- ముఖ్యమంత్రి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ విచారణ
- నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపర చర్యలు
- రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ
అమరావతి(చైతన్యరథం): ఆధునిక సాంకేతికతతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ విచారణ జరుగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా గృహ నిర్మాణ సమీక్షా సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఆప్షన్-3 కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కొన్ని ఏజెన్సీలు బేస్‌మెంట్ వరకు పనిచేసి పేమెంట్స్ తీసుకున్నాయని.. ఆ తర్వాత పని ఎగ్గొట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అదే విధంగా మరికొన్ని ఏజెన్సీలు నాణ్యత లేకుండా నిర్మాణాలు చేసినట్లు తెలిసిందన్నారు. ఫిర్యాదులపై త్వరలోనే విచారణ నివేదిక రానుందని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
మెటీరియల్ దుర్వినియోగం చేసినా, పరిమితికి మించి మెటీరియల్ తీసుకున్నా, ఉద్దేశపూర్వకంగా లబ్ధిదారులకు నష్టం చేకూర్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ కింద లక్షా 25 వేల ఇళ్ల నిర్మాణాల పూర్తికి, అదే విధంగా 7 లక్షల ఇళ్లను రాబోయే ఏడాది కాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పీఎంఏవై-1.0.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతున్న నేపథ్యంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను ప్రోత్సహించి ఆలోగా నిర్మాణాల పూర్తికి అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నట్లు తెలిపారు. గడువు ముగిస్తే భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం చేజారుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అదనపు సహాయం అందించే విషయమై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. 500లోపు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే మేస్త్రీల గ్రూపులకు ర్యాండమ్ తనిఖీలు చేసి చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడిరచారు.
మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని.. కొన్ని స్థలాలు నివాసయోగ్యంగా లేవని, అదే విధంగా అక్కడికి వెళ్లేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని, మరికొన్ని నిర్మాణాలకు అనువుగా లేవని శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చారని.. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్లింత్ పూర్తయ్యాక ఫిల్లింగ్ చేసేందుకు మట్టి కోసం ఇబ్బంది ఉన్న దృష్ట్యా ఫ్లైయాష్ ఫిల్లింగ్‌కు గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది పటిష్టంగా కూడా ఉంటుందని వివరించారు. 2014-19 మధ్యకాలంలో పూర్తయిన ఇళ్లకు చెల్లింపుల విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని.. ఈ సమస్యను పరిష్కరించి నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందం కలిగిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే
పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని, ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. మంగళవారం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో గృహ నిర్మాణంపై జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ పి.రాజాబాబు, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, మైలవరం, తిరువూరు శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్, కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్ తదితరులు హాజరుకాగా.. జిల్లాలో మంజూరైన ఇళ్లు, పూర్తయిన ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్లు, తదితరాలను కలెక్టర్ సృజన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఎన్‌టీఆర్ జిల్లాలో పీఎంఏవై అర్బన్ (బీఎల్‌సీ) కింద 1,08,836 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటికే 18,820 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అదే విధంగా 40,536 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. పీఎంఏవై-గ్రామీణ్ కింద 6,567 ఇళ్లు మంజూరు కాగా.. 2,127 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. నరేగా కాంపొనెంట్, మెటీరియల్ స్టాక్, లేఅవుట్లలో మౌలిక వసతులు, ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాలు, నియోజకవర్గాల వారీగా ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి తదితరాలను కలెక్టర్ వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటిని చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పార్థసారథి దిశానిర్దేశం చేశారు.
లబ్ధిదారులను ప్రోత్సహించాలి
వివిధ లేఅవుట్లలో విద్యుత్, నీరు, అంతర్గత రహదారులు, తదితర వసతులు ఉన్నందున త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేందుకు అధికారులు చొరవ చూపాలని, ఇందులో భాగంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి పార్థసారథి సూచించారు. గృహ నిర్మాణం, డీఆర్‌డీఏ, మెప్మా, మునిసిపల్, డ్వామా, లీడ్ బ్యాంక్, మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, తదితరులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఎన్‌టీఆర్ జిల్లాలో పీఎంఏవై అర్బన్ (బీఎల్‌సీ), గ్రామీణ్ పరిధిలో దాదాపు 9 వేల ఇళ్ల నిర్మాణాలు లింటెల్ లెవెల్, రూఫ్ లెవెల్, రూఫ్ క్యాస్ట్ లెవెల్‌లో ఉన్నాయని.. 100 రోజుల ప్రణాళికలో భాగంగా వీటిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా మిగిలిన ఇళ్ల నిర్మాణాల పూర్తికి చొరవ చూపాలన్నారు. ఎక్కడైనా ఫిల్లింగ్‌కు సమస్యలు ఉంటే ఫ్లైయాష్‌ను కూడా ఉపయోగించుకోవడంపై దృష్టిసారించాలన్నారు. నిర్దేశిత డిజైన్ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని.. క్షేత్రస్థాయి అధికారులు నిరంతర పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేశారు. అవసరం మేరకు అర్బన్ లేఅవుట్ల మౌలిక వసతులకు సంబంధించి అమృత్ ప్రాజెక్టులను రూపొందించాలని మంత్రి పార్థసారథి సూచించారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తో పాటు మైలవరం, తిరువూరు శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాసరావు తమ తమ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఇళ్ల నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ, ఏజెన్సీల పనితీరు, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన తదితరాలపై ఎంపీ మాట్లాడగా.. చెల్లింపుల్లో 2019కి ముందు జరిగిన ఇళ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం, భూ సేకరణ, గృహ నిర్మాణ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది కొరత, సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణాలు, గృహ నిర్మాణ సామగ్రి, ఆప్షన్-3 ఇళ్లు తదితరాలపై శాసనసభ్యులు సమావేశంలో చర్చించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.
సమావేశంలో హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్, ఎన్‌టీఆర్ జిల్లా హౌసింగ్ పీడీ రజనీకుమారి, ఆర్‌డీవోలు బీహెచ్ భవానీ శంకర్, ఎ.రవీంద్రరావు, కె.మాధవి, కేఆర్‌సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ.కిరణ్మయి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డ్వామా పీడీ జె.సునీత, విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కేవీ సత్యవతి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీర్లు, మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.