- భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు, న్యాయం చేయండి
- 30వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’లో విన్నపాల వెల్లువ
- సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి భరోసా
అమరావతి(చైతన్యరథం): ఆపదలో ఉన్న వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘‘ప్రజాదర్బార్’’ అండగా నిలుస్తోంది. ఉండవల్లి నివాసంలో 30వ రోజు శుక్రవారం ప్రజాదర్బార్‌కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి… తాను అండగా ఉంటానని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో కొన్నింటిని చూస్తే…
అన్న క్యాంటీన్ లో ఉపాధి కల్పించండి
అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు పెన్షన్ మంజూరుచేయడంతో పాటు కుటుంబ పోషణ కోసం అన్న క్యాంటీన్ లో ఉపాధి కల్పించాలని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంకు చెందిన షేక్ ఖాసీంబీ.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తమకు శాశ్వత ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలని చినకాకానికి చెందిన డి.అరుణ కుమారి కోరారు.
దివ్యాంగుడనైన తాను డిగ్రీ పట్టభద్రుడనని, ఎలాంటి ఆధారం లేని తమ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఉండవల్లికి చెందిన ఏ.రామారావు విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు, న్యాయం చేయండి
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విన్నపాలు చూస్తే.. దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని, విచారించి ఎన్‌వోసీ జారీ చేయాలని శ్రీకాకుళం జిల్లా ఫాజుల్ బాగ్ పేటకు చెందిన తిర్లంగి లక్ష్మి కోరారు.
తెలుగు, సంస్కృత అకాడమీలో టైమ్ స్కేల్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏను కొనసాగించాలని సిబ్బంది కోరారు.
ఏపీ సాంకేతిక విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, పోస్టింగ్ ఆర్డర్స్ మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించాలని నంద్యాల జిల్లా తమ్మరాజుపల్లెకు చెందిన పాణ్యం శివ విజ్ఞప్తి చేశారు.
డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన గెడ్డం శ్యామ్ బాబు కోరారు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా వైద్య సాయం అందించాలని నెల్లూరుకు చెందిన ఏ.సుజాత విజ్ఞప్తి చేశారు.
వంశపారంపర్యంగా సంక్రమించిన తమ 2.08 ఎకరాల వ్యవసాయ భూమికి పట్టా, పాస్ బుక్ మంజూరు చేయాలని తిరుపతి జిల్లా గాజులపెళ్లూరుకు చెందిన ఎమ్.రజిత కోరారు.
గత వైసీపీ ప్రభుత్వ అండతో నకిలీ పత్రాలు సృష్టించి తన 32 సెంట్ల స్థలాన్ని బంధువులు కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం కనుమలచెరువుకు చెందిన గుమ్మా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.