- కేబినెట్లో తీర్మానించి కేంద్రానికి పంపుతాం
- అమరావతిలో అంతర్జాతీయస్థాయి లా స్కూల్
- 100 ఎకరాల్లో ఏర్పాటుపై అధ్యయనం చేయండి
- జేఏలకు త్వరలోనే రూ.10వేలు గౌరవ వేతనం
- ప్రాసిక్యూషన్ మరింత పదునుదేలాలి..
అమరావతి (చైతన్య రథం): కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వంనుంచి కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడిరచారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు తీర్మానంచేసి కేంద్రానికి పంపుతామన్నారు. సోమవారం సచివాలయంలో న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. బెంగుళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లాంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ ఇనిస్టిట్యూట్‌ను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
అదే విధంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనంగా రూ.10 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని… ఆమేరకు చెల్లించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారలకు సూచించారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైనా కసరత్తు చేయాలన్నారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని… దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్దతులను అవలంభించాలని సీఎం సూచించారు. తప్పుచేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలే కానీ… అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్ ప్రభుత్వంనుంచి ఉండకూడదని సీఎం వ్యాఖ్యానించారు. న్యాయశాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్న ముఖ్యమంత్రి… మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు.