- ఉచిత ఇసుక విధానానికి కూడా..
- రూ.2 వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు పౌర సరఫరాల సంస్థకు అనుమతి
- ఎన్‌సీడీసీ నుంచి మార్క్‌ఫెడ్ రూ.3,200 కోట్ల రుణానికి ఆమోదం
- 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- కౌలు రైతులకు సులువుగా రుణాలపై త్వరలో నిర్ణయం
- ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం
- మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిరచిన మంత్రి పార్థసారథి
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధివిధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. పౌరసరఫరాల సంస్థ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం లభించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు రుణం తీసుకునేందుకు వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ సమ్మతి తెలిపింది. కాగా, పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపు, విధివిధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఈ కమిటీలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. నెల రోజుల్లో చర్చించి, అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా? లేక, ప్రభుత్వం చెల్లించాలా? అనే అంశాన్ని ఖరారు చేయాలని కమిటీకి నిర్దేశించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక, సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇక, ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారని మంత్రి పార్థసారథి తెలిపారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చర్చ
ప్రజాస్వామ్యంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని నీతి అయోగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కు ప్రతిపాదనలు చేస్తూ అన్ని రాష్ట్రాలకు పంపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేయలేదు. దీనిపై పత్రికలు, మీడియా, మేధావులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి పోలికే లేదు. ప్రభుత్వ అధికారి టైటిల్ రిజిష్ట్రేషన్ ఆఫీసర్‌గా వ్యవహరించాలని నీతి అయోగ్ ప్రతిపాదించింది. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో స్పష్టత లేకుండా ఎనీ పర్సన్ అని పేర్కొన్నారు. అంటే ప్రైవేటు వ్యక్తులను సైతం టైటిల్ రిజిష్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు. ఈ అధికారికి అపరమితమైన అధికారాలు ఇచ్చారు. ఈ చట్టం ప్రకారం భూ వ్యాజ్యాల్లో సివిల్ కోర్టుల ప్రమేయం పూర్తిగా తొలగించారు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారుల (టీఆర్‌వో) దగ్గర సమస్య ఉత్పన్నమైతే వ్యయప్రయాసలకోర్చి నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి.
ఈ చట్టం చాలా హడావిడిగా స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తెచ్చారు. ఈ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూయజమానికి జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు సదరు టీఆర్‌వో వద్దే ఉంటాయి. దీని వల్ల ప్రభుత్వం సదరు ఆస్తులను తనఖా పెట్టుకునే అవకాశం ఉందని భూయజమానులు భయాందోళనకు గురయ్యారు. ఇది ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తుంది. భూ యజమానులు సంఘ విద్రోహ శక్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (టీఆర్ వో)లు జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ) లు భూయజమానులను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఎలాంటి శిక్షణ, అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారుల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరిన్ని అవరోధాలు, గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి.
టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, టైటిల్ అప్పిలేట్ అధికారులు స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌లు, మ్యూటేషన్ లు చేసే పరిస్థితి దాపురించే అవకాశం ఉంది. ఈ చట్టం వల్ల భూ యజమానులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేబినెట్, ప్రజా ప్రతినిధులు, మనందరిపైన ఉందని ముఖ్యమంత్రి సూచించారు. గత ప్రభుత్వం చేసిన ఏపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాలను పెంచుతుంది తప్ప తగ్గించదు. రివెన్యూ వ్యవస్ధలను, రిజిష్ట్రేషన్ వ్యవస్ధలను, ల్యాండ్ రికార్డులను పూర్తిగా ధ్వంసం చేసేలా ఈ చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని దాన్ని రద్దు చేశారని మంత్రి పార్థసారథి చెప్పారు.
ఇసుక పాలసీపై..
కొత్త ఇసుక విధానం తెచ్చేంత వరకు.. ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలను ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రజలకు ఉచితంగా అందించే మధ్యంతర వ్యవస్థ ఏర్పాటు చేసేలా ఈ నెల 8వ తేదీన జారీ చేసిన 43వ నెంబర్ జీవోకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆయా సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను నిలిపివేసి, ఉన్న ఇసుక నిల్వలను సంబంధిత అధికారులకు అప్పగించాలని మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం (కాంప్రహెన్సివ్ శాండ్ పాలసీ) – 2024 ను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి వర్గం అభిప్రాయపడిరది. వినియోగదారులకు సరసమైన ధరలకు ఇసుక లభించేలా చూడటం, పారదర్శకతను పెంపొందించడం, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడం, పర్యావరణ హితం కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్ జీటీ) ఇచ్చిన మార్గదర్శకాల మేరకు సమగ్ర ఇసుక విధానం రూపొందించాలని నిర్ణయించినట్లు పార్థసారథి తెలిపారు.
ధాన్యం కోనుగోలుపై..
ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం రూ.2000 కోట్ల రుణాన్ని వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుండి పొందేందుకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు మంత్రివర్గం అనుమతి మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు ఒక మండలంలోనిది ఇంకో మండలానికి ట్యాగ్ చేసి… రైతులకు ఇవ్వాల్సిన సొమ్మును నెలల తరబడి ఆపి వారిని ఇబ్బందులు గురిచేశారు. ఇలా గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గత ప్రభుత్వం రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ చేసి రూ.1600 కోట్లు ఇవ్వకుండా పెండిరగ్ పెట్టింది. గత రబీ సీజన్‌లో సేకరించిన వరి ధాన్యానికి 84 రోజులు గడిచినా ఎటువంటి సొమ్ము చెల్లించకుండా తాత్సారం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బకాయి పడ్డ సొమ్ము రూ. 1000 కోట్లు సదరు రైతులకు చెల్లించింది. రైతులకు కనీస మద్దతు ధర కల్పించే పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ఆహార, పప్పు ధాన్యాలను సేకరించి జాతీయ ఆహార భద్రతా చట్టానికనుగుణంగా తెల్ల రేషన్ కార్డు కలిగి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాయితీ ధరలకు అందిస్తున్న విషయం విదితమే. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యసేకరణకు రుణాలను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరదని మంత్రి పార్థసారథి తెలిపారు.
2024-25 సంవత్సరానికిగానూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు ఎన్‌సీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) నుండి వర్కింగ్ కేపిటల్ అసిస్టెన్స్ రూపేణా రూ.3,200 కోట్ల రుణాన్ని పొందేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ధాన్యం కొనుగోలు విధానంలోని లోపాలను సవరించి రైతులకు సులువైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడిరది. కౌలు రైతులకు సులువుగా రుణాలు అందించే కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై అధ్యయనం చేయాల్సిందిగా కేబినెట్ కు ముఖ్యమంత్రి సూచించారు. కౌలు రైతు కార్డులు ఎలా ఇవ్వాలి..? అనేదానిపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నామని పార్థసారథి తెలిపారు.
ఇతర అంశాలు
ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ అవార్డు వచ్చింది. ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్ తో సమానం. ఈ అవార్డు క్రింద రూ.9 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ ప్రకృతి సేద్యాన్ని 2018లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 5 లక్షల హెక్టార్లతో ప్రారంభమై 10 లక్షల మంది రైతులను భాగస్వామ్యులను చేశారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా చేస్తున్న ప్రకృతి సేద్యం ప్రస్తుతం 4 రెట్లు పెరిగి 2029 నాటికి 20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచి ఆదర్శ ప్రాయం అవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారని మంత్రి పార్థపారథి తెలిపారు. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైనా చర్చించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా ప్రభుత్వ పనితీరుపైనా సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాల పైనా సమావేశంలో చర్చించామని పార్థసారథి తెలిపారు.