- ఏపీ ఫుడ్ కమిషన్‌ను వర్క్ ఫ్రమ్ హోమ్‌గా మార్చేసిన చైర్మన్, సభ్యులు
- ప్రజాధనంతో జీతం.. వైసీపీకి చైర్మన్ ప్రచారం
- ఉత్తుత్తి తనిఖీలతో చైర్మన్ విజయ్ ప్రతాప్‌రెడ్డి హంగామా
- రెండున్నరేళ్లలో ఒక్క కేసు కూడా నమోదు చేయని వైనం
- కాకినాడ కేంద్రంగా వేలటన్నుల రేషన్ బియ్యం అక్రమరవాణా
- కూటమి ప్రభుత్వం వచ్చాక బయటపెట్టిన మంత్రి నాదెండ్ల
- ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు రెండున్నరేళ్లు నిద్రపోయారా?
- కమిషన్‌ను వెంటనే ప్రక్షాళన చేయాలి
- టీడీపీ నేత విజయ్‌కుమార్ ధ్వజం
అమరావతి(చైతన్యరథం): తూతూ మంత్రం తనిఖీలతో సోషల్ మీడియాలో వీడియోల కోసం హంగామా చేయటం తప్పించి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి చేసింది ఏమీ లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. ఆఫీసుకు రాకుండా, సమావేశాలు లేకుండా లక్షల రూపాయల జీతాలు తీసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రతినెలా కమిషన్ సమావేశం జరపాలని చట్టంలో ఉంటే ఈ ఏడాది జనవరి 30 తరువాత ఇంతవరకు ఒక్కసారి కూడా కమిషన్ సమావేశం జరపలేదన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నా రెండున్నరేళ్లలో ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా సభ్యులు, చైర్మన్ కలిసి ఫుడ్ కమిషన్‌ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రేషన్ బియ్యం పంపిణీ, మిల్లుల ద్వారా బియ్యం సేకరణ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీల్లో భోజనాలు, హాస్టళ్ళలో ఆహార సదుపాయాలు, వీటన్నింటి మీద వచ్చే ఫిర్యాదులు, అక్రమాలపై సుమోటోగా కేసు నమోదు చేసే అధికారం ఉన్నా కమిషన్ పట్టించెకోలేదన్నారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం అయినట్లుగానే గత పాలనలో ఏపీ ఫుడ్ కమిషన్ అత్యంత అధ్వాన్న స్థితికి చేరిందన్నారు. ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు ఏం చేశారో తెలియదు. ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోం అనేలా నెలకు ఒకటి, రెండు సార్లు వచ్చిపోయేవారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ రూ. 5.35 లక్షలు జీతం తీసుకుంటూ రాజకీయాల్లో మునిగితేలారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. కాంతారావు, జక్కంపూడి కిరణ్, లక్షారెడ్డి, మిగిలిన సభ్యులు అసలు ఆఫీసుకు రాకుండా ఒక్కోక్కరు నెలకు రూ.4.58 లక్షలు జీతం తీసుకున్నారు. ఒక సభ్యుడు హైదరాబాదులో, ఇంకొక సభ్యురాలు పశ్చిమ గోదావరిలో ఉంటారు. ఒక్కరూ విజయవాడ ఆఫీసుకి రారు. నెలలో ఒక్కసారి వస్తే గొప్ప. వైజాగ్‌కు చెందిన సభ్యుడయితే పదవి ఇచ్చిన రెండు సంవత్సరాల్లో కేవలం మూడు సార్లు విజయవాడ ఆఫీసుకి వచ్చారు. ఎవరికి వాళ్ళు, వారి వూళ్ళో కాంప్ ఆఫీస్ అంటారు.
ఏ పనీ చేయకుండా ఊరకనే లక్షల రూపాయల జీతం తీసుకుంటారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఫుడ్ కమిషన్ ఎవరి మీదా ఒక్కటంటే ఒక్క కేసు కూడా పెట్టలేదు. చైర్మన్ మాత్రం క్షేత్రస్థాయి తనిఖీలంటూ 500లకు పైగా వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టుకున్నాడు. ఈ తనిఖీల్లో బయటపడిన అక్రమాలపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. అంటే అన్నీ సక్రమంగా ఉన్నట్లుగానే భావించాలా? ఆహార కమిషన్ అసలు వీడియోలు తీయవచ్చా.. అలా చేయకూడదు కదా? విజయవాడ ఆఫీసులో ఫుడ్ కమిషన్ మీటింగ్ పెట్టి ఆరునెలలు పైనే అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే జీతాలు ఫుల్ ..పని నిల్ అన్నట్లుగా వారి పని ఉందని విజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
పదవిలో ఉంటూ రాజకీయాలా?
ఫుడ్ కమిషన్ సభ్యులు, చైర్మన్ రాజకీయాల నుంచి వచ్చి ఉండచ్చు. కానీ పదవుల్లో నియమితులైన తర్వాత, రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ఫుడ్ కమిషన్ ఒక చట్టబద్దమైన ప్రత్యేక సంస్థ. సమన్లు ఇచ్చే అధికారం కలిగిన పాక్షిక న్యాయవ్యవస్థ లాంటిది. సభ్యులకి చైర్మెన్‌కి హై కోర్టు జడ్జికి ఉన్న అధికారాలు ఉంటాయి. కమిషన్ సభ్యులు, చైర్మన్ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయకూడదు. కానీ చైర్మన్ మాత్రం కడప జిల్లాలో విస్తృతంగా వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా ఒక కమిషన్ చైర్మన్ పదవిలో ఉండి, వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడం ఎంతవరకు నైతిక ధర్మమో ఆయనే చెప్పాలని విజయ్ కుమార్ అన్నారు.
పోలీసు కేసులున్నా ఎలా నియమిస్తారు..
విజయ్ ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పక్కా ఆధారాలు, ఫోటోలు ఉన్నాయి. కమిషన్ చైర్మన్‌గా ఉండి రాజకీయ కార్యక్రమాల్లో విజయ్ ప్రతాప్ రెడ్డి ఏ విధంగా పాల్గొంటారు? ఇలాంటి వ్యక్తులు కమిషన్ చైర్మన్‌గా ఉంటే పాలనలో పారదర్శకత ఉంటుందా? సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారిని కమిషన్ చైర్మన్‌గా, సభ్యులుగా నిమయమిస్తారు. కానీ పోలీసు కేసులు ఉన్న వ్యక్తులను ఫుడ్ కమిషన్ సభ్యులుగా ఎలా తీసుకున్నారు? జక్కంపూడి కృష్ణకిరణ్ పై అమలాపురంలో కేసు నమోదైంది. కాంతారావుపై ఎన్ని కేసులు ఉన్నాయో లెక్కలేదు. అసలు పోలీస్ వెరిఫికేషన్ క్లియరెన్స్ ఎలా జరిగిందో, అప్పటి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పడిన సెలెక్షన్ కమిటీ వీళ్ళని ఎలా నియమించిందో, అంతా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళ మీద వున్నా కేసుల వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లోనే వున్నాయి. కావాలంటే కాపీలు కూడా ఇస్తాము.
రెండు సంవత్సరాలుగా చైర్మన్‌గా ఫీల్డ్ విజిట్ చేసి ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించిన తనిఖీల్లో కొన్ని వేల టన్నుల అక్రమ బియ్యం నిల్వలు బయట పడ్డాయి. కాకినాడ పోర్టునుండి గత మూడేళ్లుగా రూ. 750 కోట్లు విలువ చేసే రేషన్ బియ్యం ఆఫ్రికాకు తరలిపోయిందని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నియమించిన రాష్ట్ర ఆహార కమిషన్ దృష్టికి గత రెండున్నర సంత్సరాలుగా ఈ బియ్యం అక్రమ రవాణా ఎందుకు రాలేదు? ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతున్నా ఆహార కమిషన్ ఏం చేస్తోంది? ఇంత అక్రమం జరుగుతుంటే ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదు? వైసీపీ ప్రభుత్వం ఉండగా బియ్యం అక్రమ నిల్వలు ఎందుకు బయట పడలేదు? బియ్యం దారి మళ్లింపు, బియ్యం ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు, బియ్యం రీ సైక్లింగ్, బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడుల్లో ఒక్కటి కూడా ఆహార కమిషన్ దృష్టికి రాలేదా? ఆడంబరంగా వీడియోల్లో చేసిన తనిఖీలు అన్నీ డమ్మీనేనా అని విజయ్ కుమార్ ప్రశ్నించారు.
ప్రక్షాళన చేయాలి
చైర్మన్, సభ్యుల కమిటీ ఒక కోర్టు లాంటిది. ఎవరిపైన అయినా కేసు పెట్టవచ్చు. కేసు పెట్టాక సభ్యులను ఎంక్వైరీ కోసం పంపాలి. ముద్దాలు అనుకున్నవారికి సమన్లు జారీ చేసి విచారణకు పిలవాలి. క్రిమినల్ కేసులు అయితే దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ కోర్టుకు పంపాలి. అలా ఒక్కటి కూడా చేయలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చాక కూడా ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు నెలకు ఒక్కసారి వచ్చి లక్షల రూపాయాలు దండుకుంటున్నారు . గతంలో టీడీపీ హయాంలో అనేక మందిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం మారగానే ఆ కేసులను వైసీపీ పట్టించుకోలేదు. లక్షల రూపాయల జీతం తీసుకుని పార్టీ కోసం పనిచేస్తున్నారా? ఆహార కమిషన్ ప్రజలకోసం ఏర్పాటైన సంస్థ. దానిని నిర్వీర్యం చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇలాంటి కమిషన్‌లను ప్రక్షాళన చేయాలని విజయ్ కుమార్ అన్నారు.