- గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా శ్రీసిటీ
- క్యారియర్ రాక ఏపీ, చంద్రబాబు విజన్‌పట్ల నమ్మకానికి నిదర్శనం
- ఇండియాస్ కూల్ క్యాపిటల్‌గా ఏపీ గుర్తింపు పొందింది
- 2027నాటికి ఏసీల ఉత్పత్తిలో 60శాతం రాష్ట్రంనుంచే
- 2047నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ
- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి లోకేష్
శ్రీసిటీ (చైతన్య రథం): డేటా సెంటర్ల ఏర్పాటు కేవలం ప్రారంభం మాత్రమేనని.. డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామిక పార్క్‌లో క్యారియర్స్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యూనిట్‌కు శంకస్థాపన అనంతరం మంత్రి మాట్లాడారు. “దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీసిటీ పారిశ్రామికవాడలో మరో దిగ్గజ సంస్థ శంకుస్థాపన సందర్భంగా మీ ముందుకు రావడం గౌరవంగా ఉంది. ఈరోజ మనం కేవలం ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించడమే కాదు.. భారతదేశ డిజిటల్, ఏఐ అభివృద్ధిని ఆవిష్కరిస్తున్నాం. ముందుగా క్యారియర్ గ్లోబల్ సంస్థ నాయకత్వానికి, ఛైర్మన్, సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్‌కు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా. క్యారియర్ అనేది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు… ప్రపంచంలో కూలింగ్ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చిన సంస్థ. ఆధునిక ఎయిర్ కండిషనింగ్‌ను ఆవిష్కరించడంనుంచి.. 50 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన గ్లోబల్ శక్తిగా ఎదగడం వరకు క్యారియర్ ఎప్పుడూ ఆవిష్కరణలో ముందువరుసలో నిలిచింది. ఈ రోజు ఆ ఆవిష్కరణ ఏపీకి వస్తోంది” అని మంత్రి లోకేష్ వెల్లడించారు.
గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా శ్రీసిటీ
“క్యారియర్ సంస్థ ఏపీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 3వేల ఉద్యోగాలను కల్పించనుంది. క్యారియర్ రావడం రాష్ట్రంపట్ల, మన ఎకోసిస్టమ్, మన ముఖ్యమంత్రి విజన్‌పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనం. శ్రీసిటీ కేవలం ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే కాదు.. ఇదో గ్లోబల్ మానుఫ్యాక్చరింగ్ హబ్. 8,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 31 దేశాలనుంచి 250కి పైగా కంపెనీలు శ్రీసిటీలో ఉన్నాయి. ఇక్కడినుంచి 6 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి. 70వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. వీరిలో సగంమంది మహిళలున్నారు. ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు.. ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ప్రిసిషన్ ఇంజనీరింగ్ వరకు శ్రీసిటీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తమ నమూనాగా నిలుస్తోంది. ఈరోజు మరో గొప్ప ఘనతను తన ఖాతాలో వేసుకుంది” అని లోకేష్ ప్రకటించారు.
ఇండియాస్ కూల్ క్యాపిటల్‌గా ఏపీకి గుర్తింపు
“ఇండియాస్ కూల్ క్యాపిటల్‌గా ఏపీ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. 9 ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు, 30కి పైగా కాంపోనెంట్, సరఫరా భాగస్వాములు, రూ.12వేల కోట్ల పెట్టుబడులు, వేగంగా విస్తరిస్తున్న హెచ్‌వీ ఏసీ ఎకోసిస్టమ్.. 2027నాటికి భారతదేశలో ఏసీ ఉత్పత్తిలో 60శాతం ఏపీనుంచే వస్తుంది. 2028 నాటికి ఇది 80శాతానికి చేరుతుంది. ఇది కేవలం వృద్ధి మాత్రమే కాదు.. గ్లోబల్ పోటీ సామర్థ్యం. మనందరం కలిస్తే ఇది వందశాతానికి చేరుతుంది” అని ఆనందంగా ప్రకటించారు.
డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి
“డేటా సెంటర్ల నిర్మాణం, పవర్ ఏఐలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పోటీ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఈ రంగంలో ముందంజలో ఉంది. మనం కేవలం డేటా సెంటర్లకు ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాకుండా.. వాటిని నడిపించే వ్యవస్థలను కూడా నిర్మించడమే మన లక్ష్యం. డేటా సెంటర్లు కేవలం ప్రారంభం మాత్రమే. పూర్తి ఎకోసిస్టమ్ నిర్మించడమే లక్ష్యం. ప్రతి డేటా సెంటర్‌కు అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్స్, హైఎఫీషియన్సీ చిల్లర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, ప్రిసిషన్ మానుఫ్యాక్చరింగ్ అవసరం. ఇవి లేకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పనిచేయదు. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు పెరుగుతున్నకొద్దీ.. ఈ భాగాల కొరత కూడా పెరుగుతోంది. ఏపీ, దేశానికి నిజమైన విలువను సృష్టించే అవకాశం ఇక్కడే ఉంది. మనం ఈ డేటా సెంటర్ల కాంపోనెంట్స్ తయారీలో కీలక సరఫరాదారులుగా మారితే.. అది భారతదేశానికి గొప్ప వ్యూహాత్మక ప్రయోజనంగా మారుతుంది. ఎకోసిస్టమ్‌లో భాగంగా క్యారియర్ ఏపీని, శ్రీసిటీని ఎంచుకుంది. ఫార్మారంగంలో దేశం ఏవిధంగా అగ్రగామిగా మారిందో.. అదేవిధంగా డేటా సెంటర్ పరికరాల తయారీలో కూడా దేశం ప్రపంచ నాయకత్వాన్ని సాధించగలదు. డేటా సెంటర్ కంపోనెంట్ తయారీ.. భారతదేశ తదుపరి ఫార్మా రంగం కావచ్చు” అని వెల్లడించారు.
ఎకోసిస్టమ్ నిర్మాణమే లక్ష్యం
“ఈరోజు క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకస్థాపన ఎంతో ముఖ్యమైంది. క్యారియర్ కేవలం ప్లాంట్‌ను ఏర్పాటు చేయడమే కాదు.. మా దీర్ఘకాలిక లక్ష్యానికి కీలకమైన పునాదిగా నిలుస్తుంది. ఈ ప్లాంట్ ద్వారా భారతదేశ హెచ్ వీఏసీ తయారీ బలపడుతుంది. దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. బలమైన లోకల్ సప్లై చైన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ జనరేషన్ డేటా ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌కు బలం చేకూరుతుంది. ఈవిధంగా ఎకో సిస్టమ్ నిర్మిస్తాం. విశాఖలో ఏఐ డేటా సెంటర్ల నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా తయారీ కేంద్రాల వరకు భారతదేశ తొలి పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ నిర్మించడమే మా లక్ష్యం. ఈ ఎకో సిస్టమ్‌లో డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, కూలింగ్, థర్మల్ మేనేజ్‌మెంట్, కాంపోనెంట్ మానుఫ్యాక్చరింగ్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంటాయి” అని మంత్రి లోకేష్ వెల్లడించారు.
2047నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం
“ఉమ్మడి ఏపీలో చంద్రబాబు 2020 విజన్‌ను అందరూ విమర్శించారు. ఆయనను సరిగా అర్థం చేసుకోలేదు. చంద్రబాబు దార్శనిక నేత. 2047నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. దీనిని కచ్చితంగా సాధిస్తాం. భవిష్యత్‌లో కూలింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందరూ ఏపీనే ఎందుకు ఎంచుకుంటున్నారని అడుగుతున్నారు. ఇందుకు మూడు కారణాలున్నాయి. అద్భుతమైన ట్రాక్ రికార్డ్, అనుభవమున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ఉన్నారు. కసితో పనిచేసే టీమ్ ఉంది. శాసనసభ్యుల్లో 50శాతం మంది కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు. 25మంది మంత్రుల్లో 17మంది కొత్తవారు. నేను సీనియర్ మంత్రిని. రెండో పర్యాయం మంత్రిగా పనిచేస్తున్నాను. చంద్రబాబు విజన్ సాధనకు మేమంతా కసితో పనిచేస్తున్నాం. రెండో కారణం స్పీడ్ ఆఫ్ డూయంగ్ బిజినెస్. అందరం కలిసి చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్క జూమ్ కాల్‌తోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి వచ్చింది. స్పీడ్ అనేది చాలా ముఖ్యం. మూడో కారణం ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఏపీలో నమో అంటే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నాయుడి కలయిక. ఇద్దరూ 75 ఏళ్ల యువకులు. వారిలో 25 ఏళ్ల యువకులు ముగ్గురున్నారు. భూకేటాయింపుల నుంచి అనుమతుల వరకు మేం మీతో కలిసి ఉంటాం. ఒక్కసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్. ఏం అవసరం వచ్చినా వాట్సాప్ మెసేజ్ దూరంలో అందుబాటులో ఉంటాం” అని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
“ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నాం. పెట్టుబడులు కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు. మన యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పన కోసం నైపుణ్యం పోర్టల్‌ను తీసుకువస్తున్నాం. దీనిద్వారా యువతకు పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందిస్తాం. క్లస్టర్ విధానంలో ముందుకు వెళ్తున్నాం. విశాఖ గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపుదిద్దుకుంటుంది. చివరగా క్యారియర్ ఏపీని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని… క్యారియర్ సంస్థ ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేయాలని మంత్రి కోరారు. అనంతరం మంత్రి లోకేష్‌ను సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్, క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ క్లైమేట్ సొల్యూషన్స్ ఏసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా ప్రెసిడెంట్ మేకేల్ ఎల్.గియర్జెస్, క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ (క్యారియర్ ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశన్ నారాయణన్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మైక్ డుయిజర్, చీఫ్ పీపుల్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నడియా విల్లెనెవ్, శ్రీసిటీ కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.














