వాలంటీర్లను పార్టీ కోసం వినియోగించుకుని లబ్దిపొందాలన్న వైసీపీ ఆలోచనలకు అడ్డుకట్టపడింది. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశం ఆ పార్టీకి గొడ్డలిపెట్టయింది. ప్రజాస్వామ్య వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఆ ప్రభుత్వ వికృరత చేష్టలకు సహకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చట్టానికి, న్యాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే అడ్డగోలు పనులన్నిటినీ సమర్థిస్తూ ఎంతో పేరున్న మన ఐఏఎస్ వ్యవస్థకు కళంకం తీసుకువస్తున్నారు. వారిలోని అత్యధికుల అసమర్థత వల్లే ఈ రోజు రాష్ట్రం నాశనమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖేశ్‌కుమార్ మీనా కాస్త భిన్నంగా వ్యవహరించినట్లు భావించవచ్చు. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానం అన్న పేరుతో ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను పార్టీకి ఓటర్లకు అనుసంధానం అన్నరీతిలో ఉపయోగించుకుంటున్నారు. వాళ్ల జీవితాలతో కూడా ప్రభుత్వం, వైసీపీ ఆడుకుంటోంది. వాళ్లని మొదట ప్రభుత్వ ఉద్యోగులన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన జాబితాలో వాలంటీర్ పోస్టులను కూడా చేర్చారు. పని ఎక్కువైపోయిందని, రూ.5వేలు జీతం ఇవ్వడం అన్యాయమని, జీతాలు పెంచాలని వారు ఆందోళనకు దిగడంతో వాలంటీర్ అనేది ఉద్యోగం కాదని, అది సేవ అని జగన్ రెడ్డి సెలవిచ్చారు. దాంతో వారికి వాస్తవం బోధపడింది. అయినా, వారిలో ఎక్కువమంది ఆ పార్టీ కుటుంబాలకు చెందినవారు కావడం, ప్రభుత్వం వత్తిడి వల్ల పార్టీకి అంకితమై పని చేస్తున్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసే క్రమంలో ప్రభుత్వ వేతనాలు పొందుతూ, ప్రభుత్వం కోసం పనిచేసే వాలంటీర్లను తమ పార్టీకి అనుకూలంగా వైసీపీ వాడుకుంటోంది. వాలంటీర్లు కూడా పూర్తిస్థాయిలో వైసీపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు. ఆ పార్టీ మంత్రులు, ముఖ్యనేతలు, చోటామోటా నాయకులు అందరూ కూడా వారిని కార్యకర్తలుగానే భావిస్తున్నారు. వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలేనని అనేక సభలు, సమావేశాల్లో ఆ పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడారు.
2019 ఆగస్టు 12న వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభానికి ముందు విశాఖపట్నంలో నిర్వహించిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైసీపీలో పనిచేసిన వారికి వాలంటీర్ల నియామకంలో అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలకు వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్ కల్పించాలని ఓ నేత సూచించారు. అయితే, ఈ విషయమై అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేం అని, పార్టీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమిస్తామన్న భావన వచ్చేవిధంగా మీరే అర్థం చేసుకోవాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎటువంటి అవకాశాలు ఇవ్వాలనేది పార్టీ చూసుకుంటుందని బహిరంగంగా చెప్పారు. ఇక హోం మంత్రి తానేటి వనిత అయితే ఒక అడుగు ముందుకు వేసి వైసీపీ కుటుంబాలకే వాలంటీర్ పోస్టులిచ్చినట్లు తెలిపారు. ఆమె ఈ ఏడాది జూన్ 27న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతూ ‘పార్టీ అంటేనే కార్యకర్తలని, అలాంటి వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. వాలంటీర్ పోస్టులు ఇచ్చింది వైసీపీ కుటుంబాలకు చెందిన వారికే కదా! కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేదన్నది విష ప్రచారమేనని చెప్పారు. వారిచేత పార్టీ పనులు చేయించుకోవడం వైసీపీకి మొదటి నుంచి అలవాటైపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఉప ఎన్నికల్లో కూడా వారు ఆ పార్టీ కోసం పని చేశారు. బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికలతో పాటు అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరంతా బహిరంగంగానే వైసీపీ అభ్యర్థుల తరపున పనిచేశారు. దాంతో వాలంటీర్ల వ్యవహారశైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలని వైసీపీ నాయకులు, మంత్రులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యానాల పేపర్ కటింగ్స్, వీడియో క్లిప్పింగ్‌లు కూడా ఎన్నికల సంఘానికి చేరాయి. వాలంటీర్లను ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ ఉపయోగపెట్టుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యవస్థను రద్దు చేయమని పలువురు డిమాండ్ చేశారు.
వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించడం, పార్టీ కానివారికి సంక్షేమ పథకాలు నిలిపివేయడం వంటి వారి చర్యలు హైకోర్టు వరకు వెళ్లాయి. అర్హులకు వైఎస్‌ఆర్ చేయూత పథకం నిలిపివేతపై గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన 26 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఏడుగురు వాలంటీర్లకు ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నిర్ణయించడంలో వారెవరని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థపై మే నెలలో ప్రభుత్వాన్ని కోర్టు వివరణ కోరింది. వాలంటీర్ల సర్వీసు నిబంధనలపై ప్రశ్నించింది. వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? అసలు వారు ప్రభుత్వ ఉద్యోగులేనా? లబ్ధిదారుల ఎంపికలో వారి జోక్యం ఏమిటీ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి పెన్షన్ డబ్బు ఇవ్వడం ఏమిటని, వారు తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని ప్రశ్నించింది. సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కోర్టు, అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఏ అభ్యర్థి తరుఫునా పోలింగ్ ఏజెంట్లుగా కూడా వారిని అనుమతించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉంచాలని తెలిపింది. ఈ ఆదేశాలను రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు వెంటనే తెలియజేయాలని, అవి తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఎన్నికల సంఘం కోరింది. ఈ ఆదేశాల ప్రకారం ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఎన్నికల రోజున ఓటరు చీటీల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు, పోలింగ్ విధులు వంటి ఎన్నికలకు సంబంధించిన విధుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు. క్షేత్రస్థాయిలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించకూడదు. అలా చేస్తే అది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమవుతుంది. అయితే, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలనే లెక్కచేయని ఈ ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఆచరణలో ఎలా అమలవుతాయో చూడాలి.