48 ఏళ్ల క్రితం దేశంలో పేదరికం, నిరక్షరాస్యత ప్రస్తుతానికంటే పలు రెట్లు ఎక్కువగా ఉండేది. అయినా 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య చైతన్యంతో ఎమెర్జెన్సీ ముసుగులో రెండేళ్లపాటు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కనుసన్నల్లో రెండేళ్లపాటు సాగిన అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఆ విధంగా 30 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేంద్రంలో మొదటిసారిగా కాంగ్రేసేతర ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. తన ఓటమికి ఇందిరాగాంధీ ప్రజల్ని తప్పుపట్టలేదు. ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నభూతో నభవిష్యతి అనే రీతిలో రాజీవ్ గాంధీ 400 పైగా లోక్‌సభ సీట్లతో ప్రధాని అయ్యారు. అనంతరం గాడితప్పి 1989లో ఓటమి చెందారు. ఆయన కూడా ప్రజల్ని వెన్నుపోటుదారులని దూషించలేదు.
1995,1999ల్లో రెండు సార్లు ముఖ్యమంత్రి అయి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి తెలుగుజాతి ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో ఇనుమడిరపజేసిన నారా చంద్రబాబు నాయుడు 2004లో ఓటమిని చవిచూశారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రతిష్టింపజేసిన తెదేపా వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసి మూడోసారి 1989లో అధికారానికి దూరమయ్యారు. 1998 నుంచి ఆరేళ్లపాటు ప్రధానిగా దేశంలో మౌలిక సదుపాయల కల్పనలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, అంతర్జాతీయ వ్యవహారాల్లో దేశ ప్రతిష్టను ఇనుమడిరప చేసిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 2004లో ప్రజాదరణకు దూరమయ్యారు.
వారంతా ప్రజాతీర్పునకు శిరసు వంచారు కానీ ఓటర్లను తప్పుపట్టలేదు.
అయితే…. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూటే వేరు. పలు కల్లబొల్లి మాటలు, విన్యాసాలతో 2019లో 153 అసెంబ్లీ స్థానాలతో అధికారం చేపట్టి ఐదేళ్ల తర్వాత భారీ ప్రజా తిరస్కారానికి గురై కేవలం 11 స్థానాలకు పతనమయ్యారు. తానూహించని ఈ పరిణామానికి ఆయన మైండ్ బ్లాకయ్యింది. ఓడినప్పట్నించీ ప్రజలపై ఉక్రోషాన్ని పెంచుకుని ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లను ఇంతకుముందెవరూ చేయని విధంగా నిస్సిగ్గుగా వెన్నుపోటుదారులుగా అభివర్ణించే దుస్సాహసం చేశారు. ఈ విచిత్ర ప్రవర్తనకు కారణాలు విశ్లేషించడం అవసరం.
ప్రజలేం కోరుకుంటారు?
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తదనంతరం జగన్ రెడ్డి తరచుగా చేసే వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలిస్తే ఆయన నైజం, మానసికత వెల్లడవుతాయి. ఆయన పదే పదే వల్లెవేసే మాట…ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.2.70 లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని డిబిటి ద్వారా పలు వర్గాలకు బదిలీ చేశారు. ఈ వితరణ తనకెంతగానో లాభించి 2024లో తనకు మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందని ఆయన బలంగా నమ్మారు. ఈ నేపథ్యంలోనే రూ.500 కోట్ల ప్రజాధనంతో విశాఖ సముద్రతీరంలో తన కుటుంబం కోసం ఒక విశాల సౌధాన్ని నిర్మించుకున్నారు. అయితే…ఐదేళ్లుగా జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని ఆకళింపు చేసుకున్న ప్రజలు ఆయన కోరుకున్న రెండో ఛాన్స్‌కు స్పష్టంగా నో అని చెప్పారు. దాంతో జగన్ రెడ్డి ప్రస్తుతం ఎక్కువగా బెంగుళూరు ప్యాలెస్ లో ఉంటున్నారు.
ఈ జగన్ రెడ్డి ఉదంతంతో విశ్లేషించాల్సిన విషయం ఏంటంటే…తామెన్నుకున్న ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి ఆశిస్తారు? అదే ప్రజ ఐదేళ్ల తర్వాత వారినెందుకు తిరస్కరిస్తారు, ఆ విధంగా తిరస్కారానికి గురైన జగన్ రెడ్డి ప్రజల కాలర్లు పట్టుకుని…రూ.2.70 లక్షల కోట్లు మీ చేతుల్లో పెట్టినా ఎందుకు నాకు వెన్నుపోటు పొడిచారు అని ఎందుకు అడుగుతున్నారు? క్లుప్తంగా…ప్రజలకేంకావాలి అన్నది ప్రధాన ప్రశ్న.
రోటీ, కపడా ఔర్ మకాన్ చాలా?
1977లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగానూ, 2024లో జగన్ రెడ్డికి వ్యతిరేకంగానూ ప్రజలిచ్చిన తీర్పుల్లో ఎంతో సామీప్యం ఉంది. వారిరివురూ తాము పేద ప్రజల హృదయ సామ్రాట్టులమని, తామేంచేసినా చెల్లుతుందని గట్టిగా విశ్వసించారు. డాక్టర్ అంబేద్కర్ విరచిత పవిత్ర భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించారు. తామేంచేసినా చెల్లుతుందనే అహంకారంతో అధికార వ్యవస్థలన్నింటినీ స్వార్థ ప్రయోజనాలకు దురుపయోగం చేశారు. ఈ ధోరణిలో భాగంగానే…పేదల పేరుతో తాను నడిపిన బటన్ నొక్కుడు వ్యవహారం తాను పాల్పడ్డ బొక్కుడు నిర్వాకాల్ని మరుగున పడేస్తుందని జగన్ రెడ్డి ప్రగాఢ నమ్మిక. ఈ స్ఫూర్తితో రాష్ట్రంలో అందినకాడికి దోపిడీకి దారులు తీశారు. మద్యం విక్రయాల నుంచి, పేదల ఇళ్ల నిర్మాణం వరకు, చివరికి పవిత్ర తిరుపతి లడ్డూలు కూడా జగన్ రెడ్డికి అక్రమ ఆదాయ వనరులుగా మారాయి. విలువైన ప్రకృతి వనరులు మట్టి, ఇసుక, ఖనిజాలు, ప్రభుత్వ భూములు, అడవులు ఆయన, అనుచరుల ఖజానాలకు సోపానాలయ్యాయి. వ్యాపారస్తులు, పెట్టుబడిదారుల్ని కూడా పీల్చి పిండిచేసి రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారు.
తమ ఖజానాలు నిండి పొంగి పొరలే కొద్దీ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయ వికృత క్రీడకు తెరతీశారు. రాజకీయ ప్రత్యర్థుల స్వేచ్చా స్వాతంత్య్రాల్ని హరించి వారిని భయభ్రాంతులు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉంటూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడిని కుయుక్తులతో జైలుపాలు చేయడంతో జగన్ రెడ్డి రాజకీయ వికృత క్రీడ పరాకాష్టకు చేరుకుంది. ఈ తీరున రాష్ట్రంలో మున్నెన్నడూ లేనివిధంగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. ప్రజాజీవితంతో పాటు రాజకీయాల్లో ఒక దుష్ట భాష, సంస్కృతి పురుడుపోసుకుని దినదినమానంగా వర్థిల్లాయి. వీటితో సహజంగానే ప్రజల్లో జగన్ రెడ్డి పట్ల వెగటు పుట్టింది. ఇదేమీ గమనించని జగన్ రెడ్డి తన సహజ ధోరణిలో విశాఖలో రాజప్రాసాదాన్ని మించే విలాస భవనాన్ని కట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.
స్ణూలంగా తన అరాచక, అప్రజాస్వామిక, అవినీతి ధోరణులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల ముందు తనకు తాను సాక్షాత్కరించుకున్నారు. అదెలాగంటే తాను భారత రాజ్యాంగానికి అతీతుడనని, చట్టాలు, న్యాయ సూత్రాలు తనకు అన్వయించవని, పాలించడానికే తాను పుట్టానని. దీంతో పాటు ప్రజల పట్ల తనకున్న చౌకబారు అభిప్రాయాల్ని కూడా బయటపెట్టుకున్నారు. నేడు గడవడానికి ప్రజల చేతుల్లో కాస్త డబ్బుపడేస్తే వారు దేనినీ పట్టించుకోరని, తమ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు గురించి ప్రజలు ఆలోచించరని, రాజ్యాంగ ప్రసాదిత ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛా, స్వతంత్రాలు వారికి పట్టవని, నియమ నిబంధనలతో కూడిన రుజు పాలన పట్ల ప్రజలకు ఆసక్తి ఉండదని జగన్ రెడ్డి బలమైన విశ్వాసం. ఆయన ఐదేళ్ల పాలన ఇటువంటి దుర్మార్గాలకు అనునిత్యం పట్టంకట్టడం ప్రజలు కనులారా చూశారు.. అనుభవించారు…అందుకనే తిరస్కరించారు.
1977, 2024లో ఇందిరాగాంధీ, జగన్మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పులు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. అదేమంటే…రోటీ, కపడా ఔర్ మకాన్ (తిండి, గుడ్డ, గూడు) ప్రజల కనీస అవసరాలైనా, వాటితో సరిపుచ్చుకోవడమే కాకుండా ప్రజలు వాటిని మించి గౌరవ ప్రదమైన జీవితాన్ని కోరుకుంటారని స్పష్టమైంది. ఒక దశలో కనీస అవసరాల్ని పొందడం తమ హక్కుగా ప్రజలు భావిస్తారని, తమ స్వేచ్ఛాస్వతంత్రాలకు హాని కలిగే పరిస్థితుల్లో వారు తిరగబడతారని ఈ రెండు తీర్పులూ స్పష్టం చేశాయి. దీంతోపాటు పాలకుల నుంచి మంచి భాష, మంచి నడవడిక, మంచి పాలనను ప్రజలు ఆశిస్తారని, దైనందిక జీవన విషయాల్లో తలమునకలై ఉన్న ప్రజలు ప్రతి రోజూ వీటిని గమనిస్తారని, వారి అంచనాలకు విరుద్ధంగా పాలకులు నడిస్తే వారిపై ప్రజలు ప్రజాస్వామిక రీతిలో తిరగబడతారని కూడా ఆ తీర్పులు స్పష్టం చేశాయి.
ప్రజాభిప్రాయాలు, ఆశలు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటే జగన్…జగన్ రెడ్డిలా ఎలా అవుతారు. ఆయన పుట్టుక, పెరిగిన నేపథ్యం జగన్ రెడ్డిలోని ప్రజాస్వామ్య, ప్రజావ్యతిరేక తీరుకు బలమైన పునాదులు వేసి సుసంపన్నం చేశాయి. వీటి పర్యవసానమే ఐదేళ్లపాటు జనాన్ని గాయపరిచిన జగన్ పోటు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజాభీష్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డే నిజమైన వెన్నుపోటుదారుడు.
భిన్న ధృవాలు
ప్రజా జీవితంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలు భిన్న ధృవాలని రాష్ఠ్ర ప్రజలకు విదితమే. ప్రజల జీవితాల్ని మెరుగుపరిచే సాధనం ప్రజాస్వామ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలంగా విశ్వసిస్తారు. ప్రజాస్వామ్య ముసుగులో అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు దుర్వినియోగం చేసే విద్యలో జగన్ రెడ్డి నిష్ణాతుడు. కనుకనే 2024 ప్రజాతీర్పునకు అనుగుణంగా వారిరువురూ నడుచుకుంటున్నారు. గత సంవత్సరంగా ప్రతి రోజూ ప్రజా శ్రేయస్సు కొరకు, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం తపిస్తూ పలు ఆలోచనలు, ప్రయత్నాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. దీనికి భిన్నంగా తనను ఓడిరచారంటూ ప్రజలపై ఆగ్రహంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య వ్యతిరేక జపం చేస్తున్నారు. ఈ మానసిక వైకల్యంతో…ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయమున్నా మళ్లీ అధికారం చేపట్టి తమ రాజకీయ ప్రత్యర్థులు, నియమాల ప్రకారం నడుచుకుంటున్న అధికారుల భరతం పడతానంటూ జగన్ రెడ్డి నిత్యం ఊగిపోతున్నారు. ఈ విధమైన పగ, ప్రతీకారాలతో ఎదురయ్యే అనర్థాల పట్ల ప్రజలు అప్రమత్తతతో ఉండాలి. స్వీయ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా బరితెగించి నడుచుకునే నాయకుల్లో జగన్ రెడ్డి అగ్రస్థానంలో ఉంటారు. తస్మాత్ జాగ్రత్త!
ప్రజారోగ్యం-జగన్ రెడ్డి నమూనా
బటన్ నొక్కడమే అన్ని ప్రజా సమస్యలకు పరిష్కార మార్గంగా భావించిన జగన్ రెడ్డిని ప్రజలు ఎందుకు తిరస్కరించినట్లు? ప్రజలకు నొప్పి తగిలితేనే కదా వారు మార్పు కోరుకునేది. ఇందుకు సంబంధించి ప్రజారోగ్య రంగంలో జగన్ హయాంలో నెలకొన్న పరిస్థితిని స్థూలంగా పరిశీలిద్దాం. జగన్ రెడ్డి పాలించిన ఆ ఐదేళ్ల కాలం భారీ ప్రకటనలు, ఆచరణ శూన్యతలకు ఆలవాలం. ఇందుకు ప్రజారోగ్య రంగం ఒక విశిష్ట సాక్ష్యం. రూ.8,400 కోట్ల ఖర్చుతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తానని చెప్పి, అధికారంనుండి దిగిపోయే నాటికి అందులో కేవలం 14 శాతం మాత్రమే ఖర్చు చేసి తదుపరి బాధ్యతను కూటమి ప్రభుత్వంపై వదిలేశారు. నాడు-నేడు కార్యక్రమం కింద రూ.12,000 కోట్లతో వైద్య సదుపాయాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చివేస్తానని బీరాలు పలికిన మాజీ ముఖ్యమంత్రి అందులో కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు చేసి తదుపరి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వ వాకిట వదిలేశారు. జీరో వేకెన్సీ పాలసీ కింద వైద్య రంగంలో నియమాకాలన్నింటినీ పూర్తి చేశానని జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకున్నారు. వాస్తవంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఐదేళ్లూ వైద్య రంగంలో కూడా అవినీతి అన్ని స్థాయిల్లో తాండవించింది. ప్రతి విషయంలోనూ రాజకీయ జోక్యం మితిమీరి వ్యవస్థ అస్తవ్యస్తమయ్యింది. ఉద్యోగ నియమాకాల లిస్టులు కలెక్టర్ల కార్యాలయాల నుంచి కాకుండా వైసిపి నేతల ఇళ్లనుంచి వచ్చాయి.
వందలాది మంది డాక్టర్లు అనుమతుల్లేకుండా పనికి ఎగనామం పెట్టారు. డ్యూటీకి వచ్చిన వారు మొక్కుబడిగా సంతకాలు చేసి స్వంత పనుల్ని చక్కబెట్టుకున్నారు. ప్రజలు…ముఖ్యంగా పేదల ఆరోగ్యంపట్ల చిత్తశుద్ధి ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజారోగ్య రంగాన్ని ఈ విధంగా గాలికొదిలేస్తారా? అది జగన్‌కే సాధ్యం. అట్టి వారసత్వాన్ని అందుకున్న కూటమి ప్రభుత్వం పరిస్థితిని మెరుగుపరచడానికి నడుం బిగించి మొదటి ఏడాదిలో మార్పు తేగలిగింది. జగన్ పుణ్యమా అని ఇంకా చేయాల్సింది చాలా ఉంది….చేస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకు హామీ ఇస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత మేరకు ఆరోగ్య, ఐశ్వర్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ఆరోగ్య రంగంలో ముందుకు పోతున్నాం. ఇది మా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాం. ఎందుకంటే…ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన అధినేతలని కూటమి విశ్వసిస్తోంది. ఓడిరచారని ప్రజల్ని వెన్నుపోటుదారులుగా దూషించే ధూర్తులకు మేము భిన్నం.
సత్యకుమార్ యాదవ్
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్యా శాఖా మంత్రి