- రాష్ట్ర భవిష్యత్‌ను మార్చే ప్రణాళికను ఆవిష్కరిస్తా
- విశాఖ రూపురేఖలు మరింత మార్చాల్సి ఉంది
- ఈ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది…
- హైదరాబాద్‌లాగ వేగంగా అభివృద్ధి సాధిస్తుంది
- మేజర్ ప్రాజెక్టులే.. గేమ్‌ఛేంజర్ అవుతాయి
- రతన్ టాటా హబ్ గా ఏపీ…
- మోడల్ గ్రోత్ హబ్‌గా ఉత్తరాంధ్రతో కూడిన విశాఖ
- కలెక్టరేట్లో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
విశాఖపట్నం (చైతన్య రథం): రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళికను రెండు మూడురోజుల్లో ఆవిష్కరించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పది పాయింట్ల ప్రణాళికతో 2047నాటికి అన్నింటా ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెట్రో రైల్, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలను సమీక్షించారు. జీరో పావర్టీ దిశగా వేగంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఉద్యోగాల సృష్టి, కల్పన, నైపుణ్యాల పెరుగుదల, రైతు సాధికారత, ఆదాయం పెంపులో నంబర్‌వన్ కావాలన్నారు. తాగునీటి సంరక్షణ, ప్రపంచస్థాయి మౌలికవసతుల అభివృద్ధిలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. స్వచ్ఛ ఏపీ దిశగా వేగంగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. మానవ వనరుల నిర్వహణ, వినియోగం, శక్తివనరుల వినియోగం, నిర్వహణలో ముందుండాలని ఆకాంక్షిస్తూ.. అన్ని రకాల సాంకేతికత, పరిశోధనలో మనమే నంబర్ కావాలన్నారు.
పీపీపీ విధానంలో సంపద సృష్టి జరిగిందని, ఇప్పుడిక పీ`4 విధానంతో అంతకుమించిన ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం డబ్బుకంటే మంచి ఆలోచనే ముఖ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్పెన్యూర్ విధానానికి నాంది పలుకుదామని అంటూనే.. రతన్ టాటా హబ్‌గా ఏపీ… ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక హబ్ ఏర్పాటు కావాలన్నారు. డ్రోన్ పాలసీలో భాగంగా ప్రతి డ్వాక్రా సంఘానికి రూ.8 లక్షల సాయం, డ్రోన్ వినియోగంపై అవగాహన కలిగించాలన్నారు. భవిష్యత్తును అంచనా వేస్తూ కలెక్టర్లు, అధికారులు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. మానవ వనరుల వినియోగంలో 2047నాటికి ప్రపంచాన్ని ప్రభావితంచేసే స్థాయికి భారత్ ఎదుగుతుందని అంచనా వేస్తూ.. సంపద సృష్టి, అభివృద్ధికి డబ్బు కన్నా మంచి ఆలోచన ముఖ్యమని సూచించారు.
అలాగే, పీపీపీ విధానాల ద్వారానే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, సంపద సృష్టి జరుగుతుందని ఆ దిశగా కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులు ఆలోచించాలని, చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విశాఖపట్టణం లాంటి మహానగరం రూపు రేఖలు మరింత మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిలో రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, మెట్రో ప్రాజెక్టులు గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం విశాఖపట్టణం విచ్చేసిన ముఖ్యమంత్రి స్థానిక కలెక్టరేట్లో విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అభివృద్ధిపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేస్తూ.. `పంచ గ్రామాల సమస్యకు టైంబాండ్ పెట్టుకొని పరిష్కరించాలని సూచించారు. ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, నగరంలో గుంతలు రోడ్లు ఉండటానికి వీల్లేదంటూ.. ఎక్కడైనావుంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, పైపులైన్లు, కుళాయిల ఏర్పాటు మార్చి నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జిల్లాలోని జలశయాల సామర్ధ్యాలను గుర్తించి నీటి నిల్వ సామార్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని, హోటళ్లు మరిన్ని రావాలి… అభివృద్ధి చేయాలి… గ్రేహౌండ్స్ భూములను హోటళ్లకు వినియోగించుకోవచ్చని సూచించారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చే నాటికి.. జిల్లాలోని అభివృద్ధి ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటూనే.. శాంతిభద్రతల పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీసీ కెమెరాల సంఖ్య పెంచాలని, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను నియంత్రించాలన్నారు.
విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ విధానం పెరగాలని, సూర్యఘర్ పథకంలో భాగంగా రూప్‌టాప్ సోలార్ ప్లాంటులు ఏర్పాటు చేసుకోవడంలో ప్రజలను మరింత ప్రోత్సహించాలన్నారు. ఆయుష్మాన్ భారత్, అపార్ ఆవశ్యకతపై విస్తృత అవగాహన కలిగించి.. ఫలాలు ఎక్కువ మందికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత ఇసుక విధానం మరింత పారదర్శకంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అనకాపల్లి -అచ్యుతాపురం రోడ్డుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, పీపీపీ విధానాన్ని అనుసరించాలని సూచించారు. సుగర్ ఫ్యాక్టరీల ద్వారా కేవలం పంచదార ఉత్పత్తి మాత్రమే కాకుండా.. ఇథనాల్, డిస్టిలరీ ఉత్పత్తిపై దృష్టి సారించాలని, రైతులకు ప్రయోజనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలని… ఉపాధ్యాయులకు శిక్షణ.. భవనాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. టూరిజం అభివృద్ధికి ఊతమిస్తూ… గిరిజన యువతను గైడులుగా మార్చి.. తగిన శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఏజెన్సీల్లో డోలీమోత సమస్యకు చెక్ పెట్టాలని, ప్రభుత్వంపై సానుకూల దృక్ఫథం వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని కోరారు. అభివృద్ధి విషయంలో… పరిపాలన వ్యవహారాల్లో ప్రజాప్రతినిధులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎక్సైజ్, మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర, మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవి రావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీ కృష్ణ శ్రీనివాస్, గణబాబు, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు, కొణతాల రామకృష్ణ, కె.ఎస్.ఎన్. రాజు, బండారు సత్యనారాయణ, సుందరపు విజయ్ కుమార్, శిరీష, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఏపీఐఐసి వైస్ చైర్మన్ ఎం. అభిషిక్త్ కిషోర్, ఏపీ టిడ్కో ఎండీ బి. సునీల్ కుమార్ రెడ్డి, కలెక్టర్లు ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, దినేష్ కుమార్, విజయ్ కృష్ణన్, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.