- భర్త బెనిఫిట్స్, ఉద్యోగం రాకుండా అడ్డుకున్నారు
- ప్రజావినతుల కార్యక్రమంలో మహిళ ఆవేదన
- మంజూరైన ఇంటిని తొలగించారని మరొకరి గోడు
- బతుకుదెరువు కోసం పోతే భూమి కబ్జాచేశారని ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన మంత్రి ఫరూక్, పల్లా శ్రీనివాసరావు
మంగళగిరి(చైతన్యరథం): కానిస్టేబులైన తన భర్తను దారుణంగా చంపడంతో అప్పట్లో యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ను నాడు కలిసి తమ గోడు చెప్పుకున్నందుకు గత ప్రభుత్వంలో అప్పటి నాయకులు, పోలీసు అధికారులు తమను ఎస్పీ ఆఫీసుకు పిలిపించి కక్షగట్టి తన భర్తకు రావాల్సిన బెనిఫిట్స్ రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా, స్పెషల్ కేసు కింద ఇస్తామన్న ఉద్యోగం ఇవ్వకుండా అడ్డుకున్నారని న్యాయం చేసి ఆదుకోవాలని నంద్యాలకు చెందిన శ్రావణి మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రజా వినతుల కార్యక్రమంలో గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి ఫరూక్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీని వాసరావు, ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి వినతిని స్వీకరించి న్యాయం చేస్తామని మహిళకు భరోసా కల్పించారు.
` అనంతపురం టౌన్‌కు చెందిన కృష్ణవేణి సమస్యను వివరిస్తూ గత టీడీపీ గవర్నమెంట్ లో తమకు టిడ్కో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేశారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి రెండు విడతల్లో రూ.50 వేలు కట్టాం. తరువాత ప్రభుత్వం మారడంతో తమకు ఇళ్లు మంజూరై డబ్బులు కట్టిన ఇంటిని కూడా రాకుండా చేశారు. తమకు డబుల్ బెడ్ రూమ్ హౌస్ ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంది.
` అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలం దొరగూడ గ్రామానికి చెందిన సర్పంచ్ లక్షణ్, అలాగే కించాయి పుట్టు పంచాయతీకి చెందిన పలువురు గిరిజనులు తమ గ్రామంలో విద్యుత్ సౌకర్యం, రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే కూడా దారిలేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయని దయచేసి రహదారి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.
` కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తికి చెందిన కటకబీబీ తమకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్లైన్లో తమ పేరుమీద ఎక్కించమని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. తమ భూ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
` ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం సుంకేసుల గ్రామానికి చెందిన పాను గంటి రంగయ్య సమస్యను వివరిస్తూ వెలుగొండ ముంపు గ్రామాల్లో తమకు నష్టపరిహారం అందకుండా చేస్తున్నారని, గత 15 ఏళ్లుగా పోరాడుతున్నా పరిహారం జాబితాలో తమ పేరు మాత్రం రావడం లేదని అధికారులు చర్యలు తీసుకుని పరిశీలించి నష్టపరిహారం వచ్చేలా చూడాలని కోరారు.
` విజయవాడ భవానీపురానికి చెందిన సలోమీతో పాటు పలువురు వరద బాధితులు గ్రీవెన్స్‌కు వచ్చారు. తమకు వరద పరిహారం అందలేదని తెలిపారు. కలెక్టరేట్‌కు వెళితే పట్టించుకోకపోవడంతో ఇక్కడకు వచ్చామని చెప్పడంతో వెంటనే మంత్రి ఫరూక్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించి పరిష్కారానికి కృషి చేశారు.
` మత్స్యకారులైన నిరుపేదలకు ఇచ్చిన భూమిలో మట్టి ఫిల్లింగ్ బిల్లులు రాలేదని కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలానికి చెందిన సూర్యరావుపేట మాజీ గ్రామ సర్పంచ్ తెలిపారు. అలాగే గ్రామంలో రామాలయం, స్కూల్, బ్రిడ్జి కోసం దాదాపు రూ.15 లక్షల వరకు వడ్డీలకు తెచ్చి ఖర్చు పెట్టానని వివరించారు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి తన కొడుకు చదువుకు సాయం చేయాలని వేడుకున్నాడు.
` తమ తండ్రికి ప్రభుత్వం 1979లో ఇచ్చిన అసైన్మెంట్ భూమి వేరొకరి పేరుమీదకు మారిందని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం అమలాపురం పంచాయతీకి చెందిన రేళ్ళు జగ్గారావు అతని కుటుంబసభ్యులు తెలిపారు. రైతు భరోసాకు దరఖాస్తు చేయగా ఆ విషయం తెలిసిందని తమ భూమి తమకు ఉండేలా చూడాలని కోరారు.
`తాము బతుకుదెరువుకోసం వలస వెళితే తమ భూమిని దస్తగిరి, జమ్మన్న, కేశన్న, తిరుమల కేశన్న కబ్జా చేశారని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఆలువాల గ్రామానికి చెందిన పారె ప్రవీణ్ వాపోయాడు. కబ్జాదారుల నుంచి తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని విన్నవించారు.
` తాము టీడీపీకి అనుకూలంగా ఉండటంతో 2019లో టీడీపీ అధికారం పోయాక తమ ఇంటి స్థలాన్ని వైసీపీ నేతలు ఆక్రమించారని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కర్లపూడికి చెందిన వెంకాయమ్మ ఫిర్యాదు చేసింది. తాను డయాలసిస్ పేషెంట్‌నని తన ఇంటిని వైసీపీ నేతల నుంచి విడిపించి తన బిడ్డకు న్యాయం చేయాలని, అలాగే తనపై ఉన్న అక్రమ కేసులు తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
` ఏలూరు జిల్లా కామవరపుకోట పంచాయతీలోని గిరజనులైన నాయక్ తెగకు చెందిన వారికి ఎస్టీ కుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కామవరపుకోట టీడీపీ నాయకులు కోరారు.
` గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వల్ల ఉండాల్సిన భూమికంటే తగ్గించి చూపారని కొందరు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీకి సానుకూలంగా ఉన్నారన్న నేపంతో అందాల్సిన సంక్షేమ పథకాలను తమకు ఇవ్వలేదంటూ పలువురు న్యాయం చేయాలని కోరారు. నామినేటెడ్ పదవులు, సీఎంఆర్ఎఫ్ సాయం, పింఛన్ల కోసం పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి.