- 150 మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదు
- ఓడిపోతారని చెప్పి దళిత నేతలను మార్చారు
- మరి పెద్దిరెడ్డి, బాలినేని, ద్వారంపూడిలను ఎందుకు మార్చలేదు?
- వైసీపీ శాశ్వతంగా మునిగిపోయే పడవ
- జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు
- అభ్యర్థుల ఎంపికలో ఈసారి కొత్త విధానం
అమరావతి,చైతన్యరథం: ఒక్క ఛాన్స్ పాపం శాపంలా మారిందని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారని, నెత్తిన పెట్టుకున్న జగన్‌రెడ్డి అనే కుంపటిని కింద పండేందుకు ప్రజలంతా ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. జగన్‌రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని చెప్పారు. మద్యనిషేధం చేసిన తర్వాతనే ఓటడగుతానని గత ఎన్నికల్లో చెప్పిన జగన్‌రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఈసారి ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంపైన గతంలో ఎప్పుడూ చూడనంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని, అది తెలిసే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుతున్నారన్నారు. జగన్‌రెడ్డి 150 మంది ఎమ్మెల్యేలను మార్చినా గెలవడం కష్టమని, ప్రజలంతా జగన్‌రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారని చెప్పారు. ఓడిపోతారనే కారణంతో ఎమ్మెల్యేలను, మంత్రులను మార్చారని, వీరికి బదిలీలు కూడా ఉంటాయని తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని ఎద్దేశా చేశారు. ఒక చోట చెల్లని కాసు మరోచోట చెల్లుతుందా అని ప్రశ్నించారు. ఐదుగురు దళిత ఎమ్మెల్యేలను మార్చారని, అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారని, మరో బీసీ మంత్రిని మార్చారని, అమాయకులు కాబట్టి వారిని మర్చారా అని ప్రశ్నించారు. అదే ఎంతో అవినీతి చేసి చెడ్డపేరు తెచ్చుకున్న బాలినేని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. జగన్‌రెడ్డికి బీసీల మీద అంత ప్రేమ ఉంటే పులివెందులలో ఓ బీసీని నిల్చొబెట్టి గెలపించొచ్చు కదా అని అడిగారు. జగన్‌కు ధైర్యముంటే పులివెందుల దాటి బయటకు వచ్చి ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నిలబడి గెలవాలని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక ఎన్నికలని, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు, అంధకారానికి మధ్య పోటీ అని, తెలుగుజాతి నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇది ఐదు కోట్ల మంది ప్రజలకు, సైకో జగన్‌కు మధ్య జరగుతున్న ఎన్నికలని, ఈ ఎన్నికల్లో జగన్‌రెడ్డిని ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని అన్నారు. జగన్‌రెడ్డి లెక్కలు మారుతున్నాయని, వైసీపీ పడవ మునిగిపోతుందని, అందుకనే ఆ పార్టీ నుండి చాలామంది బయటకు వస్తున్నారని, మంచోళ్లు ఎవరైనా వస్తామంటే తమ పార్టీలో చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. వైసీపీ పునాది లేని పార్టీ అని, ప్రజలు నమ్మి అధికారం ఇస్తే వ్యవస్థన్నింటీనీ భ్రష్ణు పట్టించి నాశనం చేశారన్నారు. ప్రజల్లో విపరీతమైన కోపం ఉందని, ఈసారి వైసీసీ ఓడిపోతే ఆ పార్టీ శాశ్వతంగా మూతపడిపోతుందన్నారు. పునాది లేని పార్టీ వైసీపీ అని, ఈ ఎన్నికలు తర్వాత ఆ పార్టీకి కూసాలే కదిలిపోతాయని చెప్పారు.
అభ్యర్థుల ఎంపికలో ఈసారి కొత్త విధానం
రానున్న ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల ఎంపికకు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నామని, వివిధ మార్గాల ద్వారా ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన నేతనే అభ్యర్థిగా ఎన్నిక చేస్తానని చంద్రబాబు చెప్పారు. కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని, అయితే ఇందుకు ఉపయోగించే కొత్త పద్ధతి ఏంటనేది ఇప్పుడే చెప్పనని అన్నారు. అభ్యర్థుల ఎంపిక కూడా ఈసారి వేగంగా చేస్తామని చెప్పారు. వైసీపీ అభ్యుర్థుల ఎంపిక తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగితే తమ అభ్యర్థుల ఎంపిక ప్రజల నుండి వస్తుందని చెప్పారు. దొంగ ఓట్లను అరికట్టేందుకు తమ పార్టీ సమర్థవంతంగా పని చేస్తోందని, ఎవరైనా దొంగ ఓట్లను రిజిష్టర్ చేస్తే వాళ్లును వదలిపెట్టే ప్రశ్నే లేదని, వారిని కచ్చితంగా జైలుకు పంపుతామని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని, జనసేనతో కలిసి ఇప్పటికే ఆరు గ్యారంటీలతో మ్యానిఫెస్టోను ప్రకటించామని, ఈ మ్యానిఫెస్టోను టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటి వరకు 37 లక్షల ఇళ్లకు తీసుకెళ్లారన్నారు. ఈ మ్యానిఫెస్టోపై ప్రజల్లో మంచి స్పందన వస్తోందని చెప్పారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వ అణిచివేత సరైందికాదన్నారు. జగన్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు ఉద్యమిస్తున్నారన్నారు. వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని, ఎంతమందిని ఉద్యోగాల నుండి తొలగిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు