- స్వర్ణాంధ్ర ` 2047 విజన్ డాక్యుమెంట్‌పై ఒంగోలులో సమావేశం
- హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
- అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి
ఒంగోలు (చైతన్యరథం): స్వర్ణాంధ్ర ` 2047 విజన్ అజెండాతో సీఎం చంద్రబాబు తలపెట్టిన రాష్ట్ర పునర్నిర్మాణ మహా యజ్ఞంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపు ఇచ్చారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పనలో భాగంగా ప్రకాశం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హల్లో వర్క్‌షాప్ నిర్వహించారు. మంత్రి డోలా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి డోలా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర ` 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సమగ్ర కసరత్తు చేపట్టిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించగా, అందులో భాగంగా స్వర్ణాంధ్ర ` 2047 విజన్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అన్ని రంగాలను అభివృద్ది చేసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పూర్తిగా రూపు మాపి, ప్రజల జీవన ప్రాణాలు, తలసరి ఆదాయం పెంచాలన్న లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ తయారవుతోందన్నారు. ప్రైమరీ సెక్టార్‌ను మరింతగా బలోపేతం చేయటంలో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాలను మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మండలం యూనిట్‌గా జిల్లాలో అన్ని ప్రాంతాలను అభివృద్ది పధంలో నడిపించేలా ముందుకు పోతున్నామన్నారు. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. యువతకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తూ వారి సేవలను సమర్ధవంగా వినియోగించుకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. స్కిల్ సెన్సెస్ చేపడుతూ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫార్మా, గ్రానైట్ రంగాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలను మరింతగా అభివృద్ది చేయటంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో వీలైనంత వరకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను చేపట్టి నీటి సంరక్షణ చర్యలు సమర్ధవంతంగా చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. మార్కాపురం మెడికల్ కళాశాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
దొనకొండ పారిశ్రామిక వాడను అభివృద్ది చేస్తామన్నారు. జిల్లాలో భూ సమస్యలపై దృష్టి సారించామని, అందులో భాగంగా త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లాను 2047 నాటికి స్వర్ణ ప్రకాశంగా ముందుకు తీసుకెళ్ళేందుకు జిల్లాలో వ్యవసాయ, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా జిల్లాను అభివృద్ది పథóంలోకి తీసుకెళ్లడానికి, స్వర్ణాంధ్ర`2047 లక్ష్య సాధనకు, భవిష్యత్ తరాల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని మంత్రి డోలా పిలుపు ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర`2047 విజన్ డాక్యుమెంట్ తయారీపై శాఖల వారీగా అన్ని విషయాలపై అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లా అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రంగాల ప్రజలను భాగస్వాములు చేసి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ప్రజాప్రతినిధులతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో తనను హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారన్నారు. ఈ కమిటీలో అమృత్, స్వచ్చభారత్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను, సూచనలు తెలియచేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పరిశ్రమలు, జల వనరులు, ఆర్‌డబ్ల్యూఎస్, పర్యాటక శాఖలు రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ వర్క్ షాప్ లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వేంకటేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.