- పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు కృషిచేస్తున్నాం
- సాస్కీ పథకం కింద నిధులు రాబట్టే ప్రయత్నం
- పుట్టపర్తి ట్రిపుల్ ఐటీ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తా
- సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఐటీ మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): “రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటిల్లో శాశ్వత సదుపాయాలకు అవసరమైన నిధుల కోసం ఆర్థిక మంత్రితో మాట్లాడాం. ఇందుకోసం కేంద్రం కొత్తగా సాస్కీ స్కీమ్ తీసుకొచ్చింది. డీపీఆర్‌లు తయారు చేసి సాస్కీ కింద నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నాం” అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు అవకాశాలపై ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. “ఏపీలో ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి 4 ఆర్‌జీయూకేటీ క్యాంపస్‌లు పనిచేస్తున్నాయి. నూజివీడు క్యాంపస్‌లో పర్మినెంట్ ఫెసిలిటీస్ పూర్తిచేయడానికి రూ.60కోట్లు, అరకు వ్యాలీలో రూ.40 కోట్లు, ఒంగోలు క్యాంపస్‌కు రెండు విడతలకు కలిపి రూ.600 కోట్లు, శ్రీకాకుళం క్యాంపస్ పూర్తికి రూ.300 కోట్లు నిధులు అవసరం. ఏ జిల్లాలో ట్రిపుల్ ఐటీ చదివే పిల్లలు అక్కడే పూర్తి చేయాలన్నది మా ఆలోచన. టెంపరరీ అకాడమీ కోసం వేర్వేరు జిల్లాలకు పంపాల్సి వస్తోంది. కేంద్రంనుంచి నిధులు తెచ్చి శాశ్వత సౌకర్యాలను కల్పించి… ఏ క్యాంపస్‌లో పిల్లలు చేరారో అదే క్యాంపస్‌లో కోర్సు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.













