- 11 నుంచి 18 వరకు ప్రచార వారోత్సవం
- ముగ్గురు పిల్లలున్న దంపతులకు నగదు పురస్కారం
- వైద్య, ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): కాన్పులమధ్య తగిన విరామం పాటించడం, అవాంఛిత గర్భధారణలను నివారించడం, కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11నుంచి 18 వరకు అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘పిల్లల మధ్య ఎడం పాటిద్దాం.. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో ఈసారి ప్రచారం సాగనుంది. గర్భధారణకు సరైన సమయాన్ని ఎంచుకోవడం, కాన్పులమధ్య తగిన విరామం పాటించడంవల్ల తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలు కలుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
ముగ్గురు పిల్లలుంటే సదరు దంపతులకు నగదు పురస్కారం
ముగ్గురు అంతకంటే ఎక్కువమంది పిల్లలు కలిగిన దంపతులకు నగదు పురస్కారాన్ని అందచేయనున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రతి జిల్లాలో మూడు జంటల (మొత్తం 84 జంటలు)కు రూ.5 వేల చొప్పున నగదును అందచేస్తామని తెలిపారు.
ఎడమ పాటించిన వారికి కూడా..!
కాన్పుల మధ్య కనీసం రెండేళ్లపాటు ఎడమ పాటించిన దంపతులకు కూడా నగదు పురస్కారాన్ని ఇస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఆరు జంటలకు పైవిధంగానే రూ.5వేల చొప్పున నగదు అందచేస్తామని మంత్రి తెలిపారు. ఎక్కువ మంది ఉంటే లక్కీ డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. కాన్పు, కాన్పునకు మధ్య కనీసం రెండేళ్ల వరకు విరామం పాటిస్తే తల్లీబిడ్డల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విధానాన్ని పాటిస్తే మాతృత్వ మరణాల్లో 30 శాతం, శిశు మరణాల్లో 10 శాతం వరకు తగ్గుతాయని పేర్కొన్నారు. యుక్తవయస్సు గర్భధారణలు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ప్రసవానంతరం అమర్చే గర్భనిరోధక సాధనం, ‘అంతరా’ సూది తదితర పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. జిల్లా, మండలస్థాయిలో సమావేశాలు, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ సంస్థలు, పురపాలక సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, మహిళా శిశు అభివృద్ధిశాఖ సిబ్బంది, ఇతర ప్రజా భాగస్వామ్య సంస్థలను ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు
వైద్యులు ఇతర సిబ్బందికి కూడా
ఉత్తమంగా పనిచేసిన వైద్యులు, సిబ్బందికి నగదు పురస్కారాలు ఇవ్వనున్నట్లు చక్రధర్ బాబు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.56 లక్షలను విడుదల చేశామని చెప్పారు.
















