- సమర్థ ప్రభుత్వానికి అదే గీటురాయి
- రాష్ట్రాభివృద్ధికీ లా అండ్ ఆర్డర్ కీలకం
- అసమర్థ ప్రభుత్వం అనిపించుకోలేను
- తగినవిధంగా పోలీసింగ్ ప్రణాళిక ఉండాలి
- టెక్నాలజీని సమర్థంగా వాడుకుందాం
- త్వరలోనే కొత్త లిక్కర్ పాలసీ తెస్తాం..
- పోలీస్, ఎక్సైజ్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): భూసమస్యల విషయంలో ప్రజల్లో అశాంతి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతల అంశంపై నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ‘‘ప్రజలతో అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి సిద్ధంగా లేను. నేరాలు అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్లు వాడాలి. గత ప్రభుత్వం ప్రత్యర్థులను వేధించడానికి పోలీసు వ్యవస్థను వాడుకుంది. మదనపల్లె ఘటన జరిగితే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపాను. గత ప్రభుత్వంలో కంప్యూటర్‌లో చిన్నపాటి మార్పు చేసి భూములు కాజేశారు. భూములను ఫ్రీహోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. నేరాలు చేసి కప్పిపుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారింది. వివేకా గొడ్డలిపోటు హత్యను గుండెపోటుగా మార్చారు. 36మందిని రాజకీయ హత్యలు చేశారని ఆరోపిస్తున్నారు. తప్పుడు ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటున్నా. కొందరు గంజాయి తీసుకొని మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. శాంతిభద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. పోలీసులు గంజాయి హాట్‌స్పాట్లపై దృష్టిపెట్టాలి’’ అని చంద్రబాబు సూచించారు.
ఐదేళ్ల క్రితం వందల కోట్లు ఖర్చు చేసి 15వేల కెమెరాలను ఏర్పాటు చేశాం. ఫై డేటా సేకరణ కోసం కంట్రోల్ రూమ్‌లు పెట్టాం. జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు పెట్టాం. ఎక్కడివక్కడ వదిలిపెట్టారు. ఎవ్వరు తప్పు చేసినా సత్వరమే కనుగొనే వ్యవస్థను తీసుకొచ్చినా.. ఉపయోగించుకోకపోవడం బాధేస్తుంది. త్వరలోనే శాఖలతో స్పష్టత తీసుకొని పోలీసులకు ఏమేం కావాలి? ఇతర శాఖలకు ఏమేంకావాలి? చెబితే యూజర్ అప్లికేషన్స్ అన్నీ తెప్పిస్తాం. లేకపోతే దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ ముందుకు పోదాం. ఇది నిరంతర ప్రక్రియ అని చంద్రబాబు వివరించారు. ఇప్పుడున్న కెమెరాలు ఎంత వరకు ఉపయోగపడతాయి? అని పరిశీలించాక కొత్త కెమెరాలు తీసుకొస్తామన్నారు. రెడ్‌లైట్ వయొలేషన్ డిటెక్షన్, రాంగ్‌వే, నో పార్కింగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ డిటెక్షన్, ఫేషియల్ రికగ్నిషన్ సొల్యూషన్, క్రౌడ్ గ్యాథరింగ్, అబాండన్ ఆబ్జెక్ట్, లైటరింగ్, జోన్ మానిటరింగ్, ప్లెయిన్ సర్వీలెన్స్ తదితర ఘటనలన్నీ రికార్డు చేయాలి. పాట్ హోల్స్‌ను కూడా రికార్డు చేయగలగాలి. రోడ్లమీద మొక్కలకు నీళ్లు పెట్టారా? లేదా? లేక మొక్కలు ఎండిపోతున్నాయా? అన్న దాన్నీ రికార్డు చేయాలి. ఇవన్నీ సాధ్యమేనని ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు. స్ట్రాటజిక్ లొకేషన్‌లలో ఈ కెమెరాలు పెట్టాలని, అనలిటిక్స్‌ను తయారుచేసి, అధికారులు ఈ విధానాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలన్నారు.
రెవెన్యూ, పోలిసింగ్‌తో జాయింట్ మీటింగ్
ఐదేళ్లలో జరిగిన ల్యాండ్ రికార్డ్సుపై చర్చించాం. భూ సమస్యల విషయంలో ప్రజల్లో అశాంతి ఉంది. మదనపల్లి ఫైల్స్ ఒక కేస్ స్టడీగా అభివర్ణిస్తూ.. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అయి ఫైర్ యాక్సిడెంట్ అయిందని సింపుల్‌గా తేల్చేస్తున్నారు. ఇంక ఇన్వెస్టిగేషన్‌తో పనేముంది? కానీ డీజీ, సీబీసీఐడీని హెలికాప్టర్ ఇచ్చి పంపించి ఎంక్వైరీ చేయమన్నాను. నాకు లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం. లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా ఉంటేనే గుడ్ గవర్నెన్స్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 22ఏ.. చుక్కల భూముల విషయంలో అక్రమాలు చేశారని, సెటిల్‌మెంట్‌కు వస్తే 22ఏ తొలగించడం, లేదంటే 22ఏ పెట్టడం జరిగిందని వివరించారు.
లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటే సమర్థవంతమైన ప్రభుత్వం ఉన్నట్టని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూకబ్జాలు జరిగాయి. ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. తిరుపతి, విశాఖ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలు ఒక కేస్ స్టడీ. చివరికి అడవులు, కొండలు కూడా కొట్టేశారు. అసైన్డ్ ల్యాండ్‌లను ఫ్రీహోల్డ్ చేసి కొట్టేశారు. ఎన్ని అక్రమాలు చేయాలో అన్నీ చేశారు. ఇదే తరహాలో వివేకానంద మర్డర్ జరిగింది. సాక్షి టీవీలో గుండె పోటుతో చనిపోయాడని వచ్చింది. పోస్టుమార్టం చేయాలని ఆయన కూతురు సాయంత్రం అడిగింది. పోస్టుమార్టం చేస్తే గుండెపోటు కాదు గొడ్డలి పోటు అని తేలుస్తారు. గుండెపోటు అని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఏమనాలి?
మా చిన్నాన్న లేడు. చంపేశారు. అనాధనయ్యానని సింపతీ కోసం పాకులాడి.. అధికారం రాగానే ముందు అడిగిన సీబీఐ ఆర్డర్ వద్దని అనడం వాళ్లకే చెలుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసే సీబీఐ ఆఫీసర్‌పై అరెస్ట్ వారెంట్ ఇవ్వడం, నారాసుర రక్తచరిత్ర అని తరువాతి రోజు పేపర్‌లో రాయిస్తారు. ఇలాంటివి ఊహించగలమా? క్రిమినల్స్‌ను తప్పుదోవ పట్టించాలంటే ఈ ఘటనే నిదర్శనం అని చంద్రబాబు విశ్లేషించారు. 36 మందిని రాజకీయ హత్యలు చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబడుతూ.. రాజకీయ ముసుగులో నేరాలు చేశారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లలో జరిగిన తప్పులను వెలికితీసి శిక్షిస్తాం. గంజాయి ఒకపక్క, ఆడవాళ్లపై సైబర్ క్రైమ్, దౌర్జన్యాలు మరో పక్క.. అలా ఒక్కో రోజు మేజర్ ఘటనగా మారుతున్నాయి. ఇలాంటివి జరగడానికి వీల్లేదని ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌ను నియంత్రించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
కొత్త లిక్కర్ పాలసీ తెస్తాం..
ఎక్సైజ్ శాఖను సమీక్షిస్తూ.. లిక్కర్ పాలసీపై అధ్యయనం చేస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించి కొత్త పాలసీ తీసుకురానున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ లిక్కర్ బ్రాండ్లను ఏపీలోకి అనుమతిస్తామని చెబుతూనే.. దీనివల్ల మద్యం అక్రమ రవాణా తగ్గుతుందన్నారు. విజిబుల్ పోలీసింగ్…ఇన్విజుబుల్ పోలీస్ అనే విధానం ఉండాలని, ప్రజాసమస్యల పరిష్కారం మీద ఒక యాప్ తెస్తామన్నారు. గ్రీవెన్స్ వచ్చిందంటే అందులో నిజాయితీవుంటే మానవతాధృక్పథంతో ఆలోచించాలి. పరిష్కరించాలి. అసాధ్యమైనవి ఆలోచిద్దామని చంద్రబాబు సూచించారు. అలాగే, మంత్రుల దగ్గర స్టాఫ్‌ను పెడుతున్నామని, ఒక పీఆర్వో, ఇద్దరు సోషల్ మీడియా పర్సన్‌లను ఇచ్చామని సీఎం వివరించారు. తప్పుడు వార్తలు మనపై వచ్చినప్పుడు వాస్తవాలు చెప్పడం మన బాధ్యత.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అప్పుల్లో రాష్ట్రం..
రాష్ట్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉందని, రూ.10 లక్షల కోట్లు అప్పులున్నాయన్నారు. 1,15,000 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఇవి ఇలా ఉండగానే అభివృద్ధి సాధించాలి. సంక్షేమం అందించాలని సీఎం అన్నారు. అమరావతి, పోలవరం, కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, విభజన చట్టం అంశాల విషయంలో కేంద్రం ప్రోత్సాహం ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. మనం సంపద సృష్టించాల్సిన అవసరం ఉందని వివరిస్తూ.. అందుకు లా అండ్ ఆర్డర్ సరిగా ఉండాలన్నారు. ఇండస్ట్రియల్ పాలసీ, ఎంటర్ ప్రెన్యూర్ పాలసీ, ఎఫ్‌డీఐ, ఎంఎస్‌ఎంఈ, హార్డ్‌వేర్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, స్టార్టప్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, లిక్కర్ పాలసీ, పీపీపీ మోడల్‌లో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, వయబులిటీ గ్యాప్ ఫండిరగ్, వాటర్, పీ4 పాలసీ, జీరో పావర్టీ, లాజిస్టిక్, యూత్, స్పోర్ట్స్ పాలసీలు తెస్తామన్నారు. ఎవరైనా తప్పులు చేసినప్పుడు భయపడే పరిస్థితి రావాలని అంటూ, జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీల మధ్య సయోధ్య ఉండాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనని అంటూ, అందుకు తగినవిధంగా అధికారులు పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
స్ట్రాటజీస్‌కు పదునుపెట్టాలి
డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ గంజాయి అండ్ డ్రగ్స్, క్రైమ్, లా అండ్ ఆర్డర్, ఇన్విజిబుల్ పోలీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, ఓవరార్చింగ్ స్ట్రాటెజిస్ తదితర అంశాలను వివరించారు. గంజాయి, డ్రగ్స్ వాడకాలను అరికట్టాలన్నారు. క్రైమ్ రేటు తగ్గించాలని, శాంతి భద్రతల విషయంలో ముందు ఆలోచనతో వ్యవహరించాలన్నారు. చిన్నారులు, మహిళలపై దాడులను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అల్లర్లు సృష్టించే గ్రూపులు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు మండల, జిల్లాస్థాయి అధికారులు రివ్యూలు, సమీక్షలు చేపట్టి ప్రభుత్వ లక్ష్యాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.