అమరావతి : రాష్ట్ర విద్యావ్యవస్థ జగన్ రెడ్డి హయాంలో ప్రయోగశాలగా మారిందని మాజీమంత్రి కేఎస్ జవహర్ విమర్శించారు. ఆ ప్రయోగశాల కూడా రాబోయే తరానికి శాపంగా తయారవ్వడం నిజంగా బాధాకరం. చంద్రబాబు హయాంలో దేశంలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగం.. నేడు జగన్ పాలనలో అథమస్థానానికి పడిపోవడానికి కారణం.. జగన్ అవినీతే. జగన్ అధికారంలోకి వచ్చీ రావడంతోనే 1964, కొఠారి కమిషన్ సిఫార్సులు పట్టించుకోకుండా.. నూతనవిద్యా విధానం పేరుతో గ్రామాలకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చాడనే వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాలని జవహర్ అన్నారు.
దేశమంతా తిరస్కరించిన నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తున్నారు
ట్యాబ్ ల పంపిణీ పేరుతో జగన్ రెడ్డి .. తానే రాష్ట్ర విద్యారంగాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడాడు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని నూతన విద్యావిధానాన్ని ఏపీలో తాను మాత్రమే ఎందుకు అమలుచేస్తున్నాడో జగన్ సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాకముందు 26వేల ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీచేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్.. ఈ రోజుకి ఒక్క పోస్టు కూడా ఎందుకు భర్తీచేయలేదో చెప్పాలి. రాష్ట్రంలో 9వేల ఏకోపాధ్యాయ పాఠశాలలుంటే… ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతుల విద్యార్థులకు.. అన్నిరకాల పాఠాలు చెప్పడం ఎలా సాధ్యమవుతుందో జగన్ చెప్పాలని జవహర్ నిలదీశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న పాట్లు మంత్రి బొత్సకు తెలియవు
ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు 98మంది కంటే తక్కువ ఉంటే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల్ని నియమించలేమని చెబుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు వింటే.. ప్రాథమికవిద్యకు, ప్రాథమికోన్నత విద్యకు, ఉన్నత విద్యకు ఆయనకు తేడా తెలియదని అర్థమవుతోంది. విద్యాశాఖ మంత్రికి ఆయన శాఖలో జరుగుతున్న మార్పులు.. విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న పాట్లు తెలియవని అర్థమవుతోంది. తరగతి గదిలో విద్యార్థుల ఎదుట ఉపాధ్యాయుడు ఉంటేనే వారికి మెరుగైన విద్య లభిస్తుంది తప్ప… బైజూస్ పేరుతో ట్యాబ్ లు అందిస్తేనే.. కంప్యూటర్లపై రికార్డెడ్ పాఠ్యాంశాలు బోధిస్తేనో నాణ్యమైన విద్య అందదనే వాస్తవాన్ని మంత్రి గ్రహించాలి. విద్యార్థులు టీవీ చూస్తూ విద్యను అభ్యసించడం కష్టమని తెలుసుకోవాలి. గురుకుల పాఠశాలల్లో 8, 9 తరగతులకు సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తూ.. 10వ తరగతికి స్టేట్ సిలబస్ బోధించడం ఏమిటో ..ఈ విధమైన బోధనకు ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉన్నాడా.. విద్యార్థులు గ్రహిస్తున్నారా ..లేదా అనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి, మంత్రి బొత్స చేయక పోవడం నిజంగా దురదృష్టకరమని జవహర్ అన్నారు.
నేషనల్ ఎఛీవ్‌మెంట్ సర్వేపై జగన్ సమాధానం చెప్పాలి
జగన్ సర్కారు గొప్పలు చెబుతున్న నాడు-నేడు పథకంపై నేషనల్ ఎఛీవ్‌మెంట్ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడిరచింది. జాతీయస్థాయిలో 3వ తరగతి విద్యార్థుల పరిణితి, విద్యాభ్యాసంపై వారి గ్రాహాక శక్తి 59 శాతముంటే, ఏపీలో మాత్రం అది 54 శాతానికే పరిమితమైంది. 5వ తరగతి విద్యార్థుల్లో దేశస్థాయిలో అది 49శాతం ఉంటే, మనరాష్ట్రంలో మాత్రం 43శాతానికే పరిమితం. 8వ తరగతి విద్యార్థుల్లో జాతీయస్థాయిలో అది 42 శాతముంటే, ఏపీలో 38 శాతమే ఉంది. దీనికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.
చంద్రబాబు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే కారణం
చంద్రబాబు హయాంలో రాష్ట్ర విద్యావ్యవస్థ దేశంలో 3వ స్థానంలో ఉండటానికి కారణం ఆనాడు ఆయన తీసుకున్న చర్యలు.. ముందుచూపు నిర్ణయాలే కారణం. 17వేలకు పైగా ఉపాధ్యాయుల్ని నియమించడం.. డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు వంటి నిర్ణయాలతో విద్యారంగాన్ని చంద్రబాబు బలోపేతం చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర విద్యావ్యవస్థ 19వ స్థానానికి దిగజారడాన్ని బట్టే.. ఆయన విద్యా రంగాన్ని సర్వనాశనం చేశాడని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్. తన తల్లి, భార్యను రోడ్లపైకి పంపి అమ్మఒడి ప్రతి బిడ్డకు అందిస్తామని వారితో చెప్పించి.. తల్లుల్ని వంచించాడు. 5 ఏళ్లల్లో జగన్ మూడుసార్లు మాత్రమే అమ్మ ఒడి ఆర్థిక సాయం అందించాడు. దానిలో కూడా కోతలు పెట్టాడని జవహర్ విమర్శించారు.
సైకిళ్లు అందించకుండా బాలికల్ని విద్యకు దూరం చేశాడు
అమరావతిపై తనకున్న కోపాన్ని జగన్ విద్యాసంస్థలపై చూపడంతో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు.. అమృత వంటి విద్యాలయాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఆఖరికి చంద్రబాబు విద్యార్థినులకు ఇవ్వాలనుకున్న సైకిళ్లను కూడా పనికిరాకుండా చేసి జగన్ వాటిని మూలన పడేశాడు. చంద్రబాబుపై అక్కసుతో బాలికల్ని ప్రాథమిక విద్యకు దూరం చేశాడు. ఉపాధ్యాయులపై పని భారం పెంచాడు. వారంలో 48 గంటల పాటు వారు విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. దేశంలో ఎక్కడా 36 గంటలకు మించి బోధన లేదు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డీఏలు.. ఇతర ఎరియర్స్ అన్నీ బకాయి పెట్టాడు. యాప్ ల పేరుతో వారిని వేధిస్తూ.. అటు బోధనకు దూరం చేశాడు. రాష్ట్రంలో 50 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని కేంద్రం చెబితే.. జగన్ ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఖాళీ కూడా భర్తీచేయలేదు. కేవలం కమీషన్లు వచ్చే అంశాలకు మాత్రమే జగన్ ప్రాథాన్యత ఇస్తూ.. విద్యావ్యవస్థను నీరుగార్చారని జవహర్ స్పష్టం చేశారు.