- దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలి
- అపచారాలకు చోటుండకూడదు
- బలవంతపు మత మార్పిడులు ఆగాలి
- దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదు
- భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం
- అర్చకుల వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు
- ధూపదీప నైవేద్యాలకు రూ.10 వేలు
- వేద విద్యార్థులకు రూ.3 వేల భృతి
- నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు
- పాలక మండళ్లలో మరో ఇద్దరికి అవకాశం
- దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీ
- ఆలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం ఉండాలి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో దేవాలయాలకు మళ్లీ పునర్వైభవం రానుంది. గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన ఆలయాలు ఇప్పుడు మళ్లీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నాయి. సీఎం చంద్రబాబు పాలనలో ఆలయాలకు మహర్దశ పట్టనుంది. దేవాదాయ శాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలని, అపచారాలకు చోటు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భక్తులు ప్రశాంతత కోసం, తమ బాధలు దేవుడితో చెప్పుకోవడం కోసం గుళ్లకు వస్తారని…అలాంటి వారికి మంచి దర్శనం, చక్కటి వాతారణం కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ కుటుంబమైనా పుణ్యక్షేత్రానికి వస్తే ఒకటి రెండు రోజులు అక్కడ ఉండే వాతావరణం కల్పించాలని అన్నారు.
భక్తుల మనోభావాలు ముఖ్యం
ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని….ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పటిష్టమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవచ్చని అన్నారు. అదే విధంగా దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదని చెప్పారు. ఏ మతంలో అయినా భక్తుల మనోభావాల ముఖ్యమని సీఎం అన్నారు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సులభతర దర్శనం, దేవాలయాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలు, బస చేయడానికి అనువైన కాటేజ్లు, గదులు ఉండాలని అన్నారు. భక్తుల జేబులు ఖాళీ చేసే విధంగా కాకుండా, భక్తులు ఇష్టంగా అక్కడ గడిపే పరిస్థితి కల్పించాలని అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి మన దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయని…వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో రావాలని సీఎం ఆదేశించారు. ఇందు కోసం దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
ట్రస్ట్బోర్డుల్లో మరో ఇద్దరు
దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 20 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. దీన్ని 17కు పెంచనున్నారు. ఇలా అన్ని ట్రస్ట్ బోర్డులలో ఇద్దరు చొప్పున అదనంగా సభ్యులను సంఖ్యను పెంచనున్నారు. ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణుడు తప్పకుండా ఉండేలా చూస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు సభ్యుల సంఖ్యను పెంచి వారికి అవకాశం కల్పించనున్నారు.
అర్చకుల వేతనాలు పెంపు
అదేవిధంగా రూ. 10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ. 15 వేలు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం ద్వారా 1683 మంది లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వం పై ఏటా రూ. 10 కోట్ల భారం పడుతుంది. అదేవిధంగా ధూప, దీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏడాదికి రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుంది. వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ. 3 వేలు భృతి ఇవ్వాలని సీఎం సూచించారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును దేవాదాయ శాఖపరంగా గుర్తించి నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్యవైశ్య సంఘాల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పరంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
మొదలుకాని పనులు నిలిపివేత
సిజిఎఫ్ కింద, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రతిపాదించింది అయితే అందులో కొన్ని పట్టాలెక్కగా…కొన్ని పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే మొదలైన పనులను పూర్తి చెయ్యాలని సీఎం సూచించారు. ఇదే సందర్భంలో ప్రారంభం కాని పనులను నిలిపివేసి మరోసారి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సిజిఎఫ్ కింద 243 పనులు ప్రారంభం కాలేదు. అలాగే టిటిడి శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదు. వీటిని నిలిపివేయాలని సిఎం ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ కింద చేపట్టే దేవాలయాలు, ఇతర నిర్మాణాలపై చర్చించి…అవసరం అయితే వాటికి కేటాయించే నిధులు పెంచి పనులు ప్రారంభిద్దాం అని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు ఇచ్చేవారు. వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యం కావడం లేదని అధికారులు వివరించారు. దీంతో ఈ మొత్తాన్ని పెంచడానికి, రెట్టింపు చేసి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో దేవాలయం ఉండేలా చూడాలన్నారు. అదే సమయంలో శ్రీవారి నిధులు ఖర్చుకు జవాబుదారీగా కూడా ఉండాలని సిఎం అన్నారు.