పల్నాడు జిల్లా: క్రోసూరులో తమ షాపు ఎదురుగా రోడ్డుపై సామాన్లు పెట్టి వ్యాపారం చేస్తున్నాడని ఓ వ్యాపారి షాపునకు గ్రామకార్యదర్శి తాళం వేయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ హుటాహుటిన క్రోసూరు చేరుకొని శ్రేణులతో కలిపి రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుమార్జిన్ కు ఆరుఅడుగుల లోపు ఉన్న కొట్టు ఉందని పూర్ణ అనే వ్యాపారి షాపునకు గ్రామ కార్యదర్శి తాళం వేశారు. కేవలం కక్షసాధింపు కోసమే ఇటు వంటి ఉన్మాద చర్యలకు దిగుతున్నారని టిడిపి వాణిజ్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితుడు పూర్ణను పరామర్శించిన రాకేష్ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.