- ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం
- తిరస్కరించినా గొడ్డలి పార్టీకి బుద్ధి రాలేదు
- శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్ర అభివృద్ధి, సంపద సృష్టి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తూ యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తు న్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌రెడ్డి సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవం, సమర్థ నాయకత్వంతో సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలపై ఒక్క పైసా అదనపు భారం మోపకుండా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, దేశం లో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా అత్యధిక సామాజిక పింఛన్లను అందిస్తూ వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హుల జీవితాల్లో భరో సా నింపుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ ధ్యేయంగా మారిందని మండిపడ్డారు. ప్రజలు ఆ పార్టీని ఇప్పటికే తిరస్కరించి బహిష్కరించినా ఆ పార్టీ నాయకుల వైఖరి లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ అభివృద్ధికి సహకరించాలని, లేనిపక్షంలో ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.















