- ఐదేళ్ల విధ్వంసానికి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి
- ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్
మంగళగిరి (చైతన్య రథం): జగన్మోహన్ రెడ్డి నోటివెంట ‘హే రామ’ అనే పదం తరచూ వినిపిస్తోందని, అయితే ‘హే రామ’ అనేది రాజకీయాల్లో వాడుకునే స్లోగన్ కాదని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ జగన్ వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నేడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, శ్రీరాముడు అంటే తండ్రి ధర్మాన్ని, సోదర ధర్మాన్ని, భార్యాభర్తల బంధాన్ని, తల్లిపట్ల ఉండాల్సిన పూజ్యభావాన్ని సమాజానికి నేర్పిన ఆదర్శ పురుషుడని కొనియాడారు. ‘హే రామ’ అనేది కోట్లాది మంది భక్తుల అచంచలమైన మనోభావమని, శ్రీరామునిపై ఉన్న పరమ పవిత్రమైన గౌరవమని పేర్కొంటూ జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లిని, చెల్లిని కేవలం రాజకీయ స్వార్థం, అవసరాల కోసం వాడుకుని, ఆపై బయటకు నెట్టేసిన జగన్మోహన్ రెడ్డికి అసలు ఆదర్శ పురుషుడైన రాముడి పేరు ఎత్తే కనీస నైతిక అర్హత ఎక్కడుందని ఘాటుగా ప్రశ్నించారు.
నాడు వైసీపీ ఐదేళ్ల తుగ్లక్ పాలనలో రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని నిర్దాక్షిణ్యంగా శిరచ్ఛేదం చేసినప్పుడు, అంతర్వేదిలో శతాబ్దాల నాటి దివ్య రథాన్ని తగులబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ ‘హే రామ’ ఎందుకు గుర్తుకురాలేదని బుచ్చి రాంప్రసాద్ నిలదీశారు. విజయవాడ దుర్గమ్మ రథానికి ఉన్న వెండి సింహాలు మాయమైనప్పుడు, పాడేరులో గిరిజనుల ఆరాధ్య దైవమైన కోమలమ్మ అమ్మవారి విగ్రహ పాదాలను నరికేసినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు, బ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నప్పుడు నాటి ముఖ్యమంత్రిగా జగన్ ఏనాడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి పాలనలో ఎలాంటి దాడులు లేకుండా ఆలయాలన్నీ పూర్వ వైభవంతో వెలుగొందుతుంటే, జగన్ ప్రతిరోజూ ‘హే రామ’ అనడం భక్తితో కాదు, కేవలం రాజకీయ వ్యంగ్యంతోనేనని యావత్ హిందూ సమాజం భావిస్తూ ఆగ్రహిస్తోందని మండిపడ్డారు. ‘హే రామ’ అనే ముందు… జగన్మోహన్ రెడ్డికి హిందూమతంపై, దేవుడిపై నమ్మకం ఉందని బహిరంగంగా ఒప్పుకోవాలని, తన హయాంలో జరిగిన ఆలయాల దాడులకు హిందువులందరికీ క్షమాపణ చెప్పాకే రాముడి పేరు ఎత్తాలని హెచ్చరించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి వైసీపీ ముఠా నిత్యం నీచమైన సోషల్ మీడియా కుట్రలకు పాల్పడుతోందని బుచ్చి రాంప్రసాద్ గారు ఆధారాలతో సహా దుయ్యబట్టారు. గత 2019లో వైసీపీ హయాంలో దుర్గగుడిలో జరిగిన “లడ్డూలో మేకు” పాత వీడియోను, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరిగినట్లుగా దొంగ ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తిరుమల దర్శన కంపార్ట్‌మెంట్‌లో ఉద్దేశపూర్వకంగా గొడవ చేస్తూ వీడియో వదిలిన వ్యక్తి… వైసీపీ పెయిడ్ కార్యకర్త, కాకినాడకు చెందిన ‘అచ్చారావు’ అని విజిలెన్స్, పోలీసుల విచారణలో సాక్ష్యాలతో సహా బట్టబయలు అయిందని తెలిపారు. చివరికి శ్రీశైలం లడ్డూలో బొద్దింక వచ్చిందంటూ నానాయాగీ చేస్తే, సీసీ కెమెరాల తనిఖీల్లో వైసీపీ కార్యకర్తే స్వయంగా లడ్డూ కొని అందులో బొద్దింకను గుచ్చినట్లు నిజాలు బయటపడ్డాయని, ఇలాంటి చౌకబారు రాజకీయాలతో ఆలయాల ప్రతిష్టను దిగజార్చుతున్నారని నిప్పులు చెరిగారు. టిటిడి గోశాలలో వయసుపైబడి సహజంగా ఆవులు చనిపోతే వైసీపీ బ్యాచ్ పనిగట్టుకుని అబద్ధాలు వండి వార్చిందని మండిపడ్డారు. పవిత్ర ఏడుకొండల కింద నాన్-వెజ్, మద్యం సర్వ్ చేసేలా ఫైవ్ స్టార్ ‘ముంతాజ్ హోటల’ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది జగన్ ప్రభుత్వం అయితే… ఆ పాపాన్ని కడిగేస్తూ ఆ అనుమతులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వంపై ఉల్టా నిందలు వేయడం వారి సిగ్గుమాలినతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో పవిత్రమైన “ఆగమ శాస్త్రాన్ని” పూర్తిగా ఆగం చేసింది జగన్మోహన్ రెడ్డేనని బుచ్చి రాంప్రసాద్ దుయ్యబట్టారు. దాదాపు 50 ఏళ్లుగా శృంగేరి పీఠం, కంచి పీఠాల నిర్ణయాల ప్రకారం నడిచే పవిత్ర ఆలయ సాంప్రదాయాలను తుంగలో తొక్కి, శారదా పీఠం చేతుల్లో పెట్టి హిందూ దేవాలయాల పద్ధతులను విధ్వంసం చేశారన్నారు. నేడు సీbం నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో నిజమైన రామరాజ్యం నడుస్తోందని, ఎక్కడా ఆలయాలపై, బ్రాహ్మణులపై దాడులు లేవని బుచ్చి రాంప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాలు, ముస్లింలు, క్రైస్తవులు సంతృప్తిగా ఉన్నారని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన కుట్రపూరిత రాజకీయాలు ఆపాలని హితవు పలికారు. దేవుడికి, భక్తులకు క్షమాపణ చెప్పకుండా ‘హే రామ’ అని వ్యంగ్యంగా మాట్లాడితే హిందువులు, రామభక్తులు చూస్తూ ఊరుకోరని, తగిన బుద్ధి చెప్తారని బుచ్చి రాంప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు.
















