అమ్మలకు ఆర్ధిక దన్నునిచ్చి.. పిల్లల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలన్న చంద్రబాబు ఆశయం మెట్టెక్కింది. ఈనాటి ‘అమ్మకి వందనం’ ఖాయంగా రేపటి విద్యా వెలుగులకు భద్రత. సంకుచిత ప్రయోజనాలే లక్ష్యంగా గత ప్రభుత్వం రాష్ట్ర విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టింది. జగన్ అసమర్థ ఏలుబడితో రాష్ట్రానికి ఆర్దిక ఆరాచకాన్ని మాత్రమే మిగిల్చిన సమయంలో.. అర్హులైన పిల్లలందరికి ‘అమ్మకి వందనం’ పథకం అమలు చెయ్యడం చిన్న విషయంగా చూడలేం. తనది మాటల పాలన కాదని, చేతల పాలనేనని ప్రతిసారీ నిరూపించుకుంటూనే ఉన్నారు చంద్రబాబు. పథకం అమలవుతుందా? లేదా? అన్న సందిగ్ధంలో ఉండిపోయిన అధిక శాతం తల్లుల మనసును ఊరిడిస్తూ.. ఇచ్చిన హామీని చంద్రబాబు వెనక్కి తీసుకోరు అంటూ ఆ తల్లులంతా ఇప్పుడు సమాధానపడుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు.. ప్రతి ఇంటా ఎంతమంది పిల్లలున్నా.. అందరికీ ‘అమ్మకి వందనం’ అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం పథకాన్ని అమలు చేసి చూపించారు. 67.27 లక్షలమంది విద్యార్థులకు రూ.10వేల కోట్లు విడుదల చేసి తల్లుల ఖాతాలో రూ.13వేలు, పాఠశాల మెయింటెనెన్స్ కోసం రూ.2వేలు ఖాతాలలో పడుతుంటే `తల్లుల ముఖాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి.
గత ప్రభుత్వం 42లక్షల మందికే ఇస్తే వారికంటే ఘనంగా కూటమి ప్రభుత్వం 25 లక్షల మందికి అదనంగా పథకాన్ని అమలు చెయ్యడం అభినందనీయమే. అమ్మఒడి కింద జగన్‌రెడ్డి చేసిన ఖర్చు రూ.5,540 కోట్లయితే.. కూటమి ప్రభుత్వం అందిస్తోన్న విద్యా సంక్షేమం ఖర్చు దాదాపు రూ.9,000 కోట్లు. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను కలుపుకుంటే ఇది రూ.10వేల కోట్లకు చేరొచ్చు. తల్లికి వందనం నిధులు వరుసగా ఖాతాలలో పడుతుంటే.. తల్లిదండ్రులు ఆనందంతో తబ్బిబ్బు అవుతున్నారు. ఒక పథకానికి ఇన్ని వేల కోట్లు ఒకేసారి విడుదల చేయడం నిజంగానే సంక్షేమ రాజ్యంలో ఒక చరిత్ర. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముఖ్యమైన పథకాలన్నింటినీ ఏడాదిలోపే అమలు చేస్తున్నది కూటమి ప్రభుత్వం. అయినా ఇంగితం లేకుండా జగన్ ముఠా ప్రభుత్వంపై విషంగక్కడం.. ఆకాశంపైకి ఉమ్మే సాహసం చేయడమే!
2019 ఎన్నికల్లో ఎంతమంది పిల్లలున్నా అంతమందికీ అమ్మ ఒడి ఇస్తామని బులిపించి.. అధికారంలోకి వచ్చిన జగన్ దగాకు పాల్పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటో తరగతినుంచి ఇంటర్ వరకు చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇవ్వడమే కాదు, అమలు చేసి చూపిస్తోంది. జగన్ ప్రభుత్వ విధానం వలే విద్యాసంస్థల ఖర్చుల నిధికోసం రూ.2వేలు కేటాయించి విద్యార్థికి రూ.13వేల చొప్పున, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 13 వేలు అమ్మల ఖాతాలో జమ చెయ్యడంతో ఆయా కుటుంబాలకు భారీగా లబ్ధి చేకూరి ఆనందం వెల్లి విరుస్తోంది. ఒక కుటుంబంలో ఐదుగురు, ఆరుగురున్నా అమ్మకు వందనం డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది చదువుకుంటున్న పిల్లలున్న కుటుంబాల సంఖ్య లక్షల్లోనే ఉంది. ఒక్కరు పిల్లలున్న కుటుంబాల సంఖ్య 18,55,760 వుంటే, ఇద్దరు పిల్లలున్న కుటుంబాల సంఖ్య 14,55,322. వీరందరికీ జగన్‌రెడ్డి హయాంకంటే రెట్టింపు డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యాయి. ముగ్గురు పిల్లలున్న అమ్మలు 2,10,684మంది. వీళ్లందరికీ రూ.39 వేల చొప్పున తల్లికి వందనం డబ్బులు అందాయి. 20వేల కుటుంబాల్లో నలుగురు పిల్లలున్నారు. వీరి ఖాతాల్లో రూ.52 వేలు జమయ్యాయి. అతి తక్కువగా ఐదారుగురు పిల్లలున్న తల్లులూ ఉన్నారు. ఏదేమైనా.. జగన్ హయాంతో పోల్చితే రెట్టింపు లబ్ధి కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిందన్నది సత్యం!
తల్లికి వందనం ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటంతో కడుపు మండుతోన్న వైసీపీ `పథకంలో కొంత నగదు మంత్రి నారా లోకేశ్ ఖాతాలోకి వెళ్లిందంటూ చేసిన దిక్కు మాలిన ఆరోపణలు ఆ పార్టీ భ్రష్టత్వాన్ని రుజువు చేస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని ఆశపెట్టి.. చివరకు ఒకరికేనంటూ చేసిన మోసం ఆ పార్టీ విస్మరించడం దగా రాజకీయమే. జగన్‌రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు 25 లక్షలమంది పిల్లలకు అదనంగా ప్రయోజనం లభిస్తోంది. ఆర్ధిక ఇబ్బందులు వెన్నాడుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు సీయం చంద్రబాబు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద నగదు జమచేసి నిజాయితీని నిరూపించుకున్నారు. గతంలో ఒక బిడ్డకే అమ్మ ఒడి కింద నగదు వచ్చిందని, ఇప్పుడు ముగ్గురు, నలుగురు వున్నా ఒకేసారి బ్యాంకులో డబ్బు జమకావడంతో తల్లుల ఆనందానికి అవధులు లేవు.పేద కుటుంబాలకు పెద్ద సాయం చేసిన సీఎం చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటామన్నది తల్లులంటోన్న మాట.
జగన్‌రెడ్డి ఎన్నికలముందు వివిధ వర్గాల ప్రజలకు భేషరతు హామీలు, పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక అనేక నిబంధనలు విధించి వీలైనంతమేర లబ్దిదార్ల సంఖ్యను కుదించి ఖర్చు తగ్గించుకొన్నారు. అమలు చేసిన ప్రతి పథకం అరకోరే తప్ప.. ఏ పథకం ప్రజావసరాలు తీర్చలేదన్నది నిజం. వెండిగిన్నే చూపించి అధికారం చిక్కాక వెలితి గిన్నె చేతికిచ్చారు. సంక్షేమ పధకాలను ఓట్ల కోసం వాడుకొని అవసరం తీరాక కోతలు పెట్టారు. జగన్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అట్టహాసంగా ప్రారంభించింది కానీ అమలు చెయ్యడంలో చతికిలపడిరది. బడుగు బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం చేసింది గోరంత, చెప్పుకున్నది కొండంత. నవరత్నాలు మొదలుపెట్టిన దగ్గర్నుంచే ప్రభుత్వానికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వాటిభారం తగ్గించుకోవడానికి కంతలే వెతికారు. అందుకు అమ్మవొడి ఉదాహరణ. పథకానికి ఆంక్షలు విధించి అంటకత్తెర వేశారు. ఇవ్వాల్సింది 82 లక్షల మందికి. ఇచ్చింది 42 లక్షల మందికి. ఇస్తానన్నది రూ.15 వేలు. ఇచ్చింది రూ.13 వేలు. ఆంక్షలు విద్యార్థుల హాజరు 75శాతం ఉండాలి. 300 యూనిట్లుకన్నా తక్కువ విద్యుత్తు వాడాలి. కొత్తరేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు బ్యాంకు అకౌంట్‌తో లింకై ఉండాలి. ఆధార్ కార్డులో కొత్త జిల్లా పేరుండాలి. ఇలా అడ్డమైన ఆంక్షలు విధించి అమ్మఒడి పథకానికి అంటకత్తెర వేశారు. ఏటా 42 లక్షలకు మాత్రమే అమ్మఒడి మంజూరు చేసిన ప్రభుత్వం.. 82 లక్షలమంది లబ్ధి పొందినట్లు ఆ అబద్ధాలనే ప్రచారం చేసుకుంటోంది. అమ్మవొడి కింద ఇవ్వాల్సిన డబ్బులు ఒక ఏడాది నిలిపివేసి రూ.6 వేల కోట్లు మిగుల్చుకున్న సర్కారు జగన్‌ది! కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తోంది. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ నిజాయితీనే ఇప్పుడు వైసీపీ సర్కారు జీర్ణించుకోలేక.. బురదజల్లే ప్రయత్నాలు చేస్తోంది!!
నీరుకొండ ప్రసాద్