- అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశం
- నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష
- స్కిల్ సెన్సెస్, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో ఉద్యోగాల కల్పన, నైపుణ్యశిక్షణపై చర్చ
- నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్‌మేళా క్యాలెండర్ ఇవ్వాలి
- ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయాలపై నివేదికకు ఆదేశం
అమరావతి(చైతన్యరథం): నైపుణ్య గణన కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా మంగళగిరి, సీఆర్డీయే ప్రాంతాల్లో తొలుత చేపట్టాలని అధికారులను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేష్ సోమవారం సమీక్ష నిర్వహించారు. మంగళవారం సంబంధిత శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమీక్ష ఉన్నందున ఉండవల్లిలోని నివాసంలో ముందస్తుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శాఖ చేపడుతున్న అనేక కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. స్కిల్ సెన్సెస్ యాప్ పై చర్చించిన మంత్రి లోకేష్ పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరి, సీఆర్డీయే ప్రాంతాల్లో నైపుణ్యగణన చేపట్టాలని ఆదేశించారు.
పరిశ్రమలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల అనుసంధాన ప్రక్రియ ఎంతవరకు వచ్చిందన్న అంశంపై సమావేశంలో చర్చించారు. ఐటీఐ కాలేజీల్లో ఉద్యోగాల కల్పన, శిక్షణపైనా చర్చించారు. నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకై క్యాలెండర్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయాలపై సమగ్ర నోట్ సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డ్యాష్ బోర్డు రూపకల్పన, స్కిల్ యూనివర్సిటీ అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ సౌరభ్ గౌర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో జి.గణేష్ కుమార్, కేపీఎంజీ(పీఎంయూ, ఏపీఎస్‌ఎస్ డీసీ) ప్రతినిధులు కుమార పురుషోత్తం, ఈ.మోహన్, తదితరులు పాల్గొన్నారు.
“