- అనుసంధానం, నిర్వహణ, సంరక్షణ ప్రధానాంశాలు
- ప్రభుత్వ లక్ష్యం.. జల కరవు రహిత రాష్ట్రం..
- ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టుల చేపట్టాలని నిర్ణయం
- అవుట్సోర్సింగ్ ద్వారా అవసరమైన సిబ్బంది నియామకం
- జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- మంత్రి రామానాయుడుతోపాటు హాజరైన జిల్లాల అధికారులు
అమరావతి (చైతన్య రథం): అభివృద్ధి లక్ష్యంగా అన్ని రంగాలపై తమ విధానాలను ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలోనే అత్యంత కీలకమైన జల విధానాన్నీ ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సమగ్ర వివరాలతో వాటర్ పాలసీ విడుదల చేసే ఆలోచనలో రాష్ట ప్రభుత్వం ఉంది. పాలసీలో నదుల అనుసంధానం, నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, కరవురహిత రాష్ట్రమనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంలోవున్న ప్రాజెక్టుల స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, పెండిరగ్ పనులపై సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లాల్లోని ఇరిగేషన్ అధికార్లు సైతం సమీక్షకు హాజరయ్యారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టి… సాధ్యమైనంత త్వరగా నీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో తొలుత పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏరియాలో డీ వాటర్ పనులు మొదలుపెట్టినట్టు వివరించారు. ఈ ప్రాంతంలో వాటర్ లెవల్‌ను 19 మీటర్లనుంచి 16 మీటర్లకు ఇప్పటి వరకు తగ్గించినట్లు తెలిపిన అధికారులు, ఇప్పటివరకు 0.29 టిఎంసి జలాలను డీవాటరింగ్ ద్వారా తీసివేశామని వివరించారు. బావర్ కంపెనీ ద్వారానే డయాఫ్రం వాల్ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. 2026 మార్చినాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేస్తామని బావర్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే, అంతకంటే ముందుగానే పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరంలో ఫేజ్ `1 పనుల కోసం రూ.7213 కోట్లతో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఖర్చు పెట్టాల్సి ఉందని అధికారులు చెప్పడంతో… దశలవారీగా నిధులు మంజూరుతో పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలకు ఎంత సమయం పడుతుందనేది నిర్దుష్ట ప్రణాళికతో రావాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. దాని ఆధారంగా యాక్షన్ ప్లాన్‌పై ప్రకటన చేద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక `హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని పెంచే అంశంపైనా చర్చ సాగింది. రూ.2561 కోట్లు ఖర్చుపెడితే మొత్తం హంద్రీ`నీవా కాల్వల లైనింగ్ పనులు పూర్తి చెయ్యవచ్చని అధికారులు వివరించారు. కాల్వల సామర్థ్యం పెంపుతోపాటు లైనింగ్ పనులూ పూర్తి చెయ్యవచ్చన్న అధికారుల నివేదికను సీఎం చంద్రబాబు అంగీకరించారు. అదే సమయంలో.. హంద్రీ`నీవా ఫేజ్`2లో భాగంగా అడవిపల్లి రిజర్వాయర్‌కు, నీవా బ్రాంచ్ కెనాల్‌కు నీటిని తీసుకువెళ్లేందుకు పెండిరగ్లో ఉన్న పనులు పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు.
చింతలపూడి లిప్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్ `1 పూర్తికి ఇంకా రూ.2043 కోట్లు ఖర్చవుతుందని అధికారులు సీఎం దృష్టికి తేవడంతో.. వచ్చే సీజన్‌నాటికి మొదటి దశలో నీరందించేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ సమస్యల పరిష్కారం కోసం వారంలో ప్రణాళికతో రావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. గోదావరి `పెన్నా అనుసంధాన ప్రణాళికను చర్చించిన ముఖ్యమంత్రి.. దీనిపై సమగ్ర చర్చకు వివిధ ప్రణాళికలతో రావాలని అధికారులకు సూచించారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్ `1లో రూ.1458 కోట్లు ఖర్చవుతుందని సమావేశం అంచనా వేసింది. ఇందులో సివిల్ వర్కులు రూ.200 కోట్లు కాగా మిగిలింది ఆర్ అండ్ ఆర్, భూసేకరణ ఖర్చు. ఫేజ్ `1లో భాగంగా 1.19 లక్షల ఎకరాలకు వచ్చే సీజన్‌నాటికి నీళ్లిచ్చేలా పనులు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి.. అవసరమైన నిధులు విడుదలకు అంగీకరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్కులు, టన్నెల్స్ 1, 2, ఫీడర్ చానల్, రిజర్వాయర్ రెగ్యులేటర్వంటి నిలిచిపోయిన పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి నీరివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఉత్తరాంధ్రలో వంశధార ఫేజ్ `2 ప్రాజెక్టుకు రూ.122 కోట్లు ఖర్చవుతుందని, వచ్చే సీజన్‌కు పనులు పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఏపీలోవున్న అన్ని ప్రాజెక్టుల్లో కలిపి మొత్తం 983 టిఎంసి నీటి నిల్వ కెపాసిటీ కాగా.. ప్రస్తుతం 840 టిఎంసి నీరు ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షాలు, వరదలు తగ్గేలోగా ఎంత సాధ్యమైతే అంత నీరు తరలించి రిజర్వాయర్లు నింపాలని సీఎం ఆదేశించారు. సోమశిల, కండలేరుకు మరో 46 టిఎంసి నీరు వస్తే పూర్తిగా నిండే అవకాశముందని అధికారులు వివరించారు. నవంబర్‌లోపు ఈ రెండు ప్రాజెక్టులు నీటితో నింపుతామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీటిని తీసుకువెళ్లేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో ఇంకా 21 టిఎంసి నీటి నిల్వకు అవకాశలముందని తెలిపిన అధికారులు, ఉత్తరాంధ్రకు సంబంధించి పెండిరగ్‌లోవున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గ్రౌండ్ వాటర్ మానిటరింగ్, రిజర్వాయర్ వాటర్ లెవల్ మానిటరింగ్ నెట్వర్క్ ఏర్పాటుకు అవసరమైన రూ.23 కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల పూర్తిగా సవివర ప్రణాళికలు సిద్ధమైన తరువాతే సమగ్ర వివరాలతో వాటర్ పాలసీ విడుదల చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. నదుల అనుసంధానం, నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, కరవురహిత రాష్ట్రం అనే అంశాలతో వాటర్ పాలసీని రూపొందించే ఆలోచన చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కోసం ఏటా రూ.983 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా… గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే, ఈ ఏడాదికి అవసరమైన రూ.983 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంట కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ మేనేజ్మెంట్ పద్ధతిన తీసుకోవాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, నిర్వహణా లోపాల కారణంగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిథిలోని మొత్తం 467 లిఫ్ట్ స్కీంలు మూలనడ్డాయని, ఈ కారణంగా 2.9 లక్షల ఎకరాల సాగు తగ్గిందని అధికారులు వివరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్రంలో మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న 8.11 లక్షల ఎకరాల సాగుకు అవసరమైన 1047 ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం, రిపేర్లు కోసం పదేళ్లకు యాన్యుటీ పద్ధతిన ప్రణాళిక సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. నిలిచిపోయిన వరల్డ్ బ్యాంక్, జైకా, పీఎంకెఎస్‌వై, సీఏడీడబ్ల్యుఎం సంస్థల నిధులను మళ్లీ రాబట్టి… మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.