- ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
- మధ్యతరగతి ఇళ్లకు ప్రత్యేక పథకం
- మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
- పేదరికం సమూల నిర్మూలనే లక్ష్యం..
- పేదలు, మహిళలు, యువత, రైతులకు ప్రాధాన్యం
- పన్ను రేట్లు, శ్లాబుల్లో మార్పు లేదు
- మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
- వరుసగా ఆరు బడ్జెట్లతో మోరార్జీ సరసన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’. అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దృషి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిరచారు. పేదలు, మహిళలు, యువత, రైతాంగం.. ప్రధానంగా ఈ నాలుగు వర్గాలకు నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. ఈ నాలుగు వర్గాలను శక్తివంతం చేయడంతోపాటు, అన్ని రంగా ల్లో అభివృద్ధిని సాధించి.. వికసిత భారత్‌ను ఆవిష్క రించటమే తమ ముందున్న కర్తవ్యంగా ప్రకటిం చారు. 2024-25 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పవేశపెట్టారు. 58 నిమిషాల పాటు సాగిన ఆర్థిక మంత్రి సుదీర్ఘ ప్రసంగంలో.. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో సాధించిన ప్రగతిని వివరించటానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. సబ్ కా సాథ్ సాధనతో పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం 25 కోట్లమందికి సహాయం అందజేసిందన్నారు.
గత పదేళ్ల కాలంలో సబ్‌కా సాథ్ ద్వారా పేదరికాన్ని భారీగా నిర్మూలించామన్నారు. గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సానుకూల పరివర్తన చెందిందని, భవిష్యత్తుపై ఆశలు చిగురించాయని సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు భవిష్యత్తు వైపు ఆశతో ఎదురుచూస్తున్నారని అంటూనే `సమగ్రాభివృద్ధి, వృద్ధి లక్ష్యంగా గ్రామీణ స్థాయి వరకు సేవలను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని నేరుగా లక్ష్యంగా చేసుకొని వారి అభ్యున్నతిపై దృష్టి సారించనున్నట్టు సీతారామన్ చెప్పారు.
గంభీరమైన వాగ్దాటితో కేంద్రం సాధించిన విజయాలను ఒకవైపు ఏకరువు పెడుతూనే `2047లో దేశం స్వాతంత్య్ర అమృతోత్సవం జరుపుకునే సమయానికి సంపన్న దేశాల సరసకు భారత్‌ను చేరుస్తామని ఉద్ఘాటించారు. దేశ దిశా గమనాన్ని ఉత్కృష్టస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో.. వికసిత భారత్ సాధనకు ప్రజలంతా కలిసి రావాలని పరోక్షంగా కోరారు. సంక్షిప్తంగా సాగిన సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో `పేదరిక నిర్మూలనకు బహుముఖీయ విధానాలతో కేంద్రం ఎలా పనిచేస్తుందో వివరించారు. అభ్యుదయ భారతదేశ నిర్మాణ బాధ్యతకు కేంద్రం కట్టుబడి ఉందని, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే మంత్రంతో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.
సమసమాజమే మా విజన్..
కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే మోదీ ప్రభుత్వ విజన్‌గా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రధాని ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని పేదలు, మహిళలు, యువత, అన్నదాతలపై మరింత దృషి సారించనున్నామన్నారు. కేంద్రం ప్రాధాన్యతగావున్న ఈ నాలుగు వర్గాల అవసరాలు, ఆకాంక్షలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు.
‘జీడీపీ’కి కొత్త నిర్వచనం..
జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పెర్ఫార్మెన్స్ అనే కొత్త అర్థాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, ఆ దిశగా ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుందని సీతారామన్ తెలిపారు. గత పదేళ్లలో సాధించిన విజయాలను ఏకరువు పెడుతూనే రాబోయే కాలంగా సాధించాల్సిన, సాధించనున్న లక్ష్యాలను సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ప్రభుత్వం గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చినట్టు చెబుతూనే.. పంట బీమా పథకంతో నాలుగు కోట్లమంది రైతులు ప్రయోజనం పొందారన్నారు. పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామని, ఆర్థిక వృద్ధి పుంజుకుందనీ వివరించారు. పన్ను సంస్కరణలతో టాక్స్ బేస్‌ను విస్తరించగలిగిన కారణంగా, పన్ను వసూళ్లు పెరిగాయన్నారు. రానున్న ఐదేళ్లలో అసాధారణ రీతిలో ఆర్థిక వృద్ధి చోటుచేసుకోనుందని చెబుతూనే `2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రక్షణ ప్రయోజనల రీత్యా డీప్ టెక్‌ను పటిష్టం చేసేందుకు కొత్త పథకాన్ని తెస్తున్నామని, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటికలను సాకారం చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టునున్నట్టు చెప్పారు. స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని వివరిస్తూనే లక్ పతీ దీదీ టార్గెట్‌ను రెండునుంచి మూడు కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
25 కోట్లమంది పేదరికానికి దూరం..
కేంద్రం అనుసరించిన ఆర్థిక విధానాలతో దేశంలో 25 కోట్లకుపైగా ప్రజలు బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని సీతారామన్ వెల్లడిరచారు. పేదలకు సాధికారతకు తమ ప్రభుత్వంపై ప్రగాఢమైన విశ్వాసం ఉందంటూనే.. సబ్ కా సాథ్ సాధనతో పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం 25 కోట్లమందికి సహాయం అందజేసిందన్నారు. గత పదేళ్ల కాలంలో సబ్‌కా సాథ్ ద్వారా పేదరికాన్ని భారీగా నిర్మూలించామన్నారు. గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సానుకూల పరివర్తన చెందిందని, భవిష్యత్తుపై ఆశలు చిగురించాయని సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో దేశం పలు సవాళ్లను ఎదుర్కొందని, నరేంద్ర మోదీ సారధ్యంలోని ప్రభుత్వం వాటిని సమష్టి కృషి, సమ్మిళిత వృద్ధి (సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్) ద్వారా పరిష్కరించిందని అన్నారు.
ఆదాయం పన్ను రేట్లు, శ్లాబుల్లో మార్పుల్లేవు
ఆదాయ పన్ను వర్గాలకు నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్‌లో ఉపశమనం కలిగించే ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. గత ఏడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానమే ఈసారి కూడా కొనసాగుతుందని, రూ.7 లక్షల వరకూ ఎలాంటి పన్ను భారం ఉండదని చెప్పారు. ప్రత్యక్ష, పరోక్ష, దిగుమతి సుంకాలకు పాత పన్ను విధానమే కొనసాగుతుందని తెలిపారు.
‘’గత పదేళ్లుగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగింది. రిటర్న్ ఫైలర్స్ 2.4 రెట్లు పెరిగారు. పన్ను చెల్లింపుదారుల వాటాను దేశ సంక్షేమం, ప్రజల సంక్షేమానికి తెలివిగా ఖర్చుచేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. పన్ను చెల్లింపుదారులు ఇస్తున్న మద్దతుకు అభినందిస్తున్నాను. ప్రభుత్వం పన్ను రేట్లను హేతుబద్ధం చేసింది. కొత్త పన్నుల పథకం కింద, రూ.7 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు.
ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడులతో పని ఉండదు. అంతకుమించి ఆదాయం కలిగిన వారికి శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న దేశవాళి కంపెనీల కార్పొరేట్ టాక్స్ రేటు 30 శాతం నుంచి 22 శాతం తగ్గించాం. నిర్దిష్టమైన కొత్త మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు పన్ను రేటు 15 శాతం చేశాం’’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
అయితే ఒక కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించేలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆర్థిక సంవత్సరం 2009-10కి సంబంధించిన వివాదాస్పద రూ.25 వేల ట్యాక్స్ డిమాండ్, 2010-11 నుంచి 2014-15 మధ్య రూ.10 వేలకు సంబంధించిన ట్యాక్స్ డిమాండ్ ఉపసంహరణకు ప్రతిపాదన చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం దాదాపు 1 కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చనుంది.
సమగ్రం.. వినూత్నం: మోదీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించిన మధ్యంతర బడ్జెట్ సమగ్రంగా, వినూత్నంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగుతుందనే విశ్వాసాన్ని కల్పిస్తోందని, విక్‌సిత్ భారతానికి నాలుగు స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులను బడ్జెట్ శక్తివంతం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలపడానికి హామీ ఇస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వరుసగా ఆరుసార్లు..
నరేంద్ర మోదీ ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌తో వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ సరసన నిలిచారు. గతంలో ఆర్థిక మంత్రులుగా చేసిన మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల ఐదు బడ్జెట్‌ల రికార్డును ఆమె అధిగమించారు. 58 నిమిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. ఇంతవరకూ ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లతో పోల్చుకుంటే అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం ముగించడం ఇదే ప్రథమం. నిర్మలా సీతారామన్ గత ప్రసంగాలను పరిశీలిస్తే, 2019లో 137 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగించారు. 2020లో 162 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు ప్రసంగించారు. 2023లో 87 నిమిషాల పాటు ఆమె ప్రసంగం సాగింది. ఈసారి (2024) మధ్యంతర బడ్జెట్ కావడంతో 58 నిమిషాలతో ప్రసంగం ముగిసింది. 2019 జూలై నుంచి ఐదుసార్లు పూర్తి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆరోసారి పెట్టింది మధ్యంతర బడ్జెట్.