- రూ.306.29 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం
- 6100 మంది మత్స్యకారులకు ప్రత్యక్ష ప్రయోజనం
- పారదర్శక వేలం విధానంతో మధ్యవర్తుల ప్రభావానికి కళ్లెం
- కేరళ, తమిళనాడు తరహా నిర్వహణ: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
అమరావతి (చైతన్య రథం): మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి మెరుగుదలతోపాటు వారి ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్నె మత్స్యకార హార్బర్ ఇందుకు ప్రత్యేక నిదర్శనమని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఫిషింగ్ హార్బర్‌కు సంబంధించి కీలకమైన నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు అర్హత కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సమర్థవంతంగా నిర్వహించడం, పరిశుభ్రత, భద్రత, మానవ వనరుల వినియోగం, మౌలిక సదుపాయాల నిర్వహణను మరింత మెరుగుపరచడం కోసం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రతిపాదనలు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి స్పష్టం చేశారు.
కేరళ, తమిళనాడు విధానాల అధ్యయనం
కీలకమైన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్వహణ ప్రస్తుతం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసిందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు అత్యంత సమర్థవంతంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను నిర్వహిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ అందించేందుకు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రైవేట్ సంస్థల నుంచి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అత్యధిక వార్షిక లైసెన్స్ ఫీజు కోట్ చేసిన సంస్థను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (O&వీ) కోసం ఎంపిక చేయనున్నారని, అదే సమయంలో హార్బర్ భూమిపై ఎంపికైన సంస్థకు ఎటువంటి యాజమాన్య బదిలీ లేదా లీజు హక్కులు కల్పించబడవని మంత్రి స్పష్టం చేశారు.
పారదర్శక వేలం విధానం, మెరుగైన సేవలు
ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా హార్బర్‌లో పరిశుభ్రత, పారిశుధ్యం, భద్రత అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించబడుతుందని మంత్రి తెలిపారు. బోట్ల నిలుపుదల నుంచి ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ వరకు అన్ని సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా నిర్వహణ చేపట్టబడుతుందని చెప్పారు. పారదర్శకమైన వేలం విధానం అమలు చేయడం ద్వారా మధ్యవర్తుల ప్రభావం తగ్గి, మత్స్యకారులకు వారి చేపలకు పోటీ ధరలు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్‌లను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల చేపల వేట అనంతర నష్టాలు గణనీయంగా తగ్గి, చేపల నాణ్యత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా విశ్రాంతి గదులు, నెట్ మెండింగ్ షెడ్లు, ఇతర సౌకర్యాలన్నీ నిరంతరం నిర్వహించబడటం వల్ల మత్స్యకారులు మరింత సురక్షితమైన, పరిశుభ్రమైన, అనుకూలమైన వాతావరణంలో తమ వృత్తిని కొనసాగించగలుగుతారని తెలియజేశారు.
95.51 శాతం పూర్తయిన నిర్మాణ పనులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ఆధునిక ఫిషింగ్ సెంటర్‌గా అభివృద్ధి చేసి, మత్స్యకారుల ఆదాయం, జీవన ప్రమాణాలు, ఎగుమతి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతోందని మంత్రి వెల్లడించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఇప్పటివరకు రూ.306.29 కోట్ల వ్యయంతో 95.51 శాతం భౌతిక పురోగతి సాధించినట్లు తెలిపారు. హార్బర్‌లో మొత్తం 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పించగా, ఇందులో 1,000 మోటరైజ్డ్ బోట్లు, 200 మెకనైజ్డ్ బోట్లు, 50 ట్యూనా లాంగ్‌లైనర్ బోట్లకు వసతి కల్పించే విధంగా రూపకల్పన చేసినట్లు వివరించారు.
6,100 మంది మత్స్యకారులకు ప్రత్యక్ష ప్రయోజనం
ఈ హార్బర్ ద్వారా సుమారు 6,100 మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుండగా, చేపల వ్యాపారులు, ఐస్ పరిశ్రమ కార్మికులు, రవాణా రంగం, అనుబంధ సేవల ద్వారా వేలాది మందికి పరోక్ష ఉపాధి లభించనున్నట్లు మంత్రి తెలిపారు. హార్బర్‌లో 835 మీటర్ల ఉత్తర బ్రేక్‌వాటర్, 620 మీటర్ల దక్షిణ బ్రేక్‌వాటర్, 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్, 909 మీటర్ల క్వేలు పూర్తయ్యాయి. అలాగే ఆధునిక ఆక్షన్ హాల్స్, ట్యూనా ప్యాకింగ్ హాల్, చేపల ఎండబెట్టే యార్డ్, 500 కేఎల్ సామర్థ్యంతో ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఐస్ ప్లాంట్, కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 9 గేర్ షెడ్లు, 4 నెట్ మెండింగ్ షెడ్లు, 3 విశ్రాంతి గదులు, కమ్యూనిటీ హాల్, రెస్టారెంట్-డార్మిటరీ, గెస్ట్ హౌస్ నిర్మించారు. అదనంగా 53,695 చ.మీ. అంతర్గత రహదారులు, 33,938.73 చ.మీ. పార్కింగ్, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, రేడియో కమ్యూనికేషన్ టవర్, కోస్టల్ పోలీస్ స్టేషన్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది.
















