ఉండవల్లి (చైతన్యరథం): రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన ‘‘శకారంభం’’ పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత 2023, జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర… 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2300 గ్రామాల మీదుగా 226రోజులపాటు కొనసాగి గాజువాక పరిధిలోని అగనంపూడి వద్ద జనవరి అదే ఏడాది డిసెంబర్ 18న ముగిసింది. 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తొలి రోజు నుంచి ముగింపు వరకూ యువగళం జరిగిన తీరు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని శకారంభం పుస్తకంలో కళ్లకు కట్టారు. జగన్ పాలనలో బాధితులుగా మారిన వివిధవర్గాల ప్రజలకు నేనునాన్నని భరోసా ఇస్తూ లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఘట్టాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… ప్రజాచైతన్యమే లక్ష్యంగా జైత్రయాత్రలా సాగిన యువగళం రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిందన్నారు. చారిత్రాత్మక పాదయాత్రకు అక్షరరూపమిచ్చిన మిత్రుడు కృష్ణకిషోర్ అభినందనీయులని, యువగళం ప్రధాన ఘట్టాలను రైజ్ యువర్ వాయిస్ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ప్రజలకు చేరవేశారని గుర్తుచేశారు. శకారంభం పుస్తక ప్రచురణకర్త బొడ్డు వెంకటరమణ చౌదరితోపాటు ఇందులో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ యువనేత లోకేష్ అభినందనలు తెలిపారు.