- మహానగరానికి రక్షణ కవచంపైనే దృష్టి
- సురక్షిత స్థాయికి రాజధాని అమరావతి
- ప్రకాశం బ్యారేజీ డిశ్చార్జి సామర్థ్యం పెంపు
- బుడమేరు ప్రవాహాన్ని సులువు చేయడం..
- సమూలంగా.. డ్రెయినేజీ వ్యవస్థ ప్రక్షాళన
అమరావతి (చైతన్య రథం): అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదలకు చిగురుటాకులా వణికిపోయిన విజయవాడ నగరం నెమ్మదిగా తేరుకుంటోంది. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టిన వరద నివారణ చర్యలు, బాధితులకు సహాయక చర్యలతో.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌లో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ‘ఆపరేషన్ ఫ్లడ్’ అద్భుత ఫలితాలు ఇచ్చిందనడానికి.. తేరుకున్న నగరమే నిదర్శనం. ఇక వరద మిగిల్చిన అపార నష్టాన్ని అధిగమించడానికీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వప్రయత్నమే చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితిని కేంద్రానికి నివేదించి.. తగు సాయం అందుకోవడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తోన్న గట్టి ప్రయత్నాన్ని చిన్నది చేసి చూడలేం. మరోపక్క `బుడమేరు విలయాన్ని కళ్లారా చూసిన.. చంద్రబాబు పిలుపును అందుకున్న దాతలూ.. సహాయ నిధికి శక్తిమేర విరాళాలు అందిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కాని, భారీ వరద విజయవాడ మహానగరం ముందు ఒక ప్రశ్నను వదిలివెళ్లింది.
భవిష్యత్‌లో మరోసారి కనుక విరుచుకుపడితే.. నగరం పరిస్థితి ఏమిటి? ఇదే చర్చనీయాంశమవుతున్న అంశం. విపత్తు ఏ క్షణాన విరుచుకుపడుతుందో అంచనా వేయడం అంత సులువేమీ కాదు. లిప్తకాలంలో సంభవించే ప్రమాదాన్ని నివారించేందుకు అప్పటికప్పుడు చేయగలిగేదీ ఏమీ ఉండదు. వరద బాధితులను పరామర్శించి.. ప్రభుత్వ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించిన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాపదేశంగా ప్రస్తావించిన అంశం ఇదే. ప్రకృతినుంచైనా.. మానవ తప్పిద ప్రమాదమైనా.. వచ్చిన వరద లోపాల్ని ఎత్తి చూపి కళ్లు తెరిచేలా చేసిందన్నది నిజం. దశాబ్దాలుగా పెను నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని బుడమేరు విలయం నొక్కిచెప్పింది. భవిష్యత్తులో ఇంతకుమించిన జల ప్రళయాలొచ్చినా.. ఎదుర్కోవడానికి ఎంత సన్నద్ధంగా ఉండాలో చాటిచెప్పింది.
మారుతున్న కాలంలో.. మహానగరాలు వరద ముప్పు, ముంపులను ఎదుర్కొంటోన్న ఘట్టాలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ముంబయి, గుజరాత్, హైదరాబాద్‌లాంటి నగరాలు ఎలా విలవిల్లాడాయో చరిత్ర పుటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు `బెజవాడ వరదతో స్వయంగా అనుభవించాం. కృష్ణా నదికి ఒక ఒడ్డునున్న విజయవాడ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. మరోఒడ్డున రాజధాని అమరావతి నగర నిర్మాణం వేగంగా జరగబోతోంది. ఈ రెండు నగరాలకు ముంపు సమస్య తలెత్తకుండా పటిష్ఠమైన రక్షణ కవచం అవసరమన్నదే ప్రస్తుత ప్రాధాన్యతాంశం. సాధారణానికి కాస్త ఎక్కువ వాన కురిస్తేనే విజయవాడలోని వీధులన్నీ కాల్వలవుతున్నాయి. బుడమేరు ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. కృష్ణా నదికి భవిష్యత్తులో భారీ వరదలు పోటెత్తవన్న గ్యారెంటీ లేదు! వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ఆర్థిక ప్రణాళికే అయినా.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావించి చేపట్టాని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనో, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల రుణ సహకారంతో మహానగరానికి రక్షణ కవచాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని బలంగా ప్రస్తావిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటి ప్రవాహ సామర్థ్యం 11.9 లక్షల క్యూసెక్కులు. 2009 అక్టోబరు 5న ప్రవహించిన 10.94 లక్షల క్యూసెక్కుల నీరే ఇప్పటి వరకూ రికార్డు. అయితే, సెప్టెంబరు 2న బ్యారేజీనుంచి రికార్డుస్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. నాలుగు గంటలపాటు నిరంతరంగా సాగిన ప్రవాహం.. ఒక దశలో 12 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశముందన్న హెచ్చరికలూ జారీ అయ్యాయి. విజయవాడలోని కృష్ణలంకవంటి లోతట్టు ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మధ్యలో మున్నేరు, కట్టలేరు, వైరా, పాలేరు, కీసర, బుడమేరు వంటి వాగులు వచ్చి కృష్ణాలో కలుస్తాయి. భవిష్యత్‌లో క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడితే వాగులు పొంగి.. ప్రకాశం బ్యారేజీకి ఇప్పటికంటే ఎక్కువ వరద పోటెత్తే ప్రమాదం లేకపోలేదు. ఈ అంచనాల నేపథ్యంలో.. ప్రకాశం బ్యారేజీ డిశ్చార్జ్ సామర్ధ్యాన్ని కనీసం 15 లక్షల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు.
వరద నష్టాల అంచనాకు వచ్చిన కేంద్ర బృందానికి సైతం.. ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని విస్పష్టంగా వివరించడం ఇక్కడ ప్రస్తావనార్హం. బ్యారేజ్ డిశ్చార్జ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తగిన ఆర్థిక సాయం కేంద్రం నుంచి తీసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణా నది పొడవు 80కి.మీ.లకు పైగాఉంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23వ కి.మీ. వద్ద వైకుంఠపురంలో 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించొచ్చు. అది ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తకుండా అడ్డుకోవడంతోపాటు, అక్కడ నిల్వ చేసే నీరు ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. బ్యారేజీకి దిగువన 16 కి.మీ.ల వద్ద చోడవరం సమీపంలో 1.70 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, 67 కి.మీ.ల దిగువన బండి కొల్లంక వద్ద 4.70 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించుకునే అవకాశముంది. భవిష్యత్‌లో రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం లేకున్నా.. కృష్ణా కరకట్టలను బలోపేతం చేయాల్సి ఉంది. భవిష్యత్‌లో వరద ఉధృతి పెరిగినా.. రాజధాని నగర వాసులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా ఉండాలంటే.. కరకట్టలు బలహీనపడిన ప్రాంతాలను గుర్తించి బలోపేతం చేయక తప్పదు. ప్రకాశం బ్యారేజీ వద్ద 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా.. రాజధానిలోకి చుక్క నీరు ప్రవేశించకుండా రాజధాని పొడవునా పటిష్టమైన కాంక్రీట్ కట్టడం నిర్మించడం మరింత ఉపయుక్తం.
కొండవీటివాగుకు మెరుపులా వచ్చే వరదల నుంచి ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు సీడబ్ల్యూసీ అబ్జర్వేటరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బుడమేరు వాగు పుట్టుకు ప్రదేశం నుంచి కొల్లేరులో కలిసే వరకు అవసరమైన మేరకు వెడల్పు చేయడం, వాగులో పూడిక, ప్రవాహ మార్గంలోని అనధికారిక కట్టడాలు, ఆక్రమణల తొలగింపు.. ఇవన్నీ ప్రభుత్వం ముందున్న సవాళ్లే. అంతకంటేముందు, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద బుడమేరు డిశ్చార్జి సామర్ధ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచడం, బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచడం, గత ప్రభుత్వం నిలిపివేసిన బుడమేరు విస్తరణ పనుల్ని తక్షణం పూర్తి చేయడంలాంటి చర్యలతో భవిష్యత్ ముప్పునుంచి మహానగరాన్ని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది.