- ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ
- ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
- ఐదేళ్లలో 119 ఘటనలు.. 120 మరణాలు
- సేఫ్టీ నిబంధనలు పాటించడంలో విఫలం
- ఇంటర్నల్ సేఫ్టీ ఆడిట్‌పై దృష్టి పెట్టండి
- సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీనీ రూపొందిస్తా
- పరిశ్రమలు రాకుంటే ఉపాధి, సంపద కష్టం
- మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు సీఎం పరామర్శ
- ఎసెన్షియా ఘటనాస్థలిని పరిశీలించిన చంద్రబాబు
- జిల్లా అధికారులు, మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష
అనకాపల్లి (చైతన్య రథం): అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నా. పరిశ్రమలో ఏం జరిగిందో లోపాలపై కమిటీ విచారిస్తుంది. నివేదిక మేరకు ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టను, కఠినంగా శిక్షిస్తాం. మృతుల కుటుంబాలకు రూ.కోటి, తీవ్ర క్షతగాత్రులకు రూ.50లక్షలు, గాయపడినవారికి రూ.25 లక్షలు పరిహారం కంపెనీనుంచే ఇప్పిస్తాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటా. ఇక్కడ నిబంధనల మేరకు ఎస్‌వోపీ అనుసరించలేదు. పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదు. గత ఐదేళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120మంది మృతిచెందారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపడతాం. రెడ్ కేటగిరీ పరిశ్రమలన్నీ కచ్చితంగా ఎస్‌వోపీ పాటించాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కూడా కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కానివ్వను’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం చోటుచేసుకున్న ఫార్మా పరిశ్రమను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పరిశ్రమలో కలియతిరిగి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఘటన వివరాలను సీఎంకు కలెక్టర్ విజయకృష్ణన్ వివరించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇదొక బాధాకరమైన సంఘటన. ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇదొక ఉదాహరణ. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ రెడ్ కేటగిరీలో ఉంది. పేలుడు ఘటనలో 17మంది చనిపోవడం, గాయాలతో బాధపడుతున్న క్షతగాత్రులను చూస్తే.. మనసు ఆవేదనతో నిండిపోయింది. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న, మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడాను. సంఘటనలు బాధాకారం. ఒక యువతి 4 నెలల గర్బిణి. వారికి బాబు కూడా ఉన్నాడు. పెళ్లి జరిగి రెండేళ్లు కాలేదు, ప్రమాదంలో చనిపోయాడు. ఆ అమ్మాయిని చూస్తే బాధేసింది. వాళ్లందరితో మాట్లాడి భరోసా ఇచ్చామని ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
మృతుల కుటుంబాలకు రూ.కోటి, తీవ్ర గాయాలకు రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. ఎంత ఆర్థికసాయం చేసినా.. కుటుంబాలను తేలేము. అదివారికి జీవితాంతం తీరని లోటు. ఒకపక్క ఇండస్ట్రీస్ రావాలి. మరోపక్క సేఫ్టీకి ప్రాధాన్యతనివ్వాలి. ప్రాపర్ ఎస్వోపీ అనుసరించివుంటే.. ఈ సమస్య వచ్చేది కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఐదేళ్లలో 119 ఘటనలు.. 120 మరణాలు
అచ్యుతాపురం సెజ్‌లో పూర్తి సెక్యూరిటీ స్టాండర్డ్స్ జరగలేదు. గత ఐదేళ్లలో దగ్గరదగ్గర 119 దుర్ఘటనలు జరిగాయి. 120మంది మృతిచెందారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో పాయిజనెస్ కెమికల్ కారణమైంది. ఇక్కడ ఎక్స్ ప్లోజివ్ కెమికల్ బిల్డింగ్‌ను లేపేసింది. ఇంతమంది మరణాలకు కారణమైందంటే ఎంత భయానకమైన విస్ఫోటనమో అంతా అంచనావేయొచ్చని వివరించారు.
సేఫ్టీ నిబంధనలు పాటించడంలో విఫలం
ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ఒక హైపవర్ కమిటీ వేస్తూ నామమాత్రపు ఆదేశాలిచ్చారు. ఎగ్జిక్యూషన్ జీరో. అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. జీవో 156 ఒకటి రిలీజ్ చేశారు. కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో 79 రిలీజ్ చేశారు. కానీ రెగ్యులారిటీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప యాక్షన్ లేదు. దానివల్ల రిపీటెడ్‌గా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏదేమైనా దీనిపై దర్యాప్తు డిటైల్స్ ఎప్పటికప్పుడు చెప్తాం. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప.. పరిస్థితిని చక్కదిద్దలేం. రెడ్ కేటగిరీలో ఉండే పరిశ్రమలన్నీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నా. సంపద సృష్టికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో.. ప్రజల భద్రతా అంతే ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇంటర్నల్ సేఫ్టీ ఆడిట్
పారిశ్రామికవేత్తలకు ఈ సమావేశం ద్వారా పిలుపునిస్తున్నా. పరిశ్రమల్లో భద్రతా చర్యలపై అంతర్గత ఆడిట్ చేయండి. ఈ విషయంలో ప్రభుత్వ వ్యవస్థలకూ గట్టి ఆదేశాలిస్తాను. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను కామన్ ఫ్లాట్‌ఫాంపైకి తెచ్చినట్టు.. మరికొన్ని మార్పులు తెస్తాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేబర్, బాయిలర్స్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజీ.. ఈ ఐదు వ్యవస్థలూ కంబైన్డ్‌గా వెళ్లి పరిస్థితిని సమీక్షించేలా ఆదేశాలిస్తాం. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా.. అదే సమయంలో భద్రతా పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు.
సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ పెడతాం..
పారిశ్రామికంగా ఎదుగుతున్న విశాఖను ప్రోత్సహిస్తూనే.. భద్రతా సమస్యలు తలెత్తకుండా సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కమిటీని త్వరలోనే కానిస్టిట్యూట్ చేసి విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఇండస్ట్రియలైజేషన్ ప్రక్రియను మందుకు తీసుకెళ్తామని చెప్పారు.
పరిశ్రమలు రాకుంటే ఉపాధి కష్టం
పరిశ్రమలు రాకుంటే ఉపాధి కల్పించలేం. సంపద సృష్టించలేం. పరిశ్రమలను అడ్డుకుంటే నష్టపోయేది మన పిల్లలే. జీరో పావర్టీ సాధించాలంటే సంపద సృష్టించాలి. ప్రభుత్వం ఆర్థిక ప్రగతి సాధిస్తేనే.. సంక్షేమం సాధ్యమవుతుంది. ప్రజలు మా మీద నమ్మకంతోనే ఘన విజయం అందించారు. దాన్ని మేం నిరూపించుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ చేయడమే ప్రభుత్వం పని. ఇక్కడ వెదర్ రిపోర్ట్ బట్టి సెన్సార్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీస్ నుంచి ఎంత (గ్యాస్) వదిలిపెడుతున్నారు? ఏ సమయానికి వదులుతున్నారు? అన్నింటిపైనా తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
కుట్రలు చేసినా..ఎక్కువ రోజులు సాగవు!
విస్ఫోటన ఘటన వెనుక కుట్ర ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం ఎలాంటి సమాధానం చెప్పలేం. రాష్ట్రంలో కొన్ని కుట్రపూరిత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే, ఈ ఘటన వెనుక కుట్ర ఉందా? లేదా? అన్నదీ చూడాలి. ఎందుకంటే గుడ్డకాల్చి ముఖాన పారేసి తుడుచుకోమంటున్న రాజకీయాలు చూస్తున్నాం. తరువాత వాళ్లే విమర్శిస్తారు. శాంతి భద్రతల అమలులో తెలుగుదేశం కానీ, ఎన్డీఏ కానీ వెనక్కిపోయే సమస్య ఉండదు. ఎవరైనా కుట్రలు చేసినా అవి ఎక్కువ రోజులు సాగవు. ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు, ఒక్కోసారి నాకూ అనుమానం వస్తోంది. అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ సమస్యలా? లేకపోతే ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ లెక్కలేనితనంలోకి వెళ్లిపోయారా? లేకపోతే యాక్సిడెంట్స్ అన్నీ మామూలే అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావడంలేదు. దీనికి పరాకాష్ట నిన్న జరిగింది. మేనేజ్‌మెంట్ రాలేకపోయారు ఇక్కడికి. వారికి వివాదాలు ఉండొచ్చు. కానీ ఆయనకు సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ఉంది. ముఖ్యమంత్రిగా వెంటనే నిర్ణయం తీసుకోవచ్చు, కానీ రెండూ బ్యాలెన్స్ చేయాలని ఆలోచిస్తున్నా అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్
గురించి మాట్లాడుతున్నాం..
అచ్యుతాపురానికి కావాల్సిన ట్రామా సెంటర్, బర్న్ యూనిట్ హాస్పిటల్‌తో పాటు ఫైర్‌స్టేషన్ కూడా రావాల్సి ఉంది. కార్మికులకు ఏదైనా జరిగితే ఫస్ట్‌ఎయిడ్‌వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ సంబంధిత శాఖలతో ఆలోచించి సంయుక్త నిర్ణయం తీసుకుంటాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో అమలు చేసిన విధానాలు, మరింత ప్రభావవంతమైన ఆలోచనలను 3 నెలల్లో తీసుకొస్తాం. 95 శాతం ఇండస్ట్రీస్ పెట్టినవారు బాధ్యత తీసుకుంటున్నారు. ఎక్కడో 1 లేదా 2 శాతం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని సీఎం చంద్రబాబు వివరించారు. స్మెల్‌ను గుర్తించే, లీకేజీలను గుర్తించే సెన్సార్స్ వస్తున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. శ్రీసిటీ బెస్ట్ ఇండస్ట్రియల్ జోన్. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటూనే.. పెట్టుబడిదారుల నమ్మకం చూరగొంటామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.