసుకొని, వాటిని స్థానిక హేచరీలకు పంపి సీడ్ ఉత్పత్తి చేసి మన రాష్ట్రంలోని రొయ్య రైతులకు మోనోడాన్ టైగర్ సీడ్ సరఫరా చేస్తున్నారు. మోనోడాన్ టైగర్ రకానికి అమెరికా, యూరప్, గల్ఫ్ లో డిమాండ్ ఉన్న కారణంగా ఈ రకం రొయ్యల సాగుకు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల ఆక్వా రైతులు మొగ్గుచూపుతున్నారు. ఈ రకం రొయ్య కిలోకు 10 కౌంట్ వరకు వచ్చే అవకాశముంది. ఈ రకం 30 కౌంట్‌కి కిలోకి 410 రూపాయల ధర లభిస్తుండగా, 10 కౌంట్ కు గరిష్టంగా 1000 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇదిలావుండగా మోనోడాన్ రకం రొయ్య సీడ్ ను సరఫరాచేసే వైష్ణవి హేచరీస్ వారు గుజరాత్ బిఎంసిలో పెంచిన తల్లి రొయ్యల నుండి సీడ్ ఉత్పత్తి చేసి మన రాష్ట్ర రైతులకు సరఫరా చేయడం వల్ల సరిగా కౌంట్ రాక రైతాంగం నష్టపోతున్నారు.
పసిఫిక్ మహా సముద్రం నుంచి నేరుగా తల్లిరొయ్యలను ఇక్కడకు తెప్పించి, స్థానిక హేచరీస్ ద్వారా సీడ్ తయారు చేసి ఇవ్వాలని, దీనివల్ల మంచి కౌంట్ లభిస్తుందని రాష్ట్ర రైతులు ఎప్పటినుంచో కోరుతున్నారు. గత ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్ మెయిల్ ద్వారా తమ సమస్యను మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. మంత్రి లోకేష్ వెంటనే స్పందించి ఫిషరీస్ అధికారులను ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో ఫిషరీస్ కమిషనర్.. సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పసిఫిక్ మహాసముద్రం నుంచి తల్లి రొయ్యను తెప్పించి, స్థానికంగానే సీడ్ తయారుచేసి ఇక్కడి రైతులకు ఇచ్చేందుకు అంగీకరించారు. అంతేగాక ప్రకాశం జిల్లాలో ఇటీవల సరఫరా చేసిన సీడ్ సరిగా లేకపోవడంతో నష్టపోయామని రైతులు చెప్పడంతో మత్స్యశాఖ కమిషనర్, సంబంధిత అధికారులను అక్కడకు పంపించారు.
నష్టపోయిన సుమారు 300మంది రైతులకు మళ్లీ నాణ్యమైన సీడ్ సరఫరా చేసేందుకు వైష్ణవి సంస్థ అంగీకారం తెలిపింది. కేవలం మెయిల్ సమాచారంతో తమ సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేష్‌కు గోపీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ళుగా తాము ఎదుర్కొంటున్న సమస్య లోకేష్ చొరవతో పరిష్కారమైందని హర్షం వ్యక్తంచేశారు. రైతులనుంచి రొయ్యలను కొనుగోలు చేసే ఎగుమతిదారులు ధరలను రోజువారీగా నిర్ణయిస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, కనీసం ఒకేధర 15రోజులు ఉండేలా ధరలను స్థిరీకరించాలని గోపీనాథ్ కోరారు. ఈ విషయమై త్వరలో ఆయా కంపెనీలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.