.అక్రమ తవ్వకాలు తేలితే ఆరునెలలు కటకటాల్లోనే
.న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెడితే వదిలే ప్రసక్తిలేదు
.9 ఎకరాలకు అనుమతిస్తే 30 ఎకరాలు తవ్వారన్న పిటిషనర్
.ఆదేశాలు ధిక్కరిస్తే… చర్యలు తప్పవన్న హైకోర్టు
అమరావతి: విశాఖ రిషికొండలో అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రిషికొండలో అనుమతించిన దాని కంటే.. అక్రమ తవ్వకాలు ఉంటే బాధ్యులు జైలుకు వెళ్లకు తప్పదని న్యాయస్థానం హెచ్చరించింది. అక్రమ తవ్వకాలు తేలితే ఆరునెలల పాటు అందరూ లోపలికి వెళ్లాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. రిషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. టూరిజం కార్పొరేషన్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఫ్వీు వాదనలు విన్పిస్తూ అఫిడవిట్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కోరారు. రిషికొండ దగ్గర తొమ్మిది ఎకరాల పరిధిలో మాత్రమే తవ్వకాలకు హైకోర్టు అనుమతి ఉండగా, 30 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరిపారని.. పిటిషనర్ తరపు న్యాయవాది అశ్విని కుమార్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. తవ్విన మట్టిని సముద్రంలో వేయాలని కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఎవరైనా వెళ్లి ఆ ప్రాంతాన్ని సందర్శించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. తాను పర్యటించి పరిశీలించానని చెప్పిన న్యాయవాది అశ్విని కుమార్ తెలిపారు. పిటిషనర్ల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందని.. పిటిషనర్ తరపున లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎవరు తేలికగా తీసుకున్నా.. తాము మాత్రం అక్రమాలు జరిగితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రిషికొండ తవ్వకాల కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.